Begin typing your search above and press return to search.

ఆ సీనియర్ హీరోయిన్ కోసం పూరి అలా చేశాడట!

By:  Tupaki Desk   |   15 Jun 2022 12:30 AM GMT
ఆ సీనియర్ హీరోయిన్ కోసం పూరి అలా చేశాడట!
X
పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి హీరోగా నిలదొక్కుకోవడానికి తవంతు ప్రయత్నం చేస్తున్నాడు. 'రొమాంటిక్' వంటి సినిమాలతో లవర్ బాయ్ గా యూత్ నుంచి మంచి మార్కులు కొట్టేస్తూనే, మాస్ ఆడియన్స్ మనసులు గెలుచుకోవడానికి తనవంతు కృషి చేస్తున్నాడు. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'చోర్ బజార్' రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆకాశ్ పాల్గొన్నాడు. తనకి సంబంధించిన అనేక విషయాలను ఆయన ప్రేక్షకులతో పంచుకున్నాడు.

ఆకాశ్ మాట్లాడుతూ .. "ఈ కార్యక్రమానికి ఎంతోమంది స్టార్స్ వచ్చారు .. అలాంటి వాళ్లందరూ కూర్చున్న ఈ ప్లేస్ లో నేను కూర్చోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. 'చోర్ బజార్' హీరోగా నా మూడో సినిమా.

ఈ సినిమాలో నా పాత్ర పేరు బచ్చన్ సాబ్. అమితాబ్ గారంటే నాన్నకు చాలా ఇష్టం. ఆయన పేరును నా పాత్రకి పెట్టడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఈ సినిమాలో సీనియర్ ఆర్టిస్ట్ 'అర్చన' గారు నటించారు. హీరోయున్ గా ఆమె చేసిన 'నిరీక్షణ' చూశాను. ఆమె ఎంత గొప్ప ఆర్టిస్ట్ అనేది అప్పుడు నాకు అర్థమైంది.

అర్చన గారు హీరోయిన్ గా చేస్తున్నప్పుడు ఒకసారి డబ్బింగ్ స్టూడియోకి వచ్చారట. అప్పట్లో ఆమె అంటే మా నాన్నకి ఎంతో అభిమానం. ఆమెను చూడాలనే ఉద్దేశంతో ఆ స్టూడియో గోడపైకి ఎక్కడానికి ట్రై చేస్తుంటే సెక్యూరిటీ అతను వచ్చి లాఠీతో ఒకటి పీకి పంపించాడట.

ఈ విషయం నాన్ననే చెప్పారు. అలాంటి ఆమెతో నటించే అవకాశం రావడం అదృష్టంరా అని నాతో అన్నారు. షూటింగు సమయంలో నిజంగానే ఆమె నన్ను ఓ మదర్ లా చూసుకున్నారు. నేను కూడా ఆమెను 'అమ్మా' అనే పిలుస్తున్నాను.

నాకు కష్టం తెలియాలనే ఉద్దేశంతో .. అందరూ ఒక్కటే అనే విషయం అర్థం కావడం కోసం నాన్న నాతో కొన్ని పనులు చేయించారు. 'నేనింతే' సినిమాకి ఒక రోజంతా ప్రొడక్షన్ బాయ్ గా పనిచేశాను. షూటింగులో అందరికీ నాతో కాఫీలు .. టీలు ఇప్పించారు. తన దగ్గర కూర్చోవద్దనీ .. తన కారవాన్ కి రావొద్దని చెప్పారు. ప్రొడక్షన్ బాయ్స్ దగ్గరే నేను ఉండాలని అన్నారు. అలా రవితేజ గారి దగ్గరికి టీ ఇవ్వడానికి వెళితే, ఆయన నన్ను తన దగ్గర కూర్చోబెట్టుకోబోయారు. నాన్న నన్ను అక్కడి నుంచి తరిమేశారు" అంటూ చెప్పు కొచ్చాడు.