Begin typing your search above and press return to search.

పునీత్ రాజ్ కుమార్ నేత్రదానంతో నలుగురికి కంటిచూపు

By:  Tupaki Desk   |   1 Nov 2021 4:37 AM GMT
పునీత్ రాజ్ కుమార్ నేత్రదానంతో నలుగురికి కంటిచూపు
X
అప్పూ అంటూ అభిమానులంతా ప్రేమగా పిలుచుకునే కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణానంతరం కూడా జీవిస్తున్నాడు. ఆయన కళ్లను దానం చేసి ఆ కళ్లతో ఇతరుల ద్వారా ఈ ప్రపంచాన్ని చూడగలుగుతున్నాడు. మరణానంతరం కూడా తన పెద్ద మనసు చాటుకొని నలుగురికి వెలుగులు పంచాడు.

పునీత్ రాజ్ కుమార్ దానం చేసిన కళ్లతో నలుగురికి కంటిచూపు దక్కిందని బెంగళూరులోని నారాయణ నేత్రాలయ వైద్యులు తెలిపారు.ఇటీవల గుండెపోటుతో మరణించిన పునీత్ రాజ్ కుమార్ కళ్లను ఆయన ముందుగానే అనుకున్న ప్రకారం దానం చేశారు. 1994లో పునీత్ తండ్రి, కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ కూడా మరణానంతరం కళ్లు దానం చేశారు. ఆయన స్ఫూర్తితోనే పునీత్ రాజ్ కుమార్ కూడా 2006లో మరణానంతరం రాజ్ కుమార్ కళ్లు దానం చేశారు.

ఆ తర్వాత 2017లో పునీత్ తల్లి పార్వతమ్మ కళ్లను కూడా దానం చేశారు. వారి అడుగుజాడల్లోనే నడిచిన కుటుంబం పునీత్ నేత్రాలను కూడా దానం చేసింది. ఈ కళ్లతో నలుగురికి చూపు దక్కిందని వైద్యులు చెప్తున్నారు. సాధారణంగా ఇలా దానం చేసిన కళ్లను ఇతరులకు ట్రాన్స్ ప్లాంట్ చేస్తామని.. అంటే ఒక వ్యక్తి కళ్లతో మహా అయితే ఇద్దరికీ మాత్రమే చూపు దక్కుతుందని ఒక డాక్టర్ చెప్పారు.

అయితే పునీత్ కళ్లతో మాత్రం నలుగురికి చూపు దక్కిందని.. కార్నియాలను వేరు చేసి నలుగురికి శస్త్రచికిత్స చేశామని వైద్యులు తెలిపారు. కర్ణాటకు చెందిన ఒక మహిళ, ముగ్గురు పురుషులకు ఈ శస్త్రచికిత్సల ద్వారా కంటిచూపు దక్కిందని తెలియజేశారు.

శుక్రవారం ఉదయం తన జిమ్ లో వర్కవుట్ చేస్తున్న సమయంలో పునీత్ కు ఛాతినొప్పి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నొప్పితో కుప్పకూలిన ఆయనను వెంటనే బెంగళూరులోని ఆస్పత్రికి తరలించారు. కాసేపటికే పునీత్ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.