Begin typing your search above and press return to search.

ఏదొక రోజు ఆపేస్తాం.. ఎవరిని వదలొద్దు: పూరీ మ్యూజింగ్స్

By:  Tupaki Desk   |   19 May 2021 1:34 PM GMT
ఏదొక రోజు ఆపేస్తాం.. ఎవరిని వదలొద్దు: పూరీ మ్యూజింగ్స్
X
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. మంచి డైలాగ్ రైటర్ మాత్రమే కాదు మంచి మోటివేషనల్ స్పీకర్ కూడా అని ఇప్పుడిప్పుడే పూరీ మ్యూజింగ్స్ వినేవారికి అర్ధమవుతుంది. ఎందుకంటే పూరీ జీవిత సత్యాలు ఎలా ఉంటాయో అందరికి తెలిసిందే. లైఫ్ స్టైల్ గురించి ఆయన చెప్పే విషయాలు సోషల్ మీడియా ద్వారా లక్షల మందికి రీచ్ అవుతున్నాయి. కొంతకాలంగా సాలిడ్ హిట్ కోసం ట్రై చేస్తున్న పూరీ.. చివరిగా ఇస్మార్ట్ శంకర్ తీసి హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం తెలుగు మాత్రమే కాదని పాన్ ఇండియా మూవీ రూపొందిస్తున్నాడు. యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ హీరోగా బాక్సింగ్ నేపథ్యంలో లైగర్ అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదల కాబోతుంది.

అయితే తాజాగా పూరీ మ్యూజింగ్స్ నుండి 'క్వశ్చన్ ఎవరీ థింగ్..?' అనే అంశం పై పూరీ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. "జీవితంలో ఎందుకు? ఏమిటి? ఎక్కడ? ఎప్పుడు? ఎలా? ఎందుకలా.. అంటూ వీటితోనే చిన్నప్పుడు లైఫ్ స్టార్ట్ అవుతుంది. మనం మాటలు నేర్చుకున్న క్షణం నుంచి ప్రశ్నలు బయటికి వస్తాయి. వాటిలో పేరెంట్స్ కొన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతారు. అలా అన్నిటికి చెప్పరు. కొన్ని ప్రశ్నలకు మన నోరు నొక్కేస్తారు. మిమ్మల్ని ఎవరైనా.. ‘అలా అడక్కు కళ్లుపోతాయ్‌' అని అంటే మాత్రం వాళ్లని అండర్‌లైన్‌ చేయండి. అలా అన్నారంటే అక్కడ ఏదో తేడా విషయం ఉందని అర్థం. మనం ప్రతిదాన్ని ప్రశ్నించాలి. అలా ప్రశ్నిస్తేనే నేర్చుకుంటాం.

కానీ ప్రతిదీ అడిగి తెలుసుకోండి. కానీ అడగటంలో తేడా చూపించాలి. ఏ ప్రశ్న అడిగినా అమాయకంగా.. నవ్వుతూ అడగండి. ఎప్పుడైనా మంచి ప్రశ్నలకే మంచి సమాధానాలు వస్తాయి. ఎప్పుడైనా వరస్ట్ ప్రశ్నకు అద్భుతమైన సమాధానం ఎన్నటికీ రాదు. మనం ప్రశ్న అడిగితే అవతలి వ్యక్తి ఆలోచనల్లో పడాలి. ప్రపంచంలో అందర్నీ ప్రశ్నించండి. ఎవర్నీ వదిలిపెట్టవద్దు. ఎందుకంటే ఈ ప్రపంచంలో చాలామంది అబద్ధపు సిద్ధాంతాల కోసం పోరాటం చేస్తూ బతికేస్తున్నారు. అలాంటి యుద్ధాల్లో మీరు ఉండకూడదు. గుడ్డిగా నమ్మితే వాళ్ల యుద్ధాల్లో మీరు కూడా ఉన్నట్లే. వాటి నుంచి బయటకు రావాలంటే ప్రశ్నించాలి. అయితే మనలో మొదలైన ప్రశ్నలన్నీ ఏదో ఒకరోజు ఆగిపోతాయి. అప్పుడు మనం మాట్లాడడం మానేస్తాం. అడగడం మానేస్తాం. అదే జ్ఞానోదయం. అది రాకపోయినా నష్టం లేదు నిజం తెలుసుకోకపోయినా నష్టం లేదు. కానీ ఒక తప్పుని నిజం అని మాత్రం నమ్మొద్దు. కావాలంటే ఒక్కసారి మీ నమ్మకాల సిద్ధాంతాలను చెక్‌ చేసుకోండి’ అని పూరీ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆ వీడియో నేటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది.