Begin typing your search above and press return to search.

పూరీ విచారణ.. ఆ 11 గంటల్లో ఏమైంది?

By:  Tupaki Desk   |   19 July 2017 4:51 PM GMT
పూరీ విచారణ.. ఆ 11 గంటల్లో ఏమైంది?
X
సినీ ఇండస్ర్టీలో సంచలనంగా మారిన డ్ర‌గ్స్ కేసులో ప్రముఖ దర్శకుడు పూరీ జ‌గ‌న్నాథ్‌ ను సిట్ అధికారులు ఈ రోజు 11 గంటల పాటు విచారించారు. ఉద‌యం 10.30 గంట‌ల‌కు ప్రారంభమైన‌ విచార‌ణ రాత్రి 9.30కి ముగిసింది. 9.40కి పూరీ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ కేసులో పూరీ నుంచి రాబ‌ట్టిన అంశాల‌ను అధికారులు కొంతమేర వెల్లడించారు. ఉస్మానియా నుంచి వచ్చిన వైద్యలు పూరీ రక్త నమూనాలు తీసుకున్నారు.

విచారణలో భాగంగా పూరీ నుంచి అనేక అంశాలకు సంబంధించి సమాచారం రాబట్టారు. వివిధ కోణాల్లో ప్రశ్నలు సంధించగా పూరీ పలు అంశాల్లో బుకాయించే యత్నం చేసినా అందుకు తగిన ఆధారాలను సిట్ అధికారులు చూపడంతో పూరీ అంగీకరించక తప్పలేదని తెలుస్తోంది. ముఖ్యంగా డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్ తో ఉన్న పరిచయం.. ఆయన్ను ఇంతకుముందు ఎప్పుడైనా కలిశారా అని ప్రశ్నించగా పూరీ తొలుత తెలియదని చెప్పారని.. కానీ, జ్యోతిలక్ష్మి సినిమా ఫంక్షన్, ఛార్మి బర్త్ డే వేడుకల్లో కెల్విన్ - పూరీలు ఉన్న ఫొటోలను వారు చూపించడంతో కలిసినట్లుగా పూరీ అంగీకరించారని సమాచారం. అయితే... ఒక ఈవెంట్ మేనేజర్ గా మాత్రమే ఆయన తనకు తెలుసని, అంతే తప్ప డ్రగ్స్ విషయంలో సంబంధం లేదని పూరీ చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే.. అధికారులు మాత్రం పూరీ, కెల్విన్ల మధ్య ఉన్న సంబంధాల గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు. ఇప్పటివరకు విచారణలో వెల్లడైన విషయాలన్నీ కూడా బయటపెట్టలేమని తెలిపారు.

అయితే... కొన్ని విషయాలను అధికారులు చెప్పకపోయినా అక్కడి పరిస్థితులను బట్టి మీడియాలో వెల్లడయ్యాయి. ముఖ్యంగా ఉస్మానియా నుంచి వైద్యులు రావడంతో పూరీ గత 48 గంటల్లో డ్రగ్స్ తీసుకున్నారో లేదో నిర్ధారించడానికి గాను బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారన్న వార్తలు వెలువడ్డాయి. విచారణ అనంతరం ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్ కూడా ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించారు.

పూరీని ప్రశ్నించిన అధికారుల బృందానికి ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ నేతృత్వం వహించారు. ఈ మొత్తం విచారణను ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ చంద్రవదన్‌ - ఎన్‌ పోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ పర్యవేక్షించారు. గురువారం శ్యామ్‌ కే నాయుడును ప్రశ్నించనున్నట్లు అకున్‌ తెలిపారు. దర్యాప్తు సజావుగా సాగుతోందని ఆయన అన్నారు.