Begin typing your search above and press return to search.

పుష్పా.. ఇలాంటి పోస్టర్లే కొంప ముంచేది

By:  Tupaki Desk   |   7 Feb 2022 10:48 AM GMT
పుష్పా.. ఇలాంటి పోస్టర్లే కొంప ముంచేది
X
కొన్నిసార్లు పోస్టర్ల మీద కలెక్షన్ల నంబర్లు చూస్తుంటే దిమ్మదిరిగిపోతుంటుంది. కొంత వరకు హైప్ చేసి చూపించడం వరకు ఓకే కానీ.. వాస్తవానికి పొంతన లేకుండా నంబర్లు వేస్తేనే కామెడీగా ఉంటుంది. గతంలో కొన్ని పెద్ద సినిమాలకు పోస్టర్ల మీద వేసిన కలెక్షన్ల ఫిగర్లు ఎంత వివాదాస్పదం అయ్యాయో తెలిసిందే. ఈ నంబర్లు చూసి ఐటీ అధికారులు ఆ చిత్ర నిర్మాతల ఇళ్లపై దాడులు చేయడం.. ఊరికే ప్రచారం కోసమే అలా పోస్టర్లు రిలీజ్ చేశామని.. వాస్తవానికి వచ్చిన కలెక్షన్లు తక్కువ అని వివరణ ఇచ్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.

ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ లాంటి కొందరు హీరోలు కలెక్షన్ల ఫిగర్లతో పోస్టర్లు రిలీజ్ చేయకూడదని.. దాని గురించి అనవసర చర్చ వద్దన్న నిర్ణయానికి వచ్చారు. ఐతే కొందరు స్టార్ హీరోలను మాత్రం ఈ కలెక్షన్ల మోజు వదలట్లేదు. అల్లు అర్జున్ కొత్త సినిమా ‘పుష్ప’కు మొదట్నుంచి కలెక్షన్ల వివరాలు పెంచి చూపిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయినా చిత్ర బృందం దగ్గట్లేదు.

తాజాగా ‘పుష్ప’ వరల్డ్ వైడ్ కలెక్షన్లు రూ.365 కోట్లంటూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అది చూసి అంతా అవాక్కవుతున్నారు. ‘పుష్ప’ భారీ వసూళ్లు సాధించిన మాట వాస్తవం. డివైడ్ టాక్ తట్టుకుని అన్ని భాషల్లో ఘనవిజయాన్నందుకున్న మాటా నిజం. కానీ మరీ రూ.365 కోట్ల వసూళ్లంటేనే అతిశయోక్తిలా అనిపిస్తోంది. ఓవైపు ఆంధ్రాలో టికెట్ల వ్యవహారం ఎంత చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే.

టికెట్ల రేట్లు తగ్గించడం వల్ల నష్టాలు వస్తున్నాయని నిర్మాతలు మొత్తుకుంటుంటే.. అక్కడ పేర్ని నాని లాంటి మంత్రులు ఇలా హైప్ చేసి చూపిస్తున్న కలెక్షన్ల లెక్కలే తెరపైకి తెస్తున్నారు. పోస్టర్ల మీద ఇంత పెద్ద ఫిగర్లు వేస్తున్నారు. మళ్లీ నష్టమంటున్నారు. మీరు చెప్పిన లెక్కల ప్రకారం అసలు పన్నులు కట్టారా అని ప్రశ్నిస్తున్నారు. ఇంత భారీగా వసూళ్లు వస్తుంటే మళ్లీ టికెట్ల రేట్లు పెంచడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి తరుణంలో కాస్త సంయమనం పాటించకుండా ఇలా భారీ ఫిగర్లతో పోస్టర్లు రిలీజ్ చేయడం ద్వారా ఏం సంకేతాలిస్తున్నట్లో?