Begin typing your search above and press return to search.

రాశి ఖన్నా.. అసలెలా హీరోయినైంది?

By:  Tupaki Desk   |   22 April 2018 3:30 PM GMT
రాశి ఖన్నా.. అసలెలా హీరోయినైంది?
X
కథానాయికగా టాలీవుడ్లో చాలా వేగంగా ఎదిగింది రాశి ఖన్నా. ఆమె తొలి సినిమా ‘ఊహలు గుసగుసలాడే’ సూపర్ హిట్. ఆ తర్వాత కూడా మరిన్ని విజయాలందుకుంది. తాజాగా ‘తొలి ప్రేమ’తో నటిగా ఆమె గొప్ప పేరే సంపాదించింది. ప్రస్తుతం తెలుగు.. తమిళంలో కలిపి అరడజను దాకా సినిమాలు చేస్తోంది ఈ ఢిల్లీ ముద్దుగుమ్మ. తాను ఇప్పుడున్న స్థాయిలో ఉండటం అనూహ్యమే అని ఆమె అంటోంది. హీరోయిన్ కావాలన్న ఆశ తనకు ఎప్పడూ లేదని.. తన లక్ష్యం ఐఏఎస్ అయితే అనుకోకుండా సినీ రంగంలోకి వచ్చానని ఆమె అంది. తాను హీరోయిన్ ఎలా అయ్యానో ఓ ఇంటర్వ్యూలో ఆమె వివరించింది.

‘‘ఢిల్లీలో ఒక రోజు ఓ షాపింగ్ మాల్లో నా ఫ్రెండుతో కలిసి షాపింగ్ చేస్తుండగా ఒక ప్రకటన వినిపించింది. ఫొటో తీయించుకోండి.. మోడల్ అవండి అని అందులో చెప్పారు. వెళ్లి ఫొటో తీయించుకున్నా. ఆశ్చర్యకరంగా నాలుగు రోజుల తర్వాత ఫెమీనా ముఖచిత్రంపై నా ఫొటో కనిపించింది. నమ్మలేకపోయా. అంతకుముందే నన్నో అమ్మాయి మోడలింగ్ చేస్తావా అని అడిగింది. కుదరదన్నాను. ఫెమీనా కవర్ పేజీపై నా ఫొటో రావడం చూసి ఆ అమ్మాయే నా నంబర్ తెలుసుకుని ఫోన్ చేసింది. అప్పుడు సీరియస్ గా ఆలోచించా. ఇంట్లోవాళ్లు వద్దన్నా సరే.. వీకెండ్లో మాత్రమే మోడలింగ్ చేసేలా ఒప్పించా. ఆ తర్వాత ఫెమీనా మ్యాగజైన్ పై ఫొటో చూసే ‘మద్రాస్ కేఫ్’ సినిమా యూనిట్ వాళ్లు ఫోన్ చేశారు. ఆడిషన్ కు రమ్మన్నారు. నేను కుదరదన్నాను. కానీ మూడు రోజుల పాటు అదే పనిగా ఫోన్ చేస్తే వెళ్లాను. ఆడిషన్ తర్వాత నేను సెలక్ట్ అయ్యానని చెప్పాను. ఆ సినిమా చేసే సమయంలోనే ‘ఊహలు గుసగుసలాడే’లో అవకాశం వచ్చింది’’ అని రాశి తెలిపింది.