Begin typing your search above and press return to search.

చవితికి డబ్బింగ్ సినిమాలే గతా?

By:  Tupaki Desk   |   30 Aug 2015 6:07 PM GMT
చవితికి డబ్బింగ్ సినిమాలే గతా?
X
తెలుగు రాష్ట్రాల్లో ఓ పండగొచ్చిందంటే సినిమా వాళ్లకూ పండగే. ప్రతి పండక్కీ ఏదో ఒక పెద్ద సినిమా విడుదలై తీరాల్సిందే. తెలుగు వాళ్లకు పెద్ద పండుగల్లో వినాయక చవితి ఒకటి. ప్రతి సంవత్సరం ఈ రోజున ఓ పెద్ద సినిమా రిలీజై తీరుతుంది. గత ఏడాది ఎన్టీఆర్ ‘రభస’ రిలీజైంది. కానీ ఈ సారి మాత్రం ఏ పెద్ద తెలుగు సినిమా ఆ రోజు రిలీజయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ‘రుద్రమదేవి’ని రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ.. తమిళ వెర్షన్ కు ‘పులి’ అడ్డం పడటంతో మళ్లీ అక్టోబరు డేటు కోసం చూస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో వినాయకచవితి ఏ పెద్ద తెలుగు సినిమా లేనట్లే కనిపిస్తోంది.

ఐతే తెలుగు సినిమాల సందడి లేకపోయినా ఆ రోజు రెండు తమిళ డబ్బింగ్ సినిమాలు తెలుగు తెరపైకి దండెత్తి వస్తున్నాయి. ఇందులో ఒకటి విజయ్ నటించిన ప్రెస్టీజియస్ మూవీ ‘పులి’ కాగా.. నయనతార ప్రధాన పాత్రలో నటించిన హార్రర్ సినిమా ‘మాయ’. పులి రిలీజ్ డేట్ చాలా ముందే ఫిక్సయింది. తుపాకి, జిల్లా లాంటి సినిమాలతో తెలుగులో మార్కెట్ పెంచుకున్న విజయ్.. ‘పులి’తో తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న సూర్య, కార్తి లాంటి హీరోల సరసన చేరాలనుకుంటున్నాడు. ఈ సినిమాను తమిళంలో కంటే భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు ‘మాయ’ సినిమాను కూడా కొంచెం గట్టిగానే రిలీజ్ చేయబోతున్నాడు నిర్మాత సి.కళ్యాణ్. వరుసగా డబ్బింగ్ హార్రర్ సినిమాలతో సొమ్ము చేసుకుంటున్న కళ్యాణ్ ‘మాయ’ మీద కూడా చాలా ఆశలే పెట్టుకున్నాడు. మరి ఈ రెండు డబ్బింగ్ సినిమాలకు పోటీగా ఒక్కటైనా తెలుగు సినిమా వస్తుందేమో చూడాలి.