Begin typing your search above and press return to search.

'పుష్ప' నుంచి ఈ సీన్ ఎందుకు లేపేశారబ్బా?!

By:  Tupaki Desk   |   2 Jan 2022 6:45 AM GMT
పుష్ప నుంచి ఈ సీన్ ఎందుకు లేపేశారబ్బా?!
X
అడవి నేపథ్యంలో .. ఎర్రచందనం అక్రమరవాణా చుట్టూ తిరిగే కథతో సుకుమార్ తెరకెక్కించిన 'పుష్ప' .. వసూళ్ల పరంగా కొత్త రికార్డులను నమోదు చేస్తుండటం విశేషం. అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా, క్రితం నెల 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టేసి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ బాణీలు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా మారాయి. ఈ సినిమా నుంచి డిలీట్ చేసిన ఒక సీన్ ను, న్యూ ఇయర్ సందర్భంగా యూ ట్యూబ్ లో రిలీజ్ చేయగా, అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది.

డబ్బులు వడ్డీకి ఇస్తూ .. తనదైన స్టైల్లో వాటిని వసూలు చేసుకునే రెడ్డెప్ప పుష్ప ఇంటికి వస్తాడు. ప్రస్తుతం తమ దగ్గర డబ్బులేదని పుష్ప తల్లి చెప్పడంతో ఆమెపై ఇష్టానుసారం నోరు పారేసుకుంటూ ఉంటాడు. పొద్దున్నే రెడ్డెప్ప తిట్ల దండకంతో నిద్రలేచిన పుష్ప .. ఆ తిట్లను వింటూనే తాపీగా తన కాలకృత్యాలు తీర్చుకుంటాడు. తమని అన్నేసి మాటలు అంటూ ఉన్నప్పటికీ తన కొడుక్కి ఎంతమాత్రం పట్టకపోవడం పట్ల పుష్ప తీరుపై తల్లి అసహనాన్ని వ్యక్తం చేస్తుంది. దాంతో పుష్ప మరోచోట డబ్బుతీసుకుని రెడ్డెప్పకి డబ్బులు ఇచ్చేస్తాడు.

అప్పు తీర్చలేదని తమని ఎంతమంది ముందు అవమానపరిచాడో .. వాళ్లందరి ఇళ్లకు రెడ్డెప్పను కొడుతూ తీసుకుని వెళ్లి, తన డబ్బులు తనకి ముట్టినట్టుగా చెప్పిస్తాడు. పుష్ప హీరోయిజానికి .. ఆయన పద్ధతికి అద్దం పట్టే సీన్ ఇది. చూడటానికి తమిళ సినిమాలోని సీన్ లా అనిపించినప్పటికీ, కథా నేపథ్యాన్ని బట్టి సర్దుకుని పోవచ్చు. సాధారణంగా ఒక భాగంగా సినిమాను రిలీజ్ చేయాలకున్నప్పుడు నిడివి ఎక్కువైందనే కారణంగా ఈ సీన్ ను డిలీట్ చేసి ఉంటారని అనుకోవచ్చు. కానీ రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్నప్పుడు ఈ సీన్ ను ఎందుకు లేపేశారనేది అర్థం కాదు.

బహుశా హీరో .. విలన్ కాంబినేషన్లో తాము అనుకున్న బ్యాంగ్ పై ఎండ్ చేద్దామనే ఉద్దేశంతో ఈ సీన్ లేపేసి ఉండొచ్చు. కానీ ప్రీ క్లైమాక్స్ .. క్లైమాక్స్ కి సంబంధించిన సన్నివేశాల నిడివి తగ్గించి ఉంటే ఈ సీన్ కూడా ఆర్డర్ లో సెట్ అయ్యేదేమో. నిజం చెప్పాలంటే ఈ సీన్ తొలగించడం వలన పుష్పకు ఒరిగింది కూడా ఏమీ లేదనే అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్టు పార్టు క్లైమాక్స్ ఆడియన్స్ అంచనాలకు తగినట్టుగా లేదనేది అన్ని థియేటర్ల దగ్గర వినిపించిన మాటే. వసూళ్ల పరంగా చూసుకుంటే మాత్రం ఇది పెద్ద హిట్టే.