Begin typing your search above and press return to search.

ఆ హీరోను కంగారు పెట్టేస్తున్న ప‌వ‌న్

By:  Tupaki Desk   |   18 March 2017 3:12 PM GMT
ఆ హీరోను కంగారు పెట్టేస్తున్న ప‌వ‌న్
X
తెలుగు సినిమాల‌కు క‌ర్ణాట‌క‌లో ఉన్న ఫాలోయింగ్ ఎలాంటిదో కొత్త‌గా చెప్పాల్సిన ప‌ని లేదు. గ‌త కొన్నేళ్ల‌లో అక్క‌డ తెలుగు సినిమాల జోరు బాగా పెరిగింది. అందులోనూ మెగా హీరోల‌కు క‌ర్ణాట‌క‌లో ఫాలోయింగ్ బాగా ఎక్కువ‌. ఇక ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా వ‌చ్చిందంటే అక్క‌డ మోత మోగిపోతుంది. అత‌డి సినిమాలు వ‌స్తున్న‌పుడు క‌న్న‌డ సినిమాల్ని రిలీజ్ చేయ‌డానికి కూడా భ‌య‌ప‌డ‌తారు. ఐతే యువ క‌థానాయ‌కుడు పునీత్ రాజ్ కుమార్ కొత్త సినిమా ‘రాజ‌కుమార’ యాదృచ్ఛికంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా ‘కాట‌మ‌రాయుడు’ రిలీజ‌వుతున్న రోజుకే షెడ్యూల్ అయింది. ఈ చిత్రం కూడా మార్చి 24నే రిలీజ‌వుతోంది.

యాదృచ్ఛిక‌మైన విష‌యం ఏంటంటే.. క‌న్న‌డ అభిమానులు పునీత్ రాజ్ కుమార్ ను కూడా ప‌వ‌ర్ స్టార్ అనే పిలుచుకుంటున్నారు. ఐతే క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ ఇప్పుడు తెలుగు ప‌వ‌ర్ స్టార్ ను చూసి భ‌య‌ప‌డుతున్నాడు. ‘కాట‌మ‌రాయుడు’ క‌న్న‌డ నాట భారీ స్థాయిలో రిలీజ‌వుతోంది. బెంగ‌ళూరు.. బ‌ళ్లారి లాంటి ప్రాంతాల్లో ఎప్ప‌ట్లాగే ఈ సినిమాను కూడా పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ప‌వ‌న్ సినిమాకు ఉన్న క్రేజ్ చూసి పునీత్ సినిమా నిర్మాత‌లు కంగారు ప‌డుతున్నారిప్పుడు. త‌మ సినిమా ఓపెనింగ్స్ కు ప‌వ‌న్ చిత్రం గండికొడుతుంద‌ని భ‌య‌ప‌డుతున్నారు. ‘రాజ‌కుమార’ మీద కూడా అంచ‌నాలు బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. ప‌వ‌న్ సినిమా వ‌ల్ల వ‌సూళ్ల‌పై ప్ర‌భావం త‌ప్ప‌ద‌ని అంచ‌నా వేస్తున్నారు. ‘కాట‌మ‌రాయుడు’కు పాజిటివ్ టాక్ వ‌స్తే ‘రాజ‌కుమార’కు దెబ్బ త‌ప్ప‌ద‌నే భావిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/