Begin typing your search above and press return to search.

'ప్రభుత్వంతో పాజిటివ్ గా ఉండండి.. నెగెటివ్ గా ఆలోచించవద్దు'

By:  Tupaki Desk   |   27 Dec 2021 1:31 PM GMT
ప్రభుత్వంతో పాజిటివ్ గా ఉండండి.. నెగెటివ్ గా ఆలోచించవద్దు
X
ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా థియేటర్లు మూతపడుతున్న సంగతి తెలిసిందే. ఓవైపు థియేటర్లపై తనిఖీలు చేస్తూ నిబంధనలు పాటించడం లేదంటూ అంధికారులు సీజ్ చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం నిర్ణయించిన టికెట్ ధరకు సినిమాను ప్రదర్శించలేమంటూ థియేటర్ యజమానులు స్వచ్చందంగా మూసివేస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శక నిర్మాత, పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి థియేటర్ల పరిస్థితిని తలచుకుని ఆవేదన వ్యక్తం చేశారు.

నాని హీరోగా తెరకెక్కిన 'శ్యామ్ సింగ రాయ్' సినిమా సక్సెస్ మీట్ కు నారాయణమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ''నిన్న ఉత్తరాంధ్రలో కొన్ని సినిమా థియేటర్లు మూసివేశారనే వార్తలు చదువుతుంటే ఏడుపొచ్చింది. సినిమా తీసేవాడు.. సినిమాని చూపించేవాడు.. సినిమా చూసేవాడు.. ఈ ముగ్గురూ బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది. సినీ ఇండస్ట్రీ మీద ఆధారపడి ప్రత్యక్షంగా పరోక్షంగా కోట్లాదిమంది బతుకుతున్నారు. అలాంటి చిత్ర పరిశ్రమకు గడ్డు రోజులు రాకూడదు'' అని అన్నారు.

''అందుకే ఈ విషయమై ఫిల్మ్ ఛాంబర్ పెద్దల్ని, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ పెద్దల్ని, 'మా' అధ్యక్షుడికి.. సినీ నిర్మాతలు అల్లు అరవింద్ - దిల్ రాజు - సురేష్ బాబు - చిరంజీవి - నాగార్జున.. ఇలా నటులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. థియేటర్ యజమానులారా మీరు ఎందుకు సినిమా హాళ్లను మూసివేస్తున్నారు.. మీరు థియేటర్లను మూయకండి. అక్కడి స్థానిక ఎమ్మెల్యేలు మంత్రుల్ని కలవండి. సమస్యని ముఖ్యమంత్రి జగన్మోహన్ గారి దగ్గరకు తీసుకెళ్లండి. ప్రభుత్వంతో పాజిటివ్ గా ఉండండి. నెగెటివ్ గా ఆలోచించవద్దు. ఎమోషనల్ అవ్వొద్దు. థియేటర్ లను మనం కాపాడుకోవాలి కానీ.. ఇలా మూసివేయవద్దు''

''అందరి ఆవేదన ఆవేశాన్ని బాధను పాజిటివ్ గా చూసి.. పరిశీలించి.. పెద్దలతో చర్చించి ఈ సమస్యకు పరిష్కారం చూపాలని.. అన్ని థియేటర్లు తెరుచుకునేలా చూడాలని ఈ సభాముఖంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. సినిమా తీసేవాడు.. చూపించేవాడు..చూసేవాడు.. ముగ్గురూ బాగుండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నాను'' అని ఆర్. నారాయణ మూర్తి అన్నారు.