Begin typing your search above and press return to search.

పూణే త‌ర‌హా ఫిలిం ఇనిస్టిట్యూట్: ప్ర‌భుత్వానికి చేత కాలేదు కానీ ఆయ‌న తెస్తాడ‌ట‌!

By:  Tupaki Desk   |   4 July 2021 4:48 AM GMT
పూణే త‌ర‌హా ఫిలిం ఇనిస్టిట్యూట్: ప్ర‌భుత్వానికి చేత కాలేదు కానీ ఆయ‌న తెస్తాడ‌ట‌!
X
తెలుగు సినీపరిశ్ర‌మ దేశంలోనే అతి పెద్ద ప‌రిశ్ర‌మ‌గా విరాజిల్లుతోంది. ఏ ఇత‌ర ప‌రిశ్ర‌మ‌లో లేనంత‌గా ఈ ఇండ‌స్ట్రీలో భారీ మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు తెర‌కెక్కుతున్నాయి. ఏడాదికి 250 సినిమాల్ని తీస్తూ మ‌న‌వాళ్లు క‌ళాపోష‌కులుగా ఉన్నారు. ఇక్క‌డ వేలాది మందికి ఉపాధి క‌లుగుతోంది. అలాగే మ‌న సినిమాలు పాన్ ఇండియా కేట‌గిరీలో హిందీ చిత్ర‌సీమ‌కే దారి చూపే రేంజుకు ఎదిగాయి. తెలుగు సినిమా అనువాదాలు రీమేక్ ల కోసం బాలీవుడ్ స‌హా ఇత‌ర ప‌రిశ్ర‌మ‌లు ఎంత‌గానో ఎదురు చూస్తున్నాయంటే అర్థం చేసుకోవ‌చ్చు.

అయితే ఇంతగా ఘ‌న‌త వ‌హించిన టాలీవుడ్ కు క‌నీసం ఒక టీవీ-మూవీ ఇనిస్టిట్యూట్ ప్ర‌భుత్వం త‌రపున లేక‌పోవ‌డం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. పూణే ఫిలింఇనిస్టిట్యూట్ త‌ర‌హాలో అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో హైద‌రాబాద్ లో ఒక ఇనిస్టిట్యూట్ ని ప్రారంభిస్తామ‌ని చాలాసార్లు తెలంగాణ ప్ర‌భుత్వ అధినేత‌లు ప్ర‌క‌టించారు. సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్ ఈ విష‌యాన్ని ప‌లుమార్లు ప్ర‌స్థావించారు. కానీ ఇప్ప‌టివ‌ర‌కూ రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున ఎలాంటి ఇనిస్టిట్యూట్ ప్రారంభం కాలేదు. రాష్ట్ర విభ‌జ‌న అయ్యి ఏడేళ్ల‌య్యింది. 2014 లోనే పూణే త‌ర‌హా ఇనిస్టిట్యూట్ అంటూ గ‌డ‌బిడ చేసినా కానీ ఇంత‌వ‌ర‌కూ ఐపు లేద‌న్న తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ క‌ళాకారుల‌కు ఉపాధి పెంచేందుకు శిక్ష‌ణ నిచ్చేందుకు ఈ ఇనిస్టిట్యూట్ ని తెరాస ప్ర‌భుత్వం తెస్తుంద‌ని ప్ర‌చార‌మైంది. కానీ ఇప్ప‌టివ‌ర‌కూ దానికి సంబంధించిన స‌రైన అప్ డేట్ లేనేలేక‌పోవ‌డంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

మ‌రోవైపు మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నిక‌ల వేళ అంత‌ర్జాతీయ ఫిలింఇనిస్టిట్యూట్ ని తెలంగాణ క‌ళాకారుల కోసం తెస్తామంటూ తెలంగాణ న‌టుడు న్యాయ‌వాది సీవీఎల్ న‌ర‌సింహారావు ప్ర‌స్థావించ‌డంతో దీనిపై డిబేట్ మొద‌లైంది. తెరాస ప్ర‌భుత్వం తేలేక‌పోయినా భాజ‌పా ప్ర‌భుత్వంతో చేత‌న‌వుతుంది.. మేం అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో టీవీ మూవీ ఇనిస్టిట్యూట్ ని నెల‌కొల్పుతాం!! అన్న‌ట్టుగా ఆయ‌న చేస్తున్న ప్ర‌చారం వేడి పెంచుతోంది. తెలంగాణ సినిమాకు మేలు జ‌ర‌గాలంటే భాజ‌పా అధికారంలోకి రావాల‌ని ఆయ‌న కొత్త ప్ర‌చారం త‌ల‌కెత్తుకోవ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌ల్లోకి వ‌స్తోంది. ఆయ‌న మా అధ్య‌క్షుడిగా గెలుస్తాడో లేదో తెలీదు కానీ ఆయ‌న ఫిలింఇనిస్టిట్యూట్ పై ఇప్ప‌టి ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తున్న వైనం స‌ర్వ‌త్రా డిబేట్ కి తావిస్తోంది.