Begin typing your search above and press return to search.

టాప్ స్టోరి: 2019 బ‌యోపిక్ క్వీన్స్

By:  Tupaki Desk   |   5 Jan 2019 1:30 AM GMT
టాప్ స్టోరి: 2019 బ‌యోపిక్ క్వీన్స్
X
పురుషాధిక్య ప్ర‌పంచంలో మ‌హిళ‌ల‌కు ప్రాధాన్య‌త పెరుగుతోందా? అందునా పురుష‌పుంగ‌వుల అడ్డాగా భావించే సినీప‌రిశ్ర‌మ‌లో ఆడాళ్ల‌కు విలువ‌, గౌర‌వం పెరిగిందా? అంటే అవున‌నే ప్ర‌ముఖ క్రిటిక్స్ విశ్లేషిస్తున్నారు. అందుకు ప్ర‌స్తుతం తెర‌కెక్కుతున్న లేడీ ఓరియెంటెడ్ బ‌యోపిక్స్ ని ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నారు. ఇన్నాళ్లు హీరోసామ్యం రాజ్య‌మేలింది. కానీ ఇప్పుడు అలా ఏం లేదు. నాయికా ప్రాధాన్య‌త‌తో మ‌హిళ‌ల్లో మ‌హారాణుల క‌థ‌ల్ని తెర‌కెక్కించినా జ‌నం ఆద‌రిస్తున్నారు అంటూ ప‌లు ఉదాహ‌ర‌ణ‌ల‌తో క్లియ‌ర్ క‌ట్ గా మారిన ట్రెండ్ ని గుర్తు చేస్తున్నారు. ఇదివ‌ర‌కూ రిలీజై స‌క్సెసైన‌ మ‌హాన‌టి, డ‌ర్టీపిక్చ‌ర్, స‌ర‌బ్‌జిత్ (ఐష్‌), బండిట్ క్వీన్, మేరికోమ్, రుద్ర‌మ‌దేవి, ప‌ద్మావ‌త్ (రాజ్‌పుత్ రాణి క‌థ‌) వంటి చిత్రాల్ని ఉద‌హ‌రిస్తున్నారు.

కొత్త సంవ‌త్స‌రంలోనూ మ‌హిళ‌ల‌పై బ‌యోపిక్స్ ఉత్కంఠ పెంచుతున్నాయి. ఈ ఏడాది తొలిగా రిలీజ‌వుతున్న `మ‌ణిక‌ర్ణిక‌` అంత‌కంత‌కు వేడి పెంచుతోంది. క్వీన్ కంగ‌న లాంటి పాపుల‌ర్ న‌టి ఝాన్సీ ల‌క్ష్మీ భాయ్ జీవిత‌క‌థ‌లో న‌టించ‌డంతో ఈ బ‌యోపిక్ కి ప్రాధాన్య‌త పెరిగింది. ఈనెల 25న రిలీజ‌వుతున్న మ‌ణిక‌ర్ణిక‌పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. అలాగే ఈ ఏడాది ప‌లువురు మ‌హిళామ‌ణుల‌పై ఆస‌క్తిక‌ర బ‌యోపిక్ లు తెర‌కెక్కుతున్నాయి. బ్యాడ్మింట‌న్ క్వీన్ సైనా నెహ్వాల్ జీవిత‌క‌థ‌లో శ్ర‌ద్ధా క‌పూర్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ బ‌యోపిక్ సెట్స్ పై ఉంది. మేటి బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా సైనాకు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. అలాంటి ఆస‌క్తిక‌ర జీవిత‌క‌థ‌తో సినిమా తీయ‌డం యువ‌త‌రంలో ఎంతో స్ఫూర్తిని ర‌గిలిస్తుంద‌ని విశ్లేషిస్తున్నారు. పివి సింధు, సానియా బ‌యోపిక్ లు ఈ త‌ర‌హాలోనే ఉత్కంఠ పెంచ‌నున్నాయ‌న్న అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. అలాగే స్పోర్ట్స్ కేట‌గిరీలోనే మ‌రో క్రీడాకారిణి బ‌యోపిక్ గురించి ఆస‌క్తిక‌ర చర్చ సాగుతోంది. లేడీ డైన‌మిక్ టీమిండియా కెప్టెన్ మిథాలీ రాజ్ బ‌యోపిక్ పైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఈ చిత్రంలో తాప్సీ క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌డంతో అటు ఉత్త‌రాదితో పాటు, ద‌క్షిణాదినా ఆస‌క్తి నెల‌కొంది.

వీట‌న్నిటినీ మించి ఆరు సార్లు త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రిగా రాజ్య‌మేలిన నాటి మేటి క‌థానాయిక జ‌య‌ల‌లిత పై ఒకేసారి మూడు బ‌యోపిక్ లు తెర‌కెక్కుతుండ‌డంపైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. 2019 ఫిబ్ర‌వ‌రిలో ప్రారంభ‌మై, ఏడాది చివ‌రిలో ఈ బ‌యోపిక్ ల‌ను రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తుండ‌డంతో వీటిపై ఆస‌క్తి నెల‌కొంది.
జ‌య‌ల‌లిత బ‌యోపిక్ లో ఒక‌దానికి `ది ఐర‌న్ లేడి` అనే టైటిల్ ని ఫిక్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. నిత్యామీన‌న్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. యాసిడ్ ఎటాక్ బాధితురాలు ల‌క్ష్మీ అగ‌ర్వాల్ (నిజ‌జీవిత‌క‌థ‌) పాత్ర‌లో దీపిక ప‌దుకొనే లాంటి స్టార్ న‌టించ‌డం ఆస‌క్తి రేకెత్తిస్తోంది. వ‌న్ ఫిలిం వండ‌ర్ కిడ్ జాన్వీ క‌పూర్ దేశంలో తొలి లేడీ పైలెట్ గుంజ‌న్ స‌క్సేనా బ‌యోపిక్ లో న‌టిస్తుండ‌డం ఉత్కంఠ పెంచుతోంది. అలాగే మ‌ల్లూవుడ్ శృంగార తార ష‌కీలా బ‌యోపిక్ లుక్ ఇటీవ‌లే రిలీజై వేడి పెంచింది. ఒక శృంగార తార అసాధార‌ణ ప‌య‌నంపై ఆస‌క్తిక‌ర బ‌యోపిక్ మ‌ల్లూవుడ్ స‌హా దేశ‌మంతా ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తావిస్తోంది. తెలుగులో `మ‌హాన‌టి` స‌క్సెస్ త‌ర్వాత ఇంకా మ‌హిళ‌ల‌పై బ‌యోపిక్ లు పెరిగే అవ‌కాశం ఉంద‌న్న విశ్లేష‌ణ సాగుతోంది.