Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ కే చుక్కలు చూపించిన పునర్నవి

By:  Tupaki Desk   |   6 Aug 2019 8:02 AM GMT
బిగ్ బాస్ కే చుక్కలు చూపించిన పునర్నవి
X
బిగ్ బాస్ హౌస్ లో ఉండే కంటెస్టెంట్లు.. హౌస్ లో ఉండే ఎవరితోనైనా అటు ఇటు వ్యవహరిస్తారు కానీ.. బిగ్ బాస్ కు మాత్రం ఎదురుచెప్పే ప్రయత్నం చేయరు. ఆయన విషయంలో ఒద్దికగా.. పద్దతిగా ఉంటారు. ఇందుకు భిన్నమైన తీరు సీజన్ 3లో దర్శనమివ్వటం విశేషం. షోలో బిగ్ బాస్ మాటకు తిరుగు ఉండదు. ఆయన నోటి నుంచి వచ్చిన మాటను హౌస్ మేట్స్ బై డిపాల్ట్ అన్నట్లుగా పాటిస్తారు.కానీ.. అందుకు భిన్నమైన తీరును ప్రదర్శించిన పునర్నవి.. బిగ్ బాస్ కే షాకుల మీద షాకులు ఇచ్చిన వైనం సోమవారం నాటి ఎపిసోడ్ హైలెట్ గా చెప్పాలి.

బిగ్ బాస్ కు ఎదురుచెప్పటమే కాదు.. ఆయన ఆదేశాల్ని పక్కన పెట్టేసి షో చూస్తున్న వారికి సైతం షాకిచ్చింది. పునర్నవి తీరుతో చిరాకు పుట్టిన బిగ్ బాస్.. ఆమెకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అయినప్పటికీ.. పునర్నవి మాత్రం దాన్ని కూడా లెక్క చేయకుండా ఢీ అంటే ఢీ అన్నట్లుగా వ్యవహరించిన వైనం ఒక ఎత్తు అయితే.. తీవ్ర ఆగ్రహంతో ఉన్న పునర్నవిని కూల్ చేయటమే కాదు.. బిగ్ బాస్ మాట వినని ఆమెను.. తన మాట వినేలా చేశాడు వరుణ్. అతడి మాటలతో కాస్త తగ్గిన పునర్నవి.. అతడు చెప్పినట్లుగా చేయటంతో బిగ్ బాస్ పరువు నిలిచిందని చెప్పాలి.

ఇంతకీ జరిగిదేమంటే.. ప్రతి సోమవారం మాదిరి ఈ వారం కూడా ఎలిమినేషన్ వ్యవహారం మొదలైంది. ఎప్పటిలానే ఎలిమినేషన్ ప్రక్రియ సాగుతున్న వేళ.. మిగిలిన వారికి భిన్నమైన వాదనను వినిపించింది పునర్నవి. తాను ఎవరిని ఎలిమినేషన్ కు ఎంపిక చేయనంటూ తేల్చి చెప్పింది. ఆమె కోపానికి కారణం లేకపోలేదు. ఎలిమినేషన్ లో భాగంగా అందరూ తనను టార్గెట్ చేసి నామినేట్ చేయటాన్ని తట్టుకోలేకపోయిన పునర్నవి బరస్ట్ అయ్యింది.

ప్రతి ఒక్కరు తనను నామినేట్ చేస్తూ తన క్యారెక్టర్ ఫలానా అంటూ డిసైడ్ చేయటం ఏమిటంటూ భావోద్వేగానికి గురైంది. అందుకే.. తానీ హౌస్ లో ఉండాలని అనుకోవటం లేదంటే తనను తాను సెల్ఫ్ నామినేట్ చేసుకుంది. అంతేకాదు.. దయచేసి మీరెవరూ నా క్యారెక్టర్ ను డిసైడ్ చేయొద్దని పేర్కొంది. తనకు కోపం వచ్చి తప్పు చేస్తే.. వెంటనే వెళ్లి సారీ చెబుతానని.. ఒక మనిషిగా స్పందిస్తానని చెప్పింది. తాను గ్రూపులు కడుతున్నట్లుగా చెప్పి నామినేట్ చేయటం సరికాదని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.

సెల్ఫ్ నామినేట్ చేసుకున్న పునర్నవి నిర్ణయాన్ని బిగ్ బాస్ వ్యతిరేకించారు. ఆట నియమాల ప్రకారం కచ్ఛితంగా ఎవరో ఒకరిని నామినేట్ చేయాలే తప్పించి.. మిమ్మల్ని మీరు నామినేట్ చేసుకోకూడదంటూ స్పష్టం చేశారు. బిగ్ బాస్ చెప్పిన తర్వాత కూడా పునర్నవి వెనక్కి తగ్గలేదు. తనకు నచ్చింది తాను చేస్తానని.. మీరేం చేస్తారో చేసుకోడంటూ మరింత మొండిగా తెగేసి చెప్పేసింది.

దీంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన బిగ్ బాస్.. మీ ఒక్కరి కారణంగా ఆటను పాడు చేయటం సరికాదని.. ఒకవేళ మీరు కానీ ఎవరిని నామినేట్ చేయకుంటే.. హౌస్ మొత్తం నామినేషన్ కు వెళుతుందని హెచ్చరించారు. అంతేకాదు.. శిక్షగా మిమ్మల్ని సీజన్ మొత్తం ఎలిమినేషన్ కి నామినేట్ చేస్తారంటూ బిగ్ బాస్ భారీ వార్నింగ్ ఇచ్చేశారు. అయినప్పటికీ.. వెనక్కి తగ్గని పునర్నివి తీరుతో ఏమవుతుందోనన్న ఉత్కంఠ వ్యక్తమైంది. ఈ వ్యవహారంతో హౌస్ హాట్ హాట్ గా మారింది.

ఇలాంటివేళ రంగంలోకి దిగిన హౌస్ కెప్టెన్ వరుణ్.. పునర్నవిని పక్కకు తీసుకెళ్లి సర్దిచెప్పి కూల్ చేసే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా తనను సీజన్ మొత్తం నామినేట్ చేసినా.. చేయకపోయినా ఇప్పటివరకూ ప్రతి వారం తాను ఎలిమినేషన్ లోనే ఉంటున్నానని.. వరుసగా ఇదే జరుగుతుందని వాపోయింది. చివరకు ఆమెను సర్దిచెప్పటమే కాదు.. ఆమెకు వరుణ్ ఇచ్చిన సలహాతో శాంతించిన పునర్నవి.. నామినేట్ చేయటానికి ఒప్పుకుంది. హౌస్ లో కు బాస్ అయిన బిగ్ బాస్ మాట వినని పునర్నవి.. వరుణ్ మాటలతో మాత్రం పాజిటివ్ గా రియాక్ట్ అయ్యింది.

వరుణ్ సూచనతో అప్పటివరకూ మొండిగా వ్యవహరించిన పునర్నవి.. తాను నామినేట్ చేస్తానని చెప్పింది. హౌస్ లో తనకు బలమైన కంటెస్టెంట్ గా ఉన్న బాబా భాస్కర్ ను నామినేట్ చేసింది. మీరు హౌస్ లో హీరో కావొచ్చు.. కానీ మీరు మాత్రం నాకు ఒక కంటెస్టెంట్ మాత్రమేనని వ్యాఖ్యానించింది. మొత్తంగా సోమవారం ఎపిసోడ్ లో పునర్నవి కాస్త ఎమోషన్.. మరికాస్త సీరియస్ గా అంతకు మించిన మొండితనంతో వ్యవహరించింది. సోమవారం ఎపిసోడ్ లో ఎక్కువ భాగం పునర్నవి చుట్టూనే తిరగటం గమనార్హం.