Begin typing your search above and press return to search.

మీ వయస్సు మోక్షజ్ఞ వయస్సు కాదండీ!!

By:  Tupaki Desk   |   18 Aug 2017 3:30 AM GMT
మీ వయస్సు మోక్షజ్ఞ వయస్సు కాదండీ!!
X
ఈ డైలాగ్ ఎక్కడో ఫేస్ బుక్కులోనో వాట్సాప్ లోనో చెప్పింది కాదండోయ్.. ఏకంగా దర్శకుడు పూరి జగన్ స్వయంగా ''పైసా వసూల్'' ఆడియో ఫంక్షన్లో పేల్చాడు. నందమూరి బాలకృష్ణను ఆకాశానికి ఎత్తేసిన పూరి.. ఈ ఈవెంట్లో అభిమానుల కోసం సినిమాలో రాసిన డైలాగులు కాకుండా చాలా కొత్త విషయాలే చెప్పాడు. ముఖ్యంగా బాలయ్య గురించి కొత్త విషయాలు చెప్పి అలరించాడు.

చాలా ఏళ్ల తరువాత బాలయ్యతో కలసి పనిచేసే ఛాన్సు వచ్చిందిని.. అసలు ఇన్ని రోజులు ఆయనతో చేయకుండా ఏమైపోయానా అనుకున్నానని చెబుతూ.. ''బాలయ్య చాలా మంచి వ్యక్తి. ఆయనకు ప్రేమొచ్చినా కోపం వచ్చినా అది ముఖం మీద చెప్పేస్తాడు'' అంటూ చెప్పాడు పూరి. అంతేకాదు.. అసలు బాలయ్య ఎప్పుడూ ఏం చేస్తూ ఉంటారో కూడా వివరించాడు. ''అయితే.. ఆయన తన తండ్రి నందమూరి తారక రామారావు గారి గురించి మాట్లాడుతుంటారు.. లేదంటే సినిమా. ఇవి రెండే ఆయన ప్రపంచం. ఇక ఆయన ఫోన్లో మాట్లాడుతున్నారంటే.. అయితే హిందూపూర్ అని వినిపిస్తుంది.. లేదంటే క్యాన్సర్ హాస్పటల్ అని వినిపిస్తుంది. అవి రెండూ తప్ప ఆయన ఇంకో విషయం మాట్లాడరు'' అంటూ సెలవిచ్చాడు పూరి.

ఈ సినిమాలో బాలయ్య దూకుడు గురించి చెబుతూ.. ''ఆయన ఫైట్లు అంటే దూకేస్తాడు. కార్లను గిరగిరా తిప్పేస్తాడు. హీరోయిన్లను అమాంత గాల్లోకి ఎత్తేస్తాడు. ఆ ఎనర్జీ చూస్తే నాకు చాలాసార్లు ఓ మాట చెప్పాలని అనిపించేది. సార్ మీది మోక్షజ్ఞ వయస్సు కాదు.. కాస్త ఎక్కువ అని'' అంటూ నందమూరి ఫ్యాన్స్ ను తుళ్ళింతకు గురి చేశాడు.

ఇక పైసా వసూల్ సినిమాలో పనిచేసిన నటీనటులకు థ్యాంక్స్ చెబుతూ.. మంచి మ్యూజిక్ ఇచ్చిన అనూప్ రూబెన్స్ ను పొగుడుతూ.. పూరి సెలవు తీసుకున్నాడు. వెళుతూ వెళుతూ.. ''కోకా కోలా పెప్సి.. బాలయ్య బాబు సెక్సీ'' అని చెబుతూ.. 'థ్యాంక్యూ బాలా' అంటూ ముగించాడు. మొత్తానికి పూరి పూర్థిస్థాయిలో బాలయ్య ఫ్యాన్ అయిపోయినట్లున్నాడే. అందుకే పైసా వసూల్ షూటింగ్ పూర్తయ్యాక బోర్ ఫీలవుతున్నాడట. అది సంగతి.