Begin typing your search above and press return to search.

13 గంటలు ఈడీ ఆఫీసులో విచారణ ఎదుర్కొన్న పూరీ.. ఛార్మీ

By:  Tupaki Desk   |   18 Nov 2022 4:26 AM GMT
13 గంటలు ఈడీ ఆఫీసులో విచారణ ఎదుర్కొన్న పూరీ.. ఛార్మీ
X
సంచలన దర్శకుడు పూరీ జగన్నాథ్.. ఆయనతో పాటు కలిసి సినీ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్న నటి ఛార్మీలు తాజాగా ఈడీ ఆఫీసుకు రావటం..అక్కడ ఏకండా 13 గంటల పాటు ఉండటం సంచలనంగా మారింది. నిజానికి గురువారం ఉదయం వారు ఈడీ ఆఫీసుకు విచారణకు హాజరుకాగా.. ఆ విషయం బయటకు పొక్కలేదు. గురువారం రాత్రి వేళలో.. ఈడీ ఆఫీసులో పూరీ.. చార్మీ ఉన్నారన్న విషయం బయటకు వచ్చింది. కాసేపటికే వారు ఈడీ ఆఫీసు నుంచి ముఖానికి మాస్కులు పెట్టుకొని బయటకు రావటం.. మీడియాతో ఏమీ మాట్లాడకుండా తమ వాహనాల్లో బయటకు వెళ్లిపోయారు.

ఇంతకీ ఈ ఇద్దరు సినీ ప్రముఖుల్ని ఈడీ ఎందుకు పిలిచింది? ఏ కేసు విచారణలో అంత సుదీర్ఘంగా వారిని ప్రశ్నించిందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఇచ్చిన ఫిర్యాదుతోనే ఇదంతా జరిగినట్లుగా చెప్పాలి. హీరో విజయ దేవరకొండ నటించిన లైగర్ మూవీకి సంబంధించిన పెట్టుబడులపై జడ్సన్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈడీ స్పందించింది. లైగర్ మూవీలో ఒక ఎమ్మెల్సీ పెట్టుబడులు పెట్టారని.. ఆమెకు సంబంధించిన సొమ్ము పెద్ద మొత్తంలో విదేశాల నుంచి లైగర్ నిర్మాతకు చేరినట్లుగా బక్క జడ్సన్ పేర్కొన్నారు.

ఈ సినిమాకు దర్శక నిర్మాతగా వ్యవహరించిన పూరీ అకౌంట్ తో పాటు.. నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరిస్తున్న చార్మీ బ్యాంకు ఖాతాకు విదేశాల నుంచి పెద్ద ఎత్తున నిధులు వచ్చినట్లుగా చెబుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పెట్టుబడులు వచ్చాయన్న ఆరోపణలపై మనీలాండరింగ్ కోణంలో ఈడీ వారిని విచారిస్తోంది. విచారణకు అవసరమైన పత్రాలతో పూరీ.. చార్మీ హాజరయ్యారు.

వారిద్దరిని వేర్వేరుగా విచారణ చేసినట్లుగా చెబుతున్నారు. ఈ మొత్తం ప్రక్రియ దాదాపు పదమూడు గంటలకు పైనే సాగినట్లుగా చెబుతున్నారు. మధ్యలో లంచ్ విరామాన్ని తీసివేయటంతో పాటు.. ఇతర ప్రక్రియల్ని మినహాయిస్తే పది గంటల పాటు మాత్రం పక్కాగా విచారణ సాగినట్లుగా తెలుస్తోంది. లైగర్ లో ఎవరెవరు పెట్టుబడులు పెట్టారు? నిధుల సమీకరణ ఎలా సాగింది? చిత్ర నిర్మాణ ఖర్చులు.. వచ్చిన ఆదాయం.. పంపకాలకు సంబంధించిన వివరాల్ని ఆరా తీసినట్లుగా చెబుతున్నారు.

గత సెప్టెంబరులో ఎమ్మెల్సీ సినిమాల్లో తన నల్లధనాన్ని పెట్టుబడులుగా పెడుతున్నట్లుగా బక్క జడ్సన్ ఈడీకి ఫిర్యాదు చేశారు. ఈ సినిమా విషయంతో పాటు.. ఎమ్మెల్సీ పలు విద్యా సంస్థల్లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారని.. డ్రగ్స్ కేసులో పూరీ.. చార్మీతో పాటు సినిమా రంగానికి చెందిన మరికొంత మంది ప్రముఖులకు ఈడీ విచారించిందని చెబుతూ.. ఈ కేసు ద్వారా లైగర్ సినిమా పెట్టబడులపై సమగ్ర విచారణ కోరిన నేపథ్యంలో ఈ సుదీర్ఘ విచారణ సాగినట్లుగా తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.