Begin typing your search above and press return to search.

'దసరా' పై 'పుష్ప' ఎఫెక్ట్..!

By:  Tupaki Desk   |   18 Oct 2022 8:55 AM GMT
దసరా పై పుష్ప ఎఫెక్ట్..!
X
నేచురల్ స్టార్ నాని మరియు నేషనల్ అవార్డ్ విన్నింగ్ నటి కీర్తి సురేశ్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ "దసరా". శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇది సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో రూపొందే రూరల్ యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది.

'దసరా' సినిమా కోసం నాని తొలిసారిగా రఫ్ అండ్ రగ్గుడ్.. ఊర మాస్ అవతార్ లోకి మారిపోయాడు. కీర్తి సురేష్ సైతం డీ గ్లామర్ లుక్ లో కనిపించింది. ఇప్పటికే ఫస్ట్ లుక్ - గ్లిమ్స్ మరియు 'ధూమ్ ధామ్ దోస్తానా' ఫస్ట్ సింగిల్ లో నాని మేకోవర్ ఆకట్టుకుంది.

ఇటీవల కీర్తి పుట్టినరోజు సందర్భంగా ఆమె పోషిస్తున్న వెన్నెల పాత్రకు సంబంధించిన లుక్ ని కూడా రివీల్ చేశారు. అయితే నాని - మహానటి గెటప్స్ చూసిన తర్వాత 'దసరా' చిత్రాన్ని 'పుష్ప' తో కంపేర్ చేస్తూ.. నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

గతేడాది బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన 'పుష్ప: ది రైజ్' సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రా అండ్ రస్టిక్ లుక్ లో పుష్పరాజ్ గా అందరినీ ఆశ్చర్యపరిచాడు. శ్రీవల్లి గా హీరోయిన్ రష్మిక మందన్నా సైతం డీ గ్లామర్ లుక్ తో మెప్పించింది. అయితే ఇప్పుడు 'పుష్ప' ప్రధాన పాత్రలతో 'దసరా' జంట సామీప్యతను కలిగి ఉండటాన్ని గమనించవచ్చు.

చింపిరి జుట్టు - గుబురు గడ్డంతో మాసిన లుంగీ చొక్కా ధరించి 'పుష్ప' లో అల్లు అర్జున్ ఎలా అయితే మాస్ లుక్ లో కనిపించాడో.. ఇక్కడ 'దసరా' చిత్రంలో నాని కూడా అలానే కనిపించాడు. అదే సమయంలో పసుపు రంగు చీరలో రష్మిక మందన్న ఎలా అయితే ఉందో.. కీర్తి సురేష్ కూడా పెళ్లి కుతురిగా ముస్తాబై కనిపించింది.

ఇప్పుడు ఈ రెండు చిత్రాలను పోలుస్తూ.. ఇప్పుడు మీమర్స్ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. 'పుష్ప 2' ఇదేనంటూ 'దసరా' చిత్రాలతో మీమ్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ని నాని ఫాలో అవుతున్నాడంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

ఏదైనా సినిమాతో ఇతర చిత్రాలకు పోలిక ఉంటే విమర్శించడం మాములుగా జరిగేదే. కాకపోతే ఇక్కడ లుక్స్ ఒకేలా ఉన్నంత మాత్రాన రెండు సినిమాలను ఒకటే అని కామెంట్ చేయడం కరెక్ట్ కాదు.

'దసరా' అనేది తెలంగాణా ప్రాంతంలోని సింగరేణి బొగ్గు గనుల నేపధ్యంలో తెరకెక్కుతున్న రూరల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. ఇందులో హీరోహీరోయిన్లు తొలిసారిగా తెలంగాణా యాసలో మాట్లాడనున్నారు.

శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం సమకూరుస్తుండగా.. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. 'దసరా' చిత్రాన్ని 2023 శ్రీరామ నవమి సందర్భంగా మార్చి 30న విడుదల చేయనున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.