Begin typing your search above and press return to search.

గ్లోబల్ రీచ్ కు పొంగిపోకుండా.. తదుపరి చిత్రాలపైనే దృష్టి పెట్టిన R.R.R..!

By:  Tupaki Desk   |   9 July 2022 12:30 AM GMT
గ్లోబల్ రీచ్ కు పొంగిపోకుండా.. తదుపరి చిత్రాలపైనే దృష్టి పెట్టిన R.R.R..!
X
'బాహుబలి' సినిమాల కోసం ఐదేళ్ల టైం తీసుకున్న ఎస్ఎస్ రాజమౌళి.. వీలైనంత త్వరగానే తదుపరి చిత్రాన్ని పూర్తి చేయాలనుకున్నారు. దీనికి తగ్గట్టుగానే RRR మూవీని ప్రకటించారు. కారణాలు ఏవైనా సరిగ్గా ఐదేళ్ల తర్వాతే జక్కన్న నుంచి మరో సినిమా రిలీజ్ అయింది. విడుదల ఆలస్యమైనా బాక్సాఫీస్ వద్ద ఫలితం మాత్రం మారలేదు.

ఎన్టీఆర్ - రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో దర్శకధీరుడు రాజమౌళి చేసిన 'ఆర్.ఆర్.ఆర్' చిత్రం బ్లాక్‌ బస్టర్ విజయాన్ని సాధించింది. వరల్డ్ వైడ్ గా 1100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక ఓటీటీలో ఈ యాక్షన్ డ్రామా గ్లోబల్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించి సంచలనం సృష్టించింది.

హాలీవుడ్ ప్రముఖుల మన్ననలు పొంది తెలుగు సినిమా ఖ్యాతిని చాటిచెప్పింది. ముఖ్యంగా దర్శకుడు రాజమౌళి పనితీరును.. ఇద్దరు హీరోల పెర్ఫార్మన్స్ ను అందరూ కొనియాడుతున్నారు. వసూళ్ల పరంగా 'కేజీఎఫ్ 2' కంటే తక్కువ అయినా.. ప్రశంసల విషయంలో మాత్రం ట్రిపుల్ ఆర్ ముందుందని చెప్పాలి.

అయితే RRR సినిమాపై అంతర్జాతీయంగా ప్రశంసల వర్షం కురుస్తున్నా.. జక్కన్న కానీ తారక్ - చరణ్ కానీ దీని గురించి ఒక్క మాట కూడా మాట్లాడ లేదు. మామూలుగా ఏ సినిమాకైనా ఈ స్థాయిలో ప్రశంసలు లభిస్తే.. గ్రాండ్ గా సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంటారు. కష్టానికి తగిన ఫలితం దక్కిందని సంబర పడుతుంటారు. కానీ ట్రిపుల్ ఆర్ దర్శక హీరోలు మాత్రం గ్లోబల్ రీచ్ గురించి పొంగిపోతూ ఒక్క ట్వీట్ కూడా పెట్టలేదు.

వీరి స్థానంలో ఏ ఇతర దర్శక హీరోలున్నా ఇలా సైలెంట్ గా ఉండేవారు కాదేమో. కాకపోతే RRR అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి మాత్రం రెగ్యులర్ గా ట్వీట్లు వస్తున్నాయి. సినిమాని ప్రశంసించిన సెలబ్రిటీలకు సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

'ఆర్.ఆర్.ఆర్' సినిమా తర్వాత రాజమౌళి - రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ ముగ్గురూ తదుపరి చిత్రాలపై ఫోకస్ పెట్టారు. తారక్ త్వరలోనే కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నాడు. మరోవైపు శంకర్ డైరెక్షన్ లో చెర్రీ RC15 షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

ఇక రాజమౌళి విషయానికొస్తే మహేష్ బాబు కోసం కథ సిద్ధం చేసే పనిలో మునిగిపోయారు. మధ్యలో కొన్ని ట్రైలర్లు రిలీజ్ చేస్తూ ట్వీట్లు పెట్టాడు కానీ.. RRR వరల్డ్ వైడ్ సక్సెస్ గురించి మాట్లాడలేదు. దీనిని బట్టి RRR దర్శక హీరోలు ఈ విజయానికి పొంగిపోకుండా.. తదుపరి చిత్రంతో సంచలనం సృష్టించడంపైనే ఫోకస్ పెట్టారని అనుకోవచ్చు.