Begin typing your search above and press return to search.

పూరీ తనయుడు ఈసారైనా హిట్టు కొడతాడా..?

By:  Tupaki Desk   |   19 Jun 2022 2:30 AM GMT
పూరీ తనయుడు ఈసారైనా హిట్టు కొడతాడా..?
X
టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తన కుమారుడు ఆకాష్ పూరీని కూడా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన ఆకాష్.. ‘బుజ్జిగాడు’ ‘చిరుత’ ‘గబ్బర్ సింగ్’ 'బిజినెస్ మ్యాన్' వంటి పలు సినిమాలతో అలరించాడు. ఈ క్రమంలో 'ఆంధ్రా పోరీ' అనే సినిమాతో హీరోగా మారాడు.

ఫస్ట్ మూవీ ఆశించిన విజయాన్ని అందుకోకపోవడంతో.. పూరీ తన తనయుడి బాధ్యత తీసుకుని 'మెహబూబా' సినిమాని తెరకెక్కించారు. అయితే ఈసారి కూడా ఆకాష్ ను పరాజయమే పలకరించింది. ఈ నేపథ్యంలో గతేడాది 'రొమాంటిక్' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పూరీ కొడుకుని హీరోగా నిలబెట్టాలని ఇండస్ట్రీ అంతా తమవంతు సపోర్ట్ చేసింది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్వయంగా ఆకాష్ ని ప్రమోట్ చేసే బాధ్యత తీసుకున్నారు. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన 'రొమాంటిక్' మూవీ.. బాక్సాఫీస్ వద్ద బిలో యావరేజ్ ఫలితాన్నే అందుకుంది. దీంతో ఇప్పుడు తన తదుపరి సినిమాతో ఖచ్చితంగా హిట్టు కొట్టాల్సిన అవసరం ఏర్పడింది.

ఈ నేపథ్యంలో ఇప్పుడు ''చోర్ బజార్'' అనే చిత్రంతో వస్తున్నాడు పూరీ ఆకాష్. 'జార్జ్ రెడ్డి' ఫేమ్ జీవన్ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. విభిన్నమైన కథా కథనాలతో లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నామని మేకర్స్ చెబుతున్నారు.

ఇటీవలే 'చోర్ బజార్' ట్రైలర్ కూడా వచ్చింది. పూరీ ఆకాష్ మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలని ట్రై చేస్తున్నాడని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. అయితే 'రొమాంటిక్' సినిమా అప్పుడే ఆకాష్ తన వయసుకు మించిన పాత్ర చేశాడని.. తన ఏజ్ కు తగ్గ యూత్‌ ఫుల్ సినిమాలు చేస్తే మాత్రం హీరోగా మంచి కెరీర్ ఉండే అవకాశం ఉందని కామెంట్స్ వచ్చాయి.

కానీ ఇప్పుడు 'చోర్ బజార్' ట్రైలర్ ని బట్టి మరోసారి ఆకాష్ బరువైన పాత్రనే పోషించినట్లు అర్థం అవుతుంది. ఇక పూరీ తనయుడు ప్రమోషన్స్ లో సినిమా గురించి కాకుండా.. ఎక్కువగా తన తండ్రి జపం చేస్తుండటంపైనా ట్రోల్స్ వస్తున్నాయి. తాతలు తండ్రుల పేర్లు చెప్పుకుంటే సినిమాలు ఆడే రోజులు పోయాయని.. మంచి కంటెంట్ తో వస్తేనే జనాలు ఆదరిస్తారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

నిజానికి ఆకాష్ స్టార్ డైరెక్టర్ కొడుకైనప్పటికీ.. క్లీనింగ్ బాయ్ గా.. ప్రొడక్షన్ బాయ్ గా సెట్స్ లో టీలు కాఫీలు కూడా అందించాడని తెలుస్తోంది. ఇప్పుడు హీరోగా నిలదొక్కుకోడానికి కూడా తీవ్రంగా కష్టపడుతున్నాడు. మరి 'చోర్ బజార్' తోనైనా పూరీ కొడుకు సాలిడ్ సక్సెస్ అందుకుంటారేమో చూడాలి.

ఇకపోతే 'చోర్ బజార్' సినిమాలో ఆకాశ్ సరసన గెహన సిప్పీ హీరోయిన్ గా నటిస్తోంది. సీనియర్ నటి అర్చన కీలక పాత్ర పోషిస్తోంది. ఐ.వి ప్రొడక్షన్స్ పతాకంపై వీఎస్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ సినిమాని త్వరలోనే విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.