Begin typing your search above and press return to search.
పులి బాలీవుడ్ ని ఒణికిస్తుందా?
By: Tupaki Desk | 21 Sep 2015 5:59 AM GMTభారతదేశ సినీచరిత్రలో అసాధారణ ఫీట్ ని సాధించిన ప్రాంతీయ చిత్రం బాహుబలి. ఓ తెలుగు సినిమా, సౌత్ కి చెందిన సినిమా 600కోట్లు వసూలు చేసి సరికొత్త అధ్యాయానికి తెరతీసిందంటే అది ఎవరూ నమ్మలేనిది. కానీ అది సాధ్యమైంది. జక్కన్న అలియాస్ రాజమౌళి వల్ల సాధ్యమైంది. అయితే ఈ సినిమా తర్వాత మళ్లీ అలాంటి ఫీట్ సాధించే సినిమా ఏది? ప‌్రస్తుతం కోలీవుడ్ లో ఈ విషయంపై సీరియస్ గా డిష్కసన్ సాగుతోంది.
బాహుబలిలానే మరో వార్ ఎపిక్ సినిమా, జానపదం బేస్డ్ కథతో తెరకెక్కిన సినిమా వస్తోంది. విజయ్ హీరోగా చింబుదేవన్ దర్శకత్వం వహించిన పులి అక్టోబర్ 1న గాంధీ జయంతి కానుకగా రిలీజవుతోంది. ఈ సినిమా బాలీవుడ్ సినిమా సింగ్ ఈజ్ బ్లింగ్ కి పోటీగా బరిలోకి దిగుతోంది. స్టార్ హీరో అక్షయ్ కుమార్ తో విజయ్ పోటీకి దిగుతున్నాడు. చింబుదేవన్ దర్శకత్వం వహించిన పులి - ప్రభుదేవా దర్శకత్వం వహించిన సింగ్ ఈజ్ బ్లింగ్ కి పోటీగా దిగుతోంది. అయితే ఈ రెండు సినిమాల్లో గెలుపు ఏ సినిమాని వరిస్తుంది? బాహుబలి - భజరంగి భాయిజాన్ లా ప్యారలల్ గా రెండూ హిట్లు కొడతాయా? ఇలా ఎన్నో సందేహాలున్నాయి.
ముఖ్యంగా బాహుబలి మ్యాజిక్ ని పులి రిపీట్ చేసి సరికొత్త రికార్డుల్ని క్రియేట్ చేస్తుందా? 600కోట్లు పైగా వసూలు చేసి బాలీవుడ్ కి దిమ్మదిరిగే రిజల్ట్ ఇస్తుందా? అన్నది వేచి చూడాల్సిందే. అయితే పులి చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేస్తున్న ప్రహ్లద్ నిహ్లాని ఈ సినిమా విజయంపై కాన్ఫిడెంటుగా ఉన్నారు. పులి భారతదేశమంతటా రిలీజ్ చేస్తున్నాం. ఇది పెద్ద విజయం సాధిస్తుందని నమ్మకం ఉందని ఆయన అన్నారు.
ఏదేమైనా అక్షయ్ సింగ్ ఈజ్ బ్లింగ్ ముందు విజయ్ ఛరిష్మా ఏమేరకు నిలబడుతుందో చూడాలి. అలాగే ఈ రెండు సినిమాలతో పాటు మేఘనా గుల్జార్ తీసిన తల్వార్ చిత్రం అదేరోజు రిలీజవుతోంది. ఈ సినిమాపైనా బాలీవుడ్ లో భారీ అంచనాలున్నాయి. కాబట్టి ఈ పోటీలో విజయ్ సిసలైన వీరుడుగా నిలుస్తాడా? తమిళ పులి అన్న పేరును సార్థకం చేసుకుంటాడా ? చూడాలి.