Begin typing your search above and press return to search.

లోఫర్ 7.5 కోట్లు కాదు.. 3.4 కోట్లేనట

By:  Tupaki Desk   |   19 April 2016 4:31 AM GMT
లోఫర్ 7.5 కోట్లు కాదు.. 3.4 కోట్లేనట
X
సినిమాలకు సంబంధించి డబ్బు లెక్కలు ఎలా ఉంటాయో.. పరిశ్రమలో ఎన్నెన్ని గోల్ మాల్స్ జరుగుతాయో.. ‘లోఫర్’ మూవీకి సంబంధించి దర్శకుడు పూరి జగన్నాథ్ కు - డిస్ట్రిబ్యూటర్లకు మధ్య నడుస్తున్న గొడవ పుణ్యమా అని అందరికీ బాగానే అర్థమవుతోంది. పెద్దగా ఫామ్ లో లోని పూరి జగన్నాథ్.. రెండు సినిమాల వయసున్న.. మాస్ ఇమేజ్ కూడా రాని వరుణ్ తేజ్ తో చేసిన ‘లోఫర్’ నైజాం హక్కులు రూ.7.5 కోట్లు పలకడం అప్పట్లో సంచలనం రేపింది. ఏం చూసి ఈ సినిమాకు ఇంత పెట్టేశారబ్బా అని అంతా ఆశ్చర్యపోయింది. ఐతే వాస్తవానికి లోఫర్ నైజాం హక్కుల కోసం ఇచ్చింది రూ.3.4 కోట్లే అని ఇప్పుడు వెల్లడిస్తున్నాడు పూరి జగన్నాథ్. ఇందులో మతలబు ఏంటో తెలుసుకుందాం పదండి.

లోఫర్ సినిమా డిస్ట్రిబ్యూటర్లయిన ముగ్గురిలో ఇద్దరు అభిషేక్.. సుధీర్..ఆ సినిమా విడుదలకు ముందే పూరిని కలిశారట. తమ బేనర్లో ఐదు సినిమాలు చేసేలా ఒప్పందం చేసుకున్నారట. మూడో డిస్ట్రిబ్యూటర్ ముత్యాల రాందాస్ తనకో సినిమా ప్రత్యేకంగా చేసి పెట్టాలని అడిగారు. కానీ తనతో సినిమా ఒప్పందాల పేరుతో వాళ్ల అప్పుల్ని తన మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారని పూరికి తర్వాత అర్థమైందట. తమ నష్టాలు ఎక్కువ చూపించి ఆదాయపు పన్ను ఎగ్గొట్టడం కోసం ముందే ప్లాన్ చేసుకుని ‘లోఫర్’ నైజాం హక్కుల్ని రూ.7.5 కోట్లకు కొన్నట్లు ప్రమోషన్లలో ఘనంగా చెప్పుకున్నారని.. తనను చూసే అంత రేటు పెట్టామని ప్రకటించుకున్నారని.. వాస్తవానికి నైజాం హక్కుల కోసం వాళ్లు నిర్మాతకు ఇచ్చింది రూ.3.4 కోట్లే అని పూరి వెల్లడించాడు. ఈ ముగ్గురు డిస్ట్రిబ్యూటర్లూ డ్రామా ఆడారని.. తప్పులు లెక్కలు చూపించి మోసం చేయాలని చూశారని పూరి అన్నాడు.

అంతా బాగుంది కానీ.. అప్పుడు రూ.7.5 కోట్లకు నైజాం హక్కులు తీసుకున్నట్లు గొప్పగా చెప్పుకున్నపుడు పూరి సైలెంటుగా ఉండటం ఎలాంటి సంకేతాల్నిస్తుంది. ఇప్పుడు గొడవ జరిగింది కాబట్టి వాస్తవ లెక్కలేవో బయటికి వచ్చాయి. లేదంటే జనాలు అదే వాస్తవమని నమ్మేవాళ్లు. మన సినిమాలకు సంబంధించి లెక్కలు ఇలా ఉంటాయి మరి. కలెక్షన్ల రికార్డు.. బిజినెస్ రికార్డుల్లో కూడా ఎంత డ్రామా నడుస్తుందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. అందుకే ఆ మధ్య తమిళంలో అజిత్ సినిమా ‘వేదాలం’ గురించి అభిమానులు ఇష్టానుసారం రికార్డుల గురించి ప్రచారం చేస్తుంటే.. అసలు వీళ్లకు బాక్సాఫీస్ లెక్కలెలా ఉంటాయో తెలుసా అంటూ విరుచుకుపడిపోయాడు నిర్మాత ఎ.ఎం.రత్నం.