Begin typing your search above and press return to search.

సింధుకు జాగ్వార్ టీం పది లక్షలిచ్చింది

By:  Tupaki Desk   |   19 Sept 2016 12:49 PM IST
సింధుకు జాగ్వార్ టీం పది లక్షలిచ్చింది
X
మన దగ్గర విజేతలకు.. పరాజితులకు ఎంత అంతరం ఉంటుందన్నది రియో ఒలింపిక్స్ అనంతర పరిణామాలతో స్పష్టంగా అర్థమైంది. రియోలో రజత పతకం గెలిచిన సింధు ఓవర్ నైట్ ఎంత పెద్ద స్టార్ అయిపోయిందో.. ఆమెపై ప్రభుత్వాలు.. ప్రైవేటు సంస్థలు ఏ స్థాయిలో నజరానాల వర్షం కురిపించాయో.. ఇంకా కురిపిస్తూ ఉన్నాయో తెలిసిందే. సరైన ఆర్థిక సహకారం లేక ఇబ్బంది పడుతున్నామని... తమను ఆదుకుంటే సత్తా చాటుతామని ఎందరో క్రీడాకారులు అర్థిస్తుంటే పట్టించుకోరు కానీ.. విజేతల మీద మాత్రం అవాజ్యమైన ప్రేమను ప్రదర్శిస్తారు. వాళ్లకు నజరానాలిస్తే వచ్చే ప్రచారం వారికి ముఖ్యం. అందుకే సింధు మీద ఒక్కొక్కరు పోటీ పడి నగదు బహుమతులు ఇస్తూనే ఉన్నారు.

తాజాగా ‘జాగ్వార్’ సినిమా టీం కూడా సింధు మీద ప్రేమను చాటుకుంది. ఆమెకు రూ.10 లక్షల నజరానా అందజేసింది. ‘జాగ్వార్’ ఆడియో వేడుకకు ఆమెను ఆహ్వానించి.. తన తండ్రి.. మాజీ ప్రధాని దేవెగౌడ చేతుల మీదుగా సింధుకు రూ.10 లక్షల చెక్కు అందజేయించారు కుమారస్వామి. ఏదైనా క్రీడా కార్యక్రమాలకు సింధును పిలిస్తే ఓకే కానీ.. ఓ సినిమా వేడుకకు కూడా ఆమె అతిథిగా మారడం.. ఇలా నజరానా ఇవ్వడం ఆశ్చర్యం కలిగించే విషయమే. సింధు సాధించింది గొప్ప విజయమే. ఆమెకు తగిన గుర్తింపు రావాల్సిందే. నజరానాలు అందాల్సిందే. కానీ ఈ విషయంలో జనాలు మరీ పరిమితులు దాటిపోతున్నారు. సింధు మీద కురిసిన నజరానాల విలువ రూ.30 కోట్లు దాటిందని అంచనా. ఆమె బదులు వచ్చే ఒలింపిక్స్ కోసం సన్నద్ధమవుతూ.. ఆర్థిక సహకారం లేక ఇబ్బంది పడుతున్న వారిని ఆదుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది కదా.