Begin typing your search above and press return to search.

కృతి శెట్టిలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ కనిపించడం లేదూ!

By:  Tupaki Desk   |   19 Jan 2022 3:50 AM GMT
కృతి శెట్టిలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ కనిపించడం లేదూ!
X
'బంగార్రాజు' కోసం నాగార్జున మరోసారి పల్లెటూరి బుల్లోడుగా మారిపోయారు. ఈ సారి ఆయనతో కలిసి నాగచైతన్య కూడా సందడి చేశాడు. సంక్రాంతి కానుకగా థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, వసూళ్ల పరంగా కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. ఈ నేపథ్యంలో రాజమండ్రిలో జరిగిన 'బ్లాక్ బస్టర్ మీట్'కి 'ఆర్.నారాయణ మూర్తి గౌరవ అతిథిగా వచ్చారు. ఈ వేదికపై ఆయన తనదైన శైలిలో మాట్లాడుతూ .. "తమ్ముళ్లారా మీరంతా నాగార్జున .. నాగచైతన్య ఫ్యాన్స్. నేను అక్కినేని నాగేశ్వరరావుగారి ఫ్యాన్. ఆ మహానటుడి ఆశీస్సులే ఈ రోజున ఈ 'బంగార్రాజు' ఇంతటి బ్లాక్ బస్టర్ హిట్ కావడానికి కారణం.

సినిమాలో నాగార్జున ఆత్మగా .. నాగచైతన్యను ఎలా సేవ్ చేశారో, అలాగే అక్కినేని నాగేశ్వరరావుగారి ఆత్మ ఈ సినిమాకి సంబంధించిన వారందరికీ ఆశీస్సులు అందించింది. ఈ విజయం ప్రేక్షకులది .. అందుకు మీకు శిరస్సు వచ్చి దణ్ణం పెడుతున్నాను. ఈ సినిమాలో చైతూ చాలా బాగా చేశాడు .. ఆయన అంత బాగా చేస్తాడని నేను అనుకోలేదు. చివర్లో చైతూ ఏడిపించేశాడు. కల్యాణ్ కృష్ణగారు ఈ సినిమాను చాలా గొప్పగా తీశారు. నాలుగు నెలల్లో ఆయన ఈ సినిమాను తీశాడు. అది అంత ఆషామాషీ విషయం కాదు. ఆయనలో నాకు మరో రాఘవేంద్రరావుగారు కనిపించారు.

కల్యాణ్ కృష్ణ ఈ సినిమాలో కుటుంబ విలువలను గురించి చెప్పారు. అందువల్లనే ఈ రోజున ఈ సినిమా ఇంత బాగా ఆడుతోంది. ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. నాగార్జున - రమ్యకృష్ణ కాంబినేషన్లో 'చెంగావి రంగుచీర' అనే పాట ఉంటే భలే ఉండేదయ్యా. కృతి శెట్టి పాప మహర్జాతకురాలు. ఈ అరుపులే ఆమెకి ఆశీర్వాదాలు. ఈ పాపను చూస్తుంటే భారతదేశంలోని ఒక ప్రముఖ హీరోయిన్ మనకి కనపడుతోంది. ఆ హీరోయిన్ ఎవరో చెప్పండి .. ఆషా పరేఖ్. 'ఉప్పెన' హిట్ .. 'శ్యామ్ సింగ రాయ్' సూపర్ హిట్ .. 'బంగార్రాజు'తో బ్లాక్ బస్టర్. ఆ పాపకి ఎంతో మంచి భవిష్యత్తు ఉంది.

ఇక నాగార్జున గారు మహానుభావుడు. ఇంతకుముందు ఆయన 'అన్నమయ్య' .. 'శ్రీరామదాసు' వంటి గొప్ప సినిమాలలో నటించారు. ఆయనకి వాళ్ల అమ్మానాన్నల పోలికలు వచ్చాయి .. అందుకే ఆయన అదృష్టవంతుడు. ఆయన ఇలాంటి హిట్లు మరెన్నో కొట్టాలి. ఈ సందర్భంగా కల్యాణ్ కృష్ణ గారికి నేను ఒక మాట చెబుతున్నాను. ఎన్టీఆర్ గారు చేసిన 'కథానాయకుడు'గానీ .. 'రాముడు భీముడు'గాని నాగార్జునగారితో చేయాలి. ఏఎన్నార్ సినిమాలలో 'ఇద్దరు మిత్రులు' చేయాలి" అంటూ చెప్పుకొచ్చారు.