Begin typing your search above and press return to search.

మహేష్ సినిమాపై ఆయన ముద్ర పడిందే..

By:  Tupaki Desk   |   5 Aug 2018 6:14 AM GMT
మహేష్ సినిమాపై ఆయన ముద్ర పడిందే..
X
మొత్తానికి మహేష్ 25వ సినిమాపై మూడు బేనర్ల ముద్రలు పడ్డాయి. దిల్ రాజు, అశ్వినీదత్‌ల ఉమ్మడి నిర్మాణంలో ఈ సినిమా మొదలైన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు ఆ సినిమాలో పొట్లూరి వరప్రసాద్ కూడా అధికారిక భాగస్వామి అయ్యారు. తాజాగా ఈ సినిమా కోసం ఎస్ఎస్ఎంబీ25 (సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ చిత్రం) పేరుతో ఒక ఎంబ్లం తయారు చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 9న మహేష్ పుట్టిన రోజు కానుకగా ఫస్ట్ లుక్ లాంచ్ చేయబోతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా ధ్రువీకరించారు. ఈ ఎంబ్లం మీద ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’.. ‘వైజయంతీ మూవీస్’ బేనర్ల లోగోలతో పాటు ‘పీవీపీ సినిమా’ లోగోను కూడా వేశారు. దీంతో ఈ సినిమాకు సంబంధించిన వివాదానికి అధికారికంగా తెరపడినట్లయింది.

నిజానికి మహేష్ 25వ సినిమాను పీవీపీనే ప్రొడ్యూస్ చేయాల్సింది. రెండేళ్ల కిందట ఆయన బేనరే ఈ చిత్రాన్ని అనౌన్స్ చేసింది. ఈ సంస్థ కాంపౌండ్లోనే దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ కథను తయారు చేశారు. ఇందుకోసం పీవీపీ కొంత ఖర్చు కూడా చేశారు. ఐతే ఎక్కడో తేడా వచ్చి వంశీ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. అప్పట్నుంచి దీని మీద గొడవ నడుస్తోంది. ఒక దశలో పీవీపీ కోర్టుకు కూడా వెళ్లాడు. ఐతే మధ్యలో ఈ వివాదం పరిష్కారమైనట్లు వార్తలొచ్చాయి. కానీ ఈ చిత్ర షూటింగ్ మొదలయ్యాక పీవీపీ కోర్టు ద్వారా దానికి బ్రేక్ వేయించే ప్రయత్నం చేయడంతో చిత్ర బృందం రాజీకి రాక తప్పలేదు. చివరికి మహేష్ జోక్యంతో పీవీపీ సినిమా కూడా సినిమాలో భాగస్వామిగా మారినట్లు ఆ మధ్య వార్తలొచ్చాయి. ఇప్పుడు ఆ వార్తలే నిజమని తేలింది. ఎంబ్లం మీద పీవీపీ సినిమా లోగో పడింది. వివాదానికి పూర్తిగా తెరపడింది. మరి పెట్టుబడి.. అమ్మకాల విషయంలో ముగ్గురు నిర్మాతల మధ్య పంపకాలు ఎలా జరుగుతున్నాయో ఏమో?