Begin typing your search above and press return to search.

పేలిపోయే స్పీచ్ ఇచ్చిన నారాయణమూర్తి

By:  Tupaki Desk   |   11 Jun 2017 7:47 AM GMT
పేలిపోయే స్పీచ్ ఇచ్చిన నారాయణమూర్తి
X
దాసరి నారాయణరావు సంస్మరణ సభలో ఆయన ప్రియ శిష్యుడు ఆర్.నారాయణమూర్తి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. చాలా ఉద్వేగంతో.. ఆవేశంతో.. ఆవేదనతో మాట్లాడిన నారాయణమూర్తి దాసరి గురించి చాలా గొప్ప విషయాలు చెప్పారు. దాసరి ప్రత్యేకతల గురించి అద్భుతంగా చెప్పిన నారాయణమూర్తి.. ఆయనకు కనీసం పద్మశ్రీ పురస్కారం కూడా రాకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా బాలన్ లాంటి వాళ్లకు పద్మశ్రీ ఇచ్చి.. దాసరిని ఎలా విస్మరిస్తారని నారాయణమూర్తి ప్రశ్నించారు. ఉత్తరాది ఆధిపత్యం పోవాలని.. మన వాటా మనకు దక్కాలని ఆయన నినదించారు.

‘‘మా గురువు గారు మామూలు వ్యక్తి కాదు. ఆయన దేవుడు. సినిమాల్లో హీరోగా ఒక వెలుగు వెలిగిపోవాలని ఇంటర్మీడియట్ అవ్వగానే మద్రాసుకు వెళ్లిపోయిన నాకు ఎన్టీఆర్.. ఏఎన్నార్ లాంటి వాళ్లు పిలిచి అవకాశాలు ఇస్తారనుకున్నా. కానీ అక్కడ నాలాంటి వాళ్లు లక్షల మంది తిరుగుతున్నారని అర్థమైంది. దీంతో ఇక ఇంటికి వెళ్లిపోదాంలే అనుకున్నా. అలాంటి సమయంలో అనుకోకుండా దాసరి గారిని కలిశా. నాకు బొమ్మలేయడం అలవాటు. నాగేశ్వరరావుగారి బొమ్మ వేసి గురువు గారికి చూపిస్తే.. తమ్ముడూ అంటూ భుజం తట్టారు. ఆయన స్థాయికి నా భుజం మీద చేయి వేయడం గొప్ప విషయం.

అప్పుడు నటుడు కావాలన్న నా కోరిక గురించి చెప్పా. వెళ్లి బీఏ చదివి రా.. ఛాన్స్ ఇస్తా అన్నారు. అలాగే వెళ్లి వచ్చాను. నాకు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత నన్ను హీరోగా పెట్టి ‘ఒరేయ్ రిక్షా’ సినిమా కూడా తీశారు. సత్యజిత్ రే గొప్ప గొప్ప ఆర్టిస్టిక్ మూవీస్ తీశారు. అలాగే మా గురువు గారు ‘నీడ’ తీశారు. విశ్వనాథ్ గారు ‘శంకరాభరణం’ లాంటి సినిమాలు తీస్తే.. మా గురువు ‘మేఘసందేశం’ తీశారు. బాపు గారు ఎన్నో కళాత్మక సినిమాలు తీస్తే మా గురువు ‘శివరంజని’ చేశారు. రాఘవేంద్రరావు గారు కమర్షియల్ హిట్లు తీస్తుంటే మా గురువు కూడా బెబ్బులి పులి.. ప్రేమాభిషేకం.. సర్దార్ పాపారాయుడు లాంటి బ్లాక్ బస్టర్లు ఇచ్చారు. నేను.. మాదాల రంగారావు లాంటి వాళ్లు విప్లవాత్మక సినిమాలు తీస్తుంటే.. మాకు పోటీగా ‘ఒరేయ్ రిక్షా’.. ‘ఒసేయ్ రాములమ్మ’ లాంటి సినిమాలు తీశారు.

అలాంటి వ్యక్తికి పద్మశ్రీ పురస్కారం రాలేదు. ఒక సినిమా చేసినందుకు విద్యా బాలన్ కు అవార్డిచ్చారు. మా గురువు గారికి మాత్రం ఏం లేదు. దక్షిణాది వాళ్లంటే ఎందుకంత చిన్నచూపు. ఈ దేశం అందరిదీ. ప్రధాన మంత్రి అంటే నార్త్ ఇండియాకు మాత్రమే కాదు.. దేశం మొత్తానికి ప్రధాని. మన వాటా కోసం పోరాడదాం. పెద్దవాళ్లందరూ దయ చేసి మా గురువు గారికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చేలా చూడండి. చేతులెత్తి నమస్కరిస్తున్నా’’ అంటూ ఉద్వేగంతో తన ప్రసంగాన్ని ముగించారు నారాయణమూర్తి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/