Begin typing your search above and press return to search.

'పుష్ప' ఐటమ్ సాంగ్ వివాదం..? సమంత పై కేసు..?

By:  Tupaki Desk   |   13 Dec 2021 10:36 AM GMT
పుష్ప ఐటమ్ సాంగ్ వివాదం..? సమంత పై కేసు..?
X
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ''పుష్ప: ది రైజ్''. పాన్ ఇండియా స్థాయిలో డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల విడుదల చేసిన సినిమాలోని 'ఊ అంటావా.. ఊఊ అంటావా' పాటకు మాస్ ఆడియన్స్ నుంచి భారీ స్పందన వస్తోంది.

సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేసిన 'పుష్ప' ఐటమ్ సాంగ్ కు గేయ రచయిత చంద్రబోస్ సాహిత్యం అందించారు. సింగర్ మంగ్లీ చెల్లెలు చంద్రావతి చౌహాన్ ఆలపించారు. ఐదు భాషల్లో విడుదలై ఈ పాట ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది. ముఖ్యంగా ‘ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ' అంటూ సాగే తెలుగు వెర్షన్ పాట సెన్సేషన్ క్రియేట్ చేసింది.

24 గంటల్లోనే అత్యధిక వ్యూస్ రాబట్టిన సాంగ్ గా రికార్డ్ క్రియేట్ చేసిన ఈ స్పెషల్ సాంగ్.. ప్రస్తుతం 21 మిలియన్ల వ్యూస్ తో యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతోంది. 'ఊ అంటావా' పాటలో స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు పెరఫార్మ్ చేసింది. ఇందులో కురచ దుస్తుల్లో హాట్ హాట్ ఎక్స్ ప్రెషన్స్ తో సామ్ వేసిన స్టెప్పులు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

'పుష్ప: ది రైజ్' సినిమా విజయానికి ఈ ఐటమ్ సాంగ్ కూడా హెల్ప్ అవుతుందని సినీ ప్రియులు భావిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ పాటపై వివాదం చెలరేగింది. మగవాళ్ల వ్యక్తిత్వాలను కించపరిచేలా ఈ పాటలోని సాహిత్యం ఉందని.. దీన్ని వెంటనే నిషేదించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కు చెందిన కొందరు చిత్ర యూనిట్ పై కేసు పెట్టినట్లు ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

'ఊ అంటావా' పాటలో ఆడవాళ్లు ఎలాంటి దుస్తులు వేసుకున్నా మగవారు వంకర బుద్ధితో చూస్తారని.. పెద్ద మనుషుల్లాగా మంచి మనసు ఉన్న వ్యక్తుల్లా నీతులు చెబుతారని.. మగ జాతి అంతా ఒకటే అని పేర్కొన్నారు. దీనిపై పలువురు నెటిజన్స్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అదే ఆడవారి మీద ఇలాంటి పాటలు రాస్తే మహిళా సంఘాలు చూస్తూ ఊరుకునేవారు కాదని కామెంట్స్ చేస్తున్నారు.

అయితే పురుష సమాజాన్ని కించపరిచేలా ఉన్న 'పుష్ప' ఐటమ్ నంబర్ ని సినిమా నుంచి తొలగించాలని ఇప్పుడు కేసు నమోదైనట్లు కథనాలు వస్తున్నాయి. చిత్ర బృందంతో పాటుగా సింగర్ - లిరిసిస్ట్ మరియ సాంగ్ లో పెరఫార్మ్ చేసిన సమంత పై కేసు పెట్టారని అంటున్నారు.

ఇప్పటి వరకు 'పుష్ప' పాటపై ఫిర్యాదు చేశామని ఏ పురుష సంఘానికి చెందిన వ్యక్తులు కూడా ప్రకటించలేదు. దీంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న గాలి వార్తా కూడా అయ్యుండొచ్చని సినీ అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. మరి త్వరలోనే నిజానిజాలు బయటకు వస్తాయేమో చూడాలి.