Begin typing your search above and press return to search.

పీపుల్ స్టార్ ప్రశ్నలకు బదులేది?

By:  Tupaki Desk   |   10 March 2018 9:53 AM GMT
పీపుల్ స్టార్ ప్రశ్నలకు బదులేది?
X
ఇప్పుడంటే విప్లవ సినిమాలకు గిరాకి లేదు కాని లేకపోతే పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారి చేతిలో కనీసం ఏడాదికి నాలుగైదు సినిమాలు ఉండేవి. నమ్ముకున్న పంధా వీడని ఏకైక హీరోగా ప్రేక్షకుల మదిలో ఆయన స్థానం చాలా ప్రత్యేకమైనది. ముక్కుసూటిగా మాట్లాడుతూ ఆడంబరాలు లేకుండా జనం మధ్య తిరిగే నారాయణమూర్తి తాజాగా జరిగిన థియేటర్ల సమ్మె గురించి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. వారం రోజులు థియేటర్లు మూసేసి ఏం సాధించారని నిలదీశారు. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు ఇంతకు ముందు చెప్పిన 2 వేల తగ్గింపుకే కట్టుబడి వాళ్ళ మాట నెగ్గించుకున్నారని అలాంటప్పుడు బ్రహ్మాస్త్రంగా వాడాల్సిన సమ్మెను పూర్తిగా నీరు గార్చారని ఇందులో కీలక పాత్ర పోషించిన అగ్ర నిర్మాతల గురించి చురకలు వేసారు. తమిళనాడు - కర్ణాటకలో కొనసాగుతున్న బంద్ ఇక్కడ మాత్రం ఎందుకు విత్ డ్రా చేసారని ప్రశ్నించారు.

దీని వెనుక పెద్ద కుట్ర ఉందని మూర్తి గారి ఆరోపణ. మార్చ్ లో సాధారణంగా పెద్ద సినిమాలు విడుదల చేయరని, పరీక్షల సీజన్ కాబట్టి ఏప్రిల్ నుంచి ప్లాన్ చేసుకుంటారని చెప్పారు. అందుకే చిన్న నిర్మాతలు కనీసం మార్చ్ నైనా వాడుకుందామని ప్రయత్నిస్తే అప్పుడు బంద్ ప్రకటించి వాళ్ళ కడుపు కొట్టారని ఆవేదన వ్యక్తం చేసారు. నిర్మాతలు - డిస్ట్రిబ్యూటర్లు - ఎగ్జిబిటర్లలో కొందరు డిఎస్పి సంస్థల్లో భాగస్వాములుగా ఉన్నారని, వాళ్ళ స్వప్రయోజనల కోసం సమ్మెను వాడుకున్నారని ధ్వజమెత్తారు. కేవలం 2 వేల రూపాయలకే సర్వీస్ ఇచ్చే సంస్థలు ఉండగా లాభాలు రావడం కోసం వాళ్ళను అడ్డుకుంటున్నారని కాస్త ఘాటుగానే అడిగేసారు.

మూర్తి చెప్పిన విషయాల్లో లాజిక్ ఉంది. ఇంతా చేసి కేవలం 2 వేల రూపాయలు మాత్రమే తగ్గింపు సాదించడం వెనుక మర్మం ఇంకేదైనా ఉందా లేక ఈ వ్యవహారంలో చిన్న నిర్మాతలకు లాభం కలిగించేది ఏదైనా ఉందా అనే ప్రశ్నకు నిర్మాతల సమాఖ్య నుంచే సమాధానం రావాలి. మనసులో ఉన్నా అడగలేక మౌనంగా ఉన్న నిర్మాతల తరఫున నారాయణమూర్తి అడిగేయటంతో అటువైపు నుంచి సమాధానం ఏమైనా వస్తుందా అని గమనిస్తున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.