Begin typing your search above and press return to search.

'పుష్ప' తొలి రోజు వసూళ్లు ఎంతంటే..?

By:  Tupaki Desk   |   18 Dec 2021 12:36 PM GMT
పుష్ప తొలి రోజు వసూళ్లు ఎంతంటే..?
X
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన హ్యాట్రిక్ మూవీ ''పుష్ప: ది రైజ్'' శుక్రవారం (డిసెంబర్ 17) వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో విడుదల అయింది. ఇది బన్నీకి ఫస్ట్ పాన్ ఇండియా చిత్రం. తొలి రోజు మిశ్రమ స్పందన తెచ్చుకున్నా.. బన్నీ అభిమానులను మాస్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటోంది.

'పుష్ప' సినిమాలో అల్లు అర్జున్‌ నటన మరియు యాక్షన్‌ సన్నివేశాలకు సినీ అభిమానులు ఫిదా అవుతున్నారు. తగ్గేదే లే అంటూ పుష్పరాజ్ అనే ఊర మాస్ అవతారంలో బన్నీ అద్భుతంగా పెర్ఫార్మన్స్ చేశారు. సినిమా మొత్తాన్ని తన భుజస్కంధాలపై నడిపించారు. ఈ నేపథ్యంలో ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్ తో ప్రేక్షకులు ఘనస్వాగతం పలికారని మేకర్స్ ప్రకటించారు.

'పుష్ప: ది రైజ్' సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 71 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసిందని చిత్ర బృందం అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేసింది. ఇది 2021లో ఇండియాలోనే తొలి రోజు అత్యధిక గ్రాస్ రాబట్టిన సినిమా అని.. బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిందని మేకర్స్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

'పుష్ప' మేకర్స్ ప్రకటించిన లెక్కలు చూస్తుంటే.. ఈ వీకెండ్ లో అల్లు అర్జున్ సినిమా మరిన్ని కలెక్షన్స్ నమోదు చేసే అవకాశం ఉంది. కాగా, శేషాచ‌లం అడ‌వుల్లో జ‌రిగే ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఒక సాధారణ కూలీగా జీవితం మొదలు పెట్టిన పుష్పరాజ్‌.. ఎర్రచందనం స్మగ్లింగ్‌ మాఫియాను శాసించే సిండికేట్‌ నాయకుడిగా ఎలా ఎదిగాడ‌నే ఈ సినిమాలో చూపించారు.

ఇందులో అల్లు అర్జున్ సరసన ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌ గా న‌టించింది. మ‌ల‌యాళ స్టార్ ఫ‌హాద్ ఫాజిల్ - సునీల్ - అనసూయ - అజయ్ ఘోష్ - రావు రమేష్ - శత్రు - ధనుంజయ కీలక పాత్రలు పోషించారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చగా.. మిరోస్లా కుబా బ్రోజెక్ సినిమాటోగ్రఫీ అందించారు.

ముత్తం శెట్టి మీడియా సహకారంతో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని - రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 'పుష్ప: ది రైజ్' కు కొనసాగింపుగా ‘పుష్ప: ది రూల్‌’ అనే టైటిల్‌ తో పార్ట్‌-2 రానుందని ఇప్పటికే ప్రకటించారు. మొదటి భాగంలో మిగిలిపోయిన ప్రశ్నలకు.. రెండో పార్ట్ లో సమాధానం చెప్పనున్నారు. ఇది వ‌చ్చే ఏడాది ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్తుందని సమాచారం.