Begin typing your search above and press return to search.

నేను రిచ్ ఫెలో ని.. చాలా హ్యాపీగా ఉన్నాను: ఆర్.నారాయణమూర్తి

By:  Tupaki Desk   |   15 July 2021 11:30 AM GMT
నేను రిచ్ ఫెలో ని.. చాలా హ్యాపీగా ఉన్నాను: ఆర్.నారాయణమూర్తి
X
పీపుల్ స్టార్ ఆర్.నారాయణమూర్తి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. అభ్యుదయ విప్లవాత్మక భావాలు కలిగిన నారాయణ మూర్తి మొదటి నుంచి కూడా ప్రజా సమస్యలపైనే సినిమాలు చేస్తూ వస్తున్నారు. నటుడిగా దర్శకుడిగా దర్శకుడిగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నారాయణ మూర్తి.. స్నేహచిత్ర బ్యానర్ ను స్థాపించి తాను రూపొందించే సినిమాలను నిర్మిస్తుంటారు.

40 ఏళ్ళుగా సినీ ఇండస్ట్రీలో ఉంటూ ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలు చేసిన ఆయన.. ఇప్పటికి సాదాసీదా జీవనం గడుపుతున్నారు. పెళ్లి చేసుకోకుండా ఒంటరి జీవితాన్ని గడుపుతున్న నారాయణ మూర్తి.. ఇప్పటివరకు సొంత ఇంటిని కూడా నిర్మించుకోలేదు. సినిమాల ద్వారా వచ్చిన మొత్తాన్ని కూడా సేవ కార్యక్రమాలకే వెచ్చిస్తారని సన్నిహితులు చెబుతూ ఉంటారు.

అయితే ఇటీవల 'రైతన్న' సినిమా ప్రివ్యూ సందర్భంగా గద్దర్ చేసిన వ్యాఖ్యల ఆధారంగా ఆర్.నారాయణమూర్తి ఆర్థికంగా చితికిపోయారని వస్తున్న వార్తల్లో నిజం లేదని విలక్షణ నటుడు అన్నారు.

తాజాగా ఆర్ నారాయణ మూర్తి మీడియాతో మాట్లాడుతూ.. అద్దె కట్టలేక ఇబ్బంది పడుతున్నాననే వార్తల్లో నిజం లేదని.. స్వేచ్ఛగా ఉంటుందనే నగర శివార్లలో ఉంటున్నానని చెప్పుకొచ్చారు. ''చిన్నప్పటి నుంచి నాది ఉద్యమాల జీవితం. ప్రజా జీవితం. హైస్కూలులో ఉన్నప్పుడు చాప మీదే పడుకున్నాను. 'అర్థరాత్రి స్వాతంత్ర్య' 'చీమల దండు' 'ఎర్రసైన్యం' 'దండోరా' 'ఊరు మనదిరా' వంటి సూపర్ హిట్ సినిమాలు తీసినప్పుడు కూడా చాప మీదే పడుకున్నాను. నేను ఇలా చాలా హ్యాపీగా ఉన్నాను. నేను చాలా రిచ్ ఫెలో ని. నేను అడిగితే సహాయం చేయడానికి స్నేహితులు ఉన్నారు. ఇండస్ట్రీలో చాలా మంది పెద్దలు ఉన్నారు. ప్రేక్షకులు కూడా నాపై దయ చూపిస్తారు.

కానీ నాకు ఏ కష్టాలు లేవు. సినిమా అన్న తర్వాత అప్పులు తేవడం.. తీర్చడం అనేది కామన్'' అని నారాయణ మూర్తి అన్నారు.

''సొంత లాభం చూసుకుని డబ్బులు బ్యాంక్ లో పెట్టుకొని, స్థలాలు కొనుక్కొనే మెంటాలిటీ నాది కాదు. నేను ఇలాగా హ్యాపీగా ఉంటుంటే నారాయణ మూర్తి కరెంట్ బిల్లు కట్టలేక, ఇంటి అద్దె కట్టలేక దీనస్థితిలో ఉన్నాడని రాయడం ఏంటండి. కొందరు అమీర్ పేట హాస్టల్ లో ఉంటున్నాడని రాస్తున్నారు. సామాజిక మాధ్యమాలు అలా రాయడం ధర్మమా చెప్పండి.

గద్దర్ గారు నా మీద ప్రేమతో, అభిమానంతో అలా మాట్లాడితే.. అప్పుడే స్టేజి మీదే నా దగ్గర డబ్బులు ఉన్నాయి. నేను స్వేచ్ఛగా జీవించడానికి ఇలా ఉన్నాను అని చెప్పాను. కానీ ఇవేమీ సోషల్ మీడియాలో రాయలేదు'' అని నారాయమూర్తి చెప్పారు. ఆటోలో ప్రయాణించడానికే తనకు రోజుకు వెయ్యి రూపాయలు అవుతుందని.. ఆ రకంగా ఆటోకే నెలకు 30 వేలు ఖర్చు అవుతుందని ఆయన చెప్పారు. ప్రభుత్వాలు కూడా గతంలో ఇల్లు ఇస్తానని చెప్పినా తాను తీసుకోలేదని.. సోషల్ మీడియాలో వస్తున్న అసత్య వార్తలు తన మనసుకు బాధను కలిగిస్తున్నాయని.. దయచేసి అలాంటి వాటిని ప్రచారం చేయవద్దని ఆర్ నారాయమూర్తి కోరారు.