Begin typing your search above and press return to search.

ఊపిరి బడ్జెట్ 60 కోట్లా?

By:  Tupaki Desk   |   11 March 2016 7:30 AM GMT
ఊపిరి బడ్జెట్ 60 కోట్లా?
X
పీవీపీ సంస్థ అంటే భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. మూడేళ్ల కిందటే ‘వర్ణ’ సినిమాకు రూ.60 కోట్ల దాకా బడ్జెట్ పెట్టాడు పొట్లూరి వరప్రసాద్. ఆ తర్వాత కొంచెం తగ్గి సైజ్ జీరో - బెంగళూరు డేస్ లాంటి సినిమాల్ని మీడియం బడ్జెట్ లో తీశాడు. ఐతే ‘ఊపిరి’కి వచ్చేసరికి పీవీపీ మళ్లీ తన రేంజేంటో చూపిస్తున్నట్లున్నాడు. ఈ సినిమాకు ఏకంగా రూ.60 కోట్ల బడ్జెట్ పెట్టినట్లు పీవీపీ వెల్లడించడం విశేషం. ‘ఊపిరి’ ట్రైలర్ లాంచింగ్ సందర్భంగా పీవీపీ మాట్లాడుతూ.. ఈ సినిమా బడ్జెట్ రూ.60 కోట్లని తెలిపారు. ఎంత రెండు భాషల్లోనూ సినిమా తీసినప్పటికీ.. ‘ఊపిరి’కి ఇంత బడ్జెట్ పెట్టారంటే నమ్మశక్యంగా లేదు. నాగార్జున - కార్తిలిద్దరి మార్కెట్ కలుపుకున్నా రూ.60 కోట్ల బడ్జెట్ అంటే చాలా ఎక్కువనే చెప్పాలి.

ఫ్రెంచ్ మూవీ ‘ది ఇన్ టచబుల్స్’కు ‘ఊపిరి’ అఫీషియల్ రీమేక్. బహుశా రీమేక్ రైట్స్ కోసం కూడా పీవీపీ భారీగా ఖర్చు చేయాల్సి వచ్చిందేమో. ‘సోగ్గాడే చిన్నినాయనా’ తర్వాత నాగ్ సినిమా అంటే మంచి క్రేజ్ ఉంది కాబట్టి.. ఇక్కడ బాగానే బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఐతే తమిళంలో మాత్రం సినిమాకు పెద్దగా వర్కవుటయ్యే అవకాశాలు కనిపించడం లేదు. సినిమా సూపర్ హిట్ అయితే తప్ప ‘ఊపిరి’ పెట్టుబడిని తిరిగి తేవడం కష్టమే. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 25న రెండు భాషల్లో ఒకేసారి విడుదల కాబోతోంది. తమిళంలో ‘తొళ’ పేరుతో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. నాగార్జున - కార్తి - తమన్నా.. ఈ ముగ్గురూ కూడా రెండు భాషల్లోనూ డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం.