Begin typing your search above and press return to search.

మూర్తిగారు చెప్పింది కరక్టేగా

By:  Tupaki Desk   |   29 Jun 2017 11:17 AM IST
మూర్తిగారు చెప్పింది కరక్టేగా
X
జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా జీఎస్టీ అమలవుతోంది. కొత్త పన్నుల విధానం అమల్లోకి రానుంది. అనేక వస్తువులు.. సేవల ధరల్లో మార్పులు రానున్నాయి. వీటిలో సినిమా టికెట్ రేట్లు కూడా ఉన్నాయి. తొలుత సినిమా రంగంపై 28 శాతం పన్ను విధించినా.. తమ అభ్యర్ధనను మన్నించి కేంద్రం 18 శాతానికి పరిమితం చేసిందంటున్నారు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్.

అయితే.. థియేటర్ నిర్వహణా ఛార్జీల విధానంపై మాత్రం అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. థియేటర్ నిర్వహణ పేరుతో.. ఒక్కో టికెట్ పై 7 రూపాయలు అదనంగా వసూలు చేసుకోవచ్చన్న నిర్ణయాన్ని.. సీనియర్ నటుడు కం టెక్నీషియన్ అయిన ఆర్. నారాయణమూర్తి తప్పు పడుతున్నారు. 'ఎలాగూ పెద్ద సినిమాలు వచ్చినపుడు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతులు ఇస్తున్నారు. అప్పుడు పెంచుకుంటే పెంచుకోనివ్వండి. కానీ చిన్న సినిమాపైనా ఇదే తరహా నిబంధనలు సమంజసం కాదు. చిన్న సినిమాపై కనికరం చూపండి.. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ విషయంపై మరోసారి ఆలోచించి.. పరిశ్రమకు మేలు చేసే నిర్ణయం తీసుకోవాలి' అని కోరుతున్నారు ఆర్ నారాయణ మూర్తి.

ఇవాల్టి రోజుల్లో నేల బెంచి అనే మాటే వినిపించడం లేదన్న నారాయణ మూర్తి.. సినిమాను ఖరీదైన మాధ్యమంగా మార్చద్దని విజ్ఞప్తి చేశారు. ఈయన చేసిన డిమాండ్ లో న్యాయం ఉందనే చెప్పాలి. పదులు.. వందల కోట్లు పెట్టి సినిమాలు తీసే వారికి.. చిన్న బడ్జెట్ తో సినిమాను పూర్తి చేసుకునేవారికి ఒకే రకమైన విధానం అంటే.. సమజసం కాదనే చెప్పాలి. మూర్తి గారు చేసిన ఈ డిమాండ్ కు ఎలాంటి ప్రతిస్పందన వస్తుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/