Begin typing your search above and press return to search.

కొత్త చట్టాలు రద్దు చేయాల్సిందే : ఆర్ నారాయణ మూర్తి

By:  Tupaki Desk   |   20 Aug 2021 2:27 AM GMT
కొత్త చట్టాలు రద్దు చేయాల్సిందే : ఆర్ నారాయణ మూర్తి
X
తెలుగు సినిమాల్లో తనది ప్రత్యేక శైలి. కమర్షియల్‌ పాత్రలు ఎన్ని వచ్చినా కూడా పూర్తిగా ఉద్యమ నేపథ్యం సినిమాలు చేయడంతో పాటు ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చే సినిమాలను చేసేందుకు గాను ఆర్ నారాయణ మూర్తి నిలుస్తూ ఉంటారు. ఎర్రన్నగా పేరు దక్కించుకున్న ఆర్‌ నారాయణ మూర్తి తాజాగా రైతన్న అనే సినిమాను తెరకెక్కించిన విషయం తెల్సిందే. ఆ సినిమా లో కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ సన్నివేశాలను చూపించడం జరిగిందట. సినిమా ప్రమోషన్‌ లో భాగంగా సూర్యపేట లో ఆయన పర్యటించారు.

ఆ సందర్బంగా స్థానిక మంత్రి గుంటకండ్ల జగదీషరెడ్డిని కలవడం జరిగింది. ఆ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా ఉద్యమాలను బలోపేతం చేసేందుకు నారాయణ మూర్తిగారి సినిమాలు ఎంతో ఉపయోగపడ్డాయి. వ్యాపారకోణంలో కాకుండా సమాజానికి సందేశం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఆయన చేసే సినిమాలు ఎంతో మందికి ఆదర్శం అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. రైతు వ్యతిరేక కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందే అంటూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం కేంద్రంను డిమాండ్‌ చేస్తుందని మంత్రి జగదీష్‌ రెడ్డి అన్నారు.

ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ.. కేంద్రం తీసుకు వచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశాడు. రైతులకు కాకుండా కార్పోరేట్‌ సంస్థలకు మేలు చేసే విధంగా ఉన్న ఆ చట్టాలను రద్దు చేయాలని పేర్కొన్నాడు. 2006 సంవత్సరంలో బీహార్ లో వ్యవసాయ మార్కెట్‌ లు రద్దు చేయడం వల్లే రైతులు కూలీలుగా మారిపోయారు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం రైతుల ఆత్మహత్యలను ఆపే ప్రయత్నం చేయాలని. రైతులకు లాభ సాటి అయిన వ్యవసాయంను అందించాలని విజ్ఞప్తి చేశాడు.