Begin typing your search above and press return to search.

దాసరి ఉండుంటే బాగుండు-పూరి

By:  Tupaki Desk   |   7 May 2018 5:30 PM GMT
దాసరి ఉండుంటే బాగుండు-పూరి
X
దశాబ్దాల పాటు సినీ పరిశ్రమ సమస్యల్ని తన సమస్యలుగా అనుకుని పోరాటం సాగించారు. ఎందరికో అండగా నిలిచారు దర్శకరత్న దాసరి నారాయణరావు. ఐతే ఆయన వెళ్లిపోయాక పరిస్థితి అదుపు తప్పింది. ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అనే వాళ్లు లేకపోయారు. చిన్న సమస్యలు కూడా పెద్దవైపోతున్నాయి. అల్లరల్లరి అయిపోతోంది ఇండస్ట్రీ. ఈ నేపథ్యంలో అందరికీ దాసరి నారాయణరావే గుర్తుకు వస్తున్నారు. ఆయన ఉండుంటే.. అన్న మాట అందరి నోటి నుంచి వస్తోంది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. దాసరి లేని లోటు ఎప్పటికీ లోటుగానే ఉండిపోతుందని.. ఆయన ఇప్పుడు ఉండుంటే బాగుండేదని అనిపిస్తోందని పూరి అన్నాడు.

‘‘దాసరి గారు ఉండుంటే ఇన్ని గొడవలు జరిగేవి కావు. ఆయన జరగనిచ్చేవారు కాదు. అందరినీ పిలిచి మాట్లాడేవారు. అలాంటి మనిషి పుట్టరు. రారు. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. ఆ లోటు ఎప్పటికీ లోటే. నాయకత్వం అనేది ఒకరు ఇచ్చేది కాదు. తీసుకోవాలి. అందరినీ ముందుండి నడిపించాలి. ఆ లక్షణాలు దాసరి గారిలో ఉండేవి. అందుకే ఆయనంటే నాకు చాలా గౌరవం. ఒక సందర్భంలో ‘నా వారసుడు పూరీనే’ అని ఆయన అన్నారు. అది నా జీవితంలో అతి గొప్ప కాంప్లిమెంట్ గా భావిస్తా’’ అని పూరి చెప్పాడు. ఇక గత ఏడాది డ్రగ్స్ కుంభకోణానికి సంబంధించి తన పేరు వినిపించినపుడు తన ఇంట్లో అందరూ చాలా వేదనకు గురయ్యారని పూరి చెప్పాడు. కొన్నేళ్ల కిందట తనకు జరిగిన మోసం గురించి స్పందిస్తూ.. నమ్మినవాళ్లు మోసం చేసినపుడు తాను ఏడ్చానని.. కానీ అది కొంతసేపే అని.. తర్వాత పనిలో పడిపోయానని.. మళ్లీ పూర్వపు స్థితికి చేరుకున్నానని పూరి చెప్పాడు.