Begin typing your search above and press return to search.

తెలుగు-మ‌ళ‌యాళ న‌టి కేసులో కొత్త మ‌లుపు

By:  Tupaki Desk   |   3 Aug 2018 5:17 PM GMT
తెలుగు-మ‌ళ‌యాళ న‌టి కేసులో కొత్త మ‌లుపు
X
తెలుగులో కూడా న‌టించిన‌ మ‌ల‌యాళ నటి లైంగిక వేధింపుల కేసు మాలీవుడ్ లో పెను ప్ర‌కంప‌న‌లు రేపిన సంగ‌తి తెలిసిందే. ఆ కేసులో మ‌లయాళ స్టార్ హీరో దిలీప్ అరెస్టు కావ‌డం...బెయిల్ పై విడుద‌లవ‌డం వంటి ప‌రిణామాలు దేశవ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. ఆ త‌ర్వాత దిలీప్ ను మళయాళ మూవీ ఆర్టిస్ట్‌ అసోషియేషన్‌(అమ్మ) లోకి అధ్య‌క్షుడు మోహ‌న్ లాల్ ఆహ్వానించ‌డం పెను దుమారం రేపింది. ఈ నేప‌థ్యంలో ఈ కేసు తాజాగా కీల‌క‌మైన మ‌లుపు తిరిగింది. ఈ కేసు విచార‌ణ‌కు మ‌హిళా జ‌డ్జిని నియ‌మించాల‌ని న‌టీమ‌ణులు హనీ రోజ్‌ - రచనా నారాయణ కుట్టీలు కేరళ హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. ఆ పిటీషన్‌ తోపాటు ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలన్న హీరో దిలీప్‌ అభ్యర్థనను కూడా బెంచ్‌ శుక్రవారం విచారణకు స్వీకరించింది. ఈ కేసును మహిళా జడ్జి పర్యవేక్షణలోనే విచారణ చేయిస్తామని కేరళ ప్రభుత్వం గ‌తంలోనే ప్ర‌క‌టించింది.

అయితే మ‌హిళా జడ్జిని నియ‌మించ‌డంలో జాప్యం జ‌రిగింది. దాంతోపాటు - దిలీప్ పై నిషేధం ఎత్తివేస్తూ `అమ్మ`అధ్య‌క్షుడు మోహ‌న్ లాల్ తీసుకున్న నిర్ణయం వివాదాస్ప‌ద‌మైంది. దీంతో, మ‌హిళా జ‌డ్జి నియామ‌కంపై ‘వుమెన్‌ ఇన్‌ సినిమా కలెక్టివ్‌’లోని నటీమణులు ప‌ట్టుబ‌ట్టారు. మహిళా జడ్జి ఉంటేనే ఈ కేసులో విచారణ పారదర్శకంగా జరుగుతుందని హనీ రోజ్‌ - రచనా నారాయణ కుట్టీలు అభిప్రాయ‌ప‌డ్డారు. కాగా, దిలీప్ పై నిషేధాన్ని ఎత్తివేయ‌డంతో పాటు అత‌డికి `అమ్మ‌`లో స‌భ్య‌త్వం క‌ల్పించిన మోహ‌న్ లాల్ పై ప‌లువురు మాలీవుడ్ న‌టీన‌టులు - ద‌ర్శ‌కులు మండిప‌డ్డ సంగ‌తి తెలిసిందే. కేరళ ప్రభుత్వం ప్రకటించే సినిమా అవార్డుల ఫంక్షన్ కు మోహ‌న్ లాల్ ను బాయ్ కాట్ చేయాల‌ని కూడా ప‌లువురు నటీన‌టులు అభిప్రాయ‌ప‌డ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.