Begin typing your search above and press return to search.

'పుష్ప' త‌ర‌హా ప్లానింగ్ వీళ్ల‌కు లేదా?

By:  Tupaki Desk   |   8 Jun 2022 5:31 AM GMT
పుష్ప త‌ర‌హా ప్లానింగ్ వీళ్ల‌కు లేదా?
X
చాలా కాలానికి ఉల‌గ‌నాయ‌గ‌న్ క‌మ‌ల్ హాస‌న్ మ‌రోసారి త‌న‌దైన శైలిలో విశ్వ‌రూపం చూపించారు. కెరీర్ లో అద్భుత‌మైన‌ బ్లాక్ బ‌స్ట‌ర్ ని అందుకున్నారు. అత‌డు న‌టించిన విక్ర‌మ్ చ‌క్క‌ని విజ‌యం ద‌క్కించుకుంది. ప్రస్తుతం తెలుగు- తమిళ చిత్ర పరిశ్రమల్లో ఈ మూవీ హాట్ టాపిక్ గా మారింది.

కార్తీతో ఖైదీ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ని తెర‌కెక్కించిన‌ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులు విమ‌ర్శ‌కుల‌ నుండి ప్రశంసలను అందుకుంటోంది. ఇరు భాషలలో చ‌క్క‌ని వ‌సూళ్ల‌తో పంపిణీవ‌ర్గాల‌కు లాభాల‌ను అందిస్తోంద‌న్న టాక్ ఉంది. కమల్ హాసన్- ఫహద్ ఫాసిల్ - విజయ్ సేతుపతి తమదైన అద్భుత‌ నటనతో స్క్రీన్ ఆద్యంతం ర‌క్తి క‌ట్టించారు. అసాధార‌ణ‌ ప్రతిభావంతులైన వారిని ఒకే ఫ్రేమ్ లో పెద్ద తెరపై చూస్తున్నంత‌సేపూ క‌న్నార్ప‌నివ్వ‌ని ట్రీటిచ్చార‌ని ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి.

అయితే ఇంత‌మంది ఉన్న ఈ సినిమా క్లైమాక్స్ లో సూర్య అతిధి పాత్ర షో స్టాప‌ర్ గా నిలిచింది. ఇందులో అత‌డు 'రోలెక్స్' అనే పాత్రను పోషించాడు. మూవీ ముగింపులో అత‌డు క‌నిపించి 'విక్రమ్' తదుపరి భాగానికి లీడ్ ఇస్తాడు. అదే క్ర‌మంలో క‌మ‌ల్ హాస‌న్ కి ప‌లు ఇంట‌ర్వ్యూల్లో ఇదే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది. విక్ర‌మ్ సీక్వెల్ లో సూర్య పూర్తి నిడివి పాత్ర‌లో క‌నిపిస్తారా? అని మీడియా ప్ర‌శ్నిస్తోంది. విక్రమ్ సినిమా చూసిన అభిమానులు ఇప్పుడు సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండ‌డంతో ప్ర‌తి వేదిక‌పైనా ఇదే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది.

కేవలం ఐదు నిమిషాల సన్నివేశంతో సూర్య సినిమాను డామినేట్ చేశాడు. అతను రోలెక్స్ పాత్రను పూర్తి నిడివిలో పోషిస్తే ఇక ఏ రేంజులో ఉంటుందో అంటూ అంచ‌నా వేస్తున్నారు. తదుపరి భాగంలో కమల్ హాసన్ ను ఎదుర్కొనే విల‌న్ సూర్య అని కూడా ఊహిస్తున్నారు..అయితే ఈ పాత్ర‌ను లోకేష్ ఎలా డిజైన్ చేస్తార‌న్న‌ది ఇప్పుడే అంచ‌నా వేయ‌లేం. తాజా ఇంట‌ర్వ్యూలో క‌మ‌ల్ హాస‌న్ మాట్లాడుతూ.. అయితే సూర్య తో పెద్ద‌గా ఉంటుంద‌ని అనడం మ‌రింత‌గా ఆస‌క్తిని క‌లిగించింది.

క‌న‌గ‌రాజ్ ప్రస్తుతం ద‌ళ‌ప‌తి విజయ్ తో ఓ సినిమాకి స‌న్నాహ‌కాల్లో ఉన్నారు. అదే క్ర‌మంలో విక్ర‌మ్ తదుపరి భాగాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారనే దానిపై క్లారిటీ ఇవ్వ‌డం లేదు. పుష్ప త‌ర‌హాలోనే వెంట‌నే లోకేష్ వీలైనంత త్వరగా సినిమాని ప్రారంభిస్తార‌నే అభిమానులు ఆశిస్తున్నారు. నిజానికి విక్ర‌మ్ సీక్వెల్ తీస్తే ఇందులో క‌మ‌ల్ - సూర్య క‌లిసి న‌టిస్తే అది సౌతిండియాలోనే క్రేజీ ఫ్రాంఛైజీగా అవ‌త‌రిస్తుంద‌న‌డంలో సందేహం లేదు. హిట్టు ఊపుతో ఉన్న‌ప్పుడే దానికి సీక్వెల్ ప్ర‌క‌టిస్తే అభిమానుల్లో హుషారు పెరుగుతుంది.

కానీ ఆ ప‌నిని లోకేష్- క‌మ‌ల్ బృందం చేస్తారా లేదా? అన్న‌ది చూడాలి. ఇక ఇటీవ‌లే పుష్ప చిత్రంతో పాన్ ఇండియా హిట్ అందుకున్న బ‌న్ని ఇత‌ర ప్రాజెక్టుల‌ను ప‌క్క‌న పెట్టి మ‌రీ పుష్ప సీక్వెల్లో న‌టిస్తున్నాడు. అదే తీరుగా క‌మ‌ల్ టీమ్ ప్లాన్ చేయాల‌నేది అభిమానుల సూచ‌న‌. అయినా ఇక‌పై యూనివ‌ర్శ్ లు మ‌ల్లీవ‌ర్శ్ ల కాన్సెప్టుల పేరుతో ఇలాంటి అసాధార‌ణ‌ ట్యాలెంటును ఒక చోటికి చేర్చి భారీ పాన్ ఇండియా సినిమాలు తీసే ఆలోచ‌న‌లు మ‌న దర్శ‌క దిగ్గ‌జాల‌కు ఉన్నాయన‌డంలో ఎలాంటి సందాహాలు లేవు.