Begin typing your search above and press return to search.

పూరీని బాయ్ కాట్ చేస్తారా?.. జరిగే పనేనా?

By:  Tupaki Desk   |   29 Oct 2022 2:30 AM GMT
పూరీని బాయ్ కాట్ చేస్తారా?.. జరిగే పనేనా?
X
టాలీవుడ్ సీనియర్ దర్శకులలో ఒకరైన పూరీ జగన్నాథ్ గత కొన్ని రోజులుగా అనుకోని విధంగా వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన తెరకెక్కించిన 'లైగర్' సినిమా తాలూకు సెటిల్మెంట్ వ్యవహారం వివాదంగా మారడం.. అది కాస్తా పోలీస్ స్టేషన్ వరకూ చేరడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

గతంలో పూరీ జగన్నాథ్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన 'నేనింతే' సినిమా విషయంలోనూ ఇలాంటి వివాదమే చోటు చేసుకుంది. నష్టపరిహారం కోసం ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఫిలిం ఛాంబర్ ముందు టెంట్లు వేసి ధర్నాకు దిగారు. టాలీవుడ్ లో ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారిగా పేర్కొంటారు. ఆ తర్వాత అనేక సినిమాల సెటిల్మెంట్ వ్యవహారాల్లో వివాదాలు జరిగాయి.

ఇప్పుడు 'లైగర్' డిజాస్టర్ కావడంతో పూరీ జగన్నాథ్ తో పాటుగా సినిమాతో సంబంధం ఉన్నవారందరూ నష్టపోయారు. అయితే దర్శక నిర్మాత దీనికి నైతిక బాధ్యత వహిస్తూ బయ్యర్లకు ఎంతో కొంత సెటిల్ చేయడానికి అంగీకరించారు. దీని కోసం కొంత గడువు తీసుకున్నారు. రోజులు గడేస్తున్నా డబ్బులు రాకపోవడంతో పూరీ ఇంటి ముందు ధర్నాకు దిగాలని నిర్ణయించుకున్నారు.

'నేనింతే' అనుభవాన్ని దృష్టిలో పెట్టుకున్నాడేమో మరి.. పూరీ జగన్నాథ్ ఈసారి డిస్ట్రిబ్యూటర్లు ఫైనాన్సియర్ల మీద పోలీస్ కేసు పెట్టారు. దీంతో లైగర్ వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో ఇకపై పూరీ సినిమాకు ఫైనాన్స్ చేయకూడదని టాలీవుడ్ ఫైనాన్షియర్లు అంతర్గత నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో రూమర్స్ చక్కర్లు కొట్టాయి.

అంతేకాదు భవిష్యత్ లో పూరీ జగన్నాథ్ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేయకూడదని.. అతని చిత్రాలను కొనకుండా బాయ్ కాట్ చేయాలని ఆలోచిస్తున్నట్లు కూడా పుకార్లు వచ్చాయి. ఒకవేళ ఇదే నిజం అనుకుంటే.. ఎవరైనా దర్శకుడి సినిమాలను బాయ్ కాట్ చేయడం లేదా బ్యాన్ చేయడం అనేది అంత ఈజీ కాదు.

సినిమా అనేది కొన్ని కోట్ల రూపాయలతో కూడిన వ్యవహారం. ఇందులో ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక పార్టీల ఇన్వాల్వ్ మెంట్ ఉంటుంది. పూరీ జగన్నాథ్ ఒక్కడి మీదేబ్యాన్ విధించాలంటే.. సినిమాతో సంబంధం ఉన్న మిగతా అందరినీ బ్యాన్ చేసినట్లే అవుతుంది.

ఇప్పుడంటే 'లైగర్' పూరీ సొంత సినిమా కాబట్టి.. సెటిల్ మెంట్ వ్యవహారం అతని మెడకు చుట్టుకుంది. అదే వేరే ప్రొడక్షన్ లో సినిమా చేస్తే బాయ్ కాట్ చేయగలరా?. సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయకుండా.. హీరో మరియు నిర్మాతతో కూడా దూరం పెంచుకుంటారా? అనేది ఆలోచించుకోవాలి.

కరోనా పాండమిక్ టైంలో తమిళ హీరో సూర్య తన బ్యానర్ లో రూపొందించే సినిమాలను డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేయడంతో.. డిస్ట్రిబ్యూటర్స్ - ఎగ్జిబిటర్స్ సంఘాలు అతన రాబోయే చిత్రాలపై బ్యాన్ విధిస్తామని హెచ్చరించారు. కానీ 'ఈటీ' చిత్రాన్ని థియేటర్లలోనే రిలీజ్ చేశారు.

అలానే మలయాళ హీరో ఫహద్ ఫాజిల్ కూడా తన సినిమాలను నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్నారని.. అక్కడి డిస్ట్రిబ్యూటర్లు అతని చిత్రాలను బ్యాన్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే చివరకు అందరూ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు 'లైగర్' వివాదంలో పూరీ జగన్నాథ్ పై ఆగ్రహం వ్యక్తం చేయొచ్చు కానీ.. ఆలోచిస్తే బ్యాన్ చేయడం సాధ్యపడదనే చెప్పాలి.

ఎందుకంటే సినిమా అనేది కూడా ఒక వ్యాపారమే. ఇక్కడ ఎన్ని వివాదాలు గొడవలు ఉన్నా ఒకరితో మరొకరికి అవసరం ఉంటుంది. సత్సంబంధాలు కొనసాగించాల్సి ఉంటుంది. ఇప్పుడు పూరీ వ్యవహారం కూడా కొన్ని రోజులకు ఏదొక విధంగా పరిష్కరించుకుంటారు. కాబట్టి ఏదొక రోజు అంతా నార్మల్ అయ్యే అవకాశం ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.