Begin typing your search above and press return to search.

బాహుబ‌లి తో పోల్చ‌డం మానేస్తే బెట‌రు!

By:  Tupaki Desk   |   20 Aug 2015 5:14 AM GMT


అక్క‌డ `బాహుబ‌లి` ఎలాగో... ఇక్క‌డ `పులి` అలాగ అంటూ త‌మిళ తంబీలు మాట్లాడుకొనేవాళ్లు. కానీ ఆమ‌ధ్య విడుద‌లైన టీజ‌ర్ చూశాక `బాహుబ‌లి`కీ `పులి`కీ మ‌ధ్య న‌క్క‌కీ నాగ లోకానికీ ఉన్నంత తేడా క‌నిపించింది. అయితే కొద్దిమంది మాత్రం ` టీజ‌ర్‌ ని విజువ‌ల్ ఎఫెక్ట్స్ లేకుండా విడుద‌ల చేశారు కాబ‌ట్టి అలా ఉంది, ట్రైల‌ర్ మాత్రం అదిరిపోతుంద‌`ని అన్నారు. నిన్న రాత్రి ట్రైల‌ర్ కూడా విడుద‌లైంది. కానీ అది కూడా ఇంచుమించు అంత‌కు ముందు విడుద‌లైన టీజ‌ర్‌ లాగే ఉంది తప్ప అందులో కొత్త‌ద‌న‌మేమీ క‌నిపించ‌లేదు. `బాహుబ‌లి` స్థాయిలో అస‌లే లేదు. కాస్ట్యూమ్స్ మాత్ర‌మే మార్చేసుకొని విజ‌య్ మ‌ళ్లీ త‌న స్టైల్ మాస్ సినిమానే చేశాడ‌నిపిస్తోంది. అది చూసే సినీ విశ్లేష‌కులు కూడా `పులి`ని `బాహుబ‌లి`తో పోలుస్తూ ప్ర‌చారం చేసుకోవ‌డం మానేయాలంటున్నారు. ప్రేక్ష‌కులు కూడా `పులి`ని ప్ర‌త్యేక‌మైన దృష్టితో చూడాలంటున్నారు.

రాజ‌మౌళి తీసిన `బాహుబ‌లి` ద‌ర్శ‌కుల్లో కొత్త ఆశ‌ల్ని పుట్టించింది. ట్రెండ్ మారినా స‌రే... జాన‌ప‌ద చిత్రాల్ని తెర‌కెక్కించొచ్చు, ప్రేక్ష‌కులు చూస్తారు అన్న ధైర్యాన్నిచ్చింది. దీంతో `పులి`లాంటి చిత్రాలు మొద‌ల‌య్యాయి. `పులి` ఓ ఫాంట‌సీ క‌థ‌తో తెర‌కెక్కింది. జాన‌ప‌ద క‌థా చిత్రం ఫ్లేవ‌ర్‌ లో సాగుతుంది. అలాంటి చిత్రాలు ఇప్పుడు చూడాలంటే టెక్నిక‌ల్‌ గా హై స్టాండ‌ర్డ్స్ ఉండాలి. తెర‌పై లార్జ‌ర్ దేన్ లైఫ్ త‌ర‌హా సినిమా చూస్తున్న అనుభూతి ప్రేక్ష‌కుల్లో క‌ల‌గాలి. అంటే విజువ‌ల్స్‌ తోనే స‌గం కొట్టాలి. ఆ త‌ర్వాత క‌థ‌, హీరోయిజం కీల‌క పాత్ర పోఫిస్తాయి. కానీ `పులి` ట్రైల‌ర్ చూస్తుంటే అందులో హీరోయిజం త‌ప్ప‌... విజువ‌ల్ గ్రాండియ‌ర్ ఏమీ క‌నిపించ‌డం లేదు. నిజంగా సినిమాలో భారీ విజువ‌ల్స్ లేవా లేదంటే అవ‌న్నీ సినిమాలోనే చూపించాల‌ని దాచిపెట్టారా? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. విజ‌య్‌ కి త‌మిళ్‌ లో మాస్ అభిమాన‌గ‌ణం ఎక్కువ‌. వాళ్ల‌ని దృష్టిలో ఉంచుకొనే సినిమా తీశార‌ని అనిపిస్తోంది. ఒక‌వేళ అలాగే అనుకొంటే ఈ జాన‌ప‌దం, ఫాంట‌సీ స్టైల్‌ లో సినిమా తీయ‌డం ఎందుకు? ఎంచ‌క్కా ఓ రెగ్యుల‌ర్ మాస్ క‌మ‌ర్షియల్ సినిమా తీయొచ్చుగా!