Begin typing your search above and press return to search.

రాధేశ్యామ్‌ : మ్యాజిక్ ఫిగర్ జస్ట్‌ మిస్‌.. అయినా రికార్డే

By:  Tupaki Desk   |   12 March 2022 3:25 AM GMT
రాధేశ్యామ్‌ : మ్యాజిక్ ఫిగర్ జస్ట్‌ మిస్‌.. అయినా రికార్డే
X
ప్రభాస్‌ నటించిన రాధేశ్యామ్‌ భారీ అంచనాల నడము నిన్న విడుదల అయ్యింది. సినిమాకు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. బాహుబలి.. సాహో సినిమాల తర్వాత ప్రభాస్ నటించిన సినిమా అవ్వడంతో మొత్తం దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూశారు. కేవలం ఇక్కడి సినీ ప్రేమికులు మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండియన్ సినీ అభిమానులు కూడా ఈ సినిమా పై ఆసక్తి కనబర్చారు.

యూఎస్ లో ఈ సినిమా భారీ ఎత్తున విడుదల చేశారు. రికార్డు స్థాయిలో ప్రీమియర్ షో లు అమెరికాలో పడ్డాయి. దాంతో మొదటి నుండి రాధేశ్యామ్‌ సినిమా ప్రీమియర్ లతో మిలియన్ మార్క్ ను టచ్ చేస్తుందని అంతా భావించారు. కాని ఆ మ్యాజిక్‌ ఫిగర్ కు లక్ష డాలర్ల దూరంలో నిలిచి పోయింది రాధేశ్యామ్‌. ప్రీమియర్ మరియు మొదటి రోజు వసూళ్లు కలిసి మిలియన్ డాలర్లను మించి వసూళ్లు చేసింది కాని ప్రీమియర్ తో మాత్రం మిలియన్ మార్క్ జస్ట్‌ మిస్ అయ్యింది.

ప్రిమియర్ లతోనే మిలియన్‌ డాలర్ల క్లబ్‌ లో ఈ సినిమా చేరుతుందని ఆశ పడ్డ అభిమానులకు కాస్త నిరాశ తప్పదు. కాని ఈ సినిమా ఈ ఏడాదిలో వచ్చిన సినిమాల్లో అత్యధిక యూఎస్ ప్రీమియర్‌ వసూళ్లు దక్కించుకున్న సినిమా గా నిలిచింది. దాదాపుగా 8.9 లక్షల డాలర్లను ప్రీమియర్‌ ల ద్వారా వసూళ్లు చేసి రికార్డు ను సొంతం చేసుకున్న ప్రభాస్‌ మరో సారి ఓవర్సీస్ బాక్సాఫీస్ ను షేక్‌ చేశాడు.

లాంగ్‌ రన్‌ లో ఈ సినిమా అక్కడ భారీగా వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయంటూ ఓవర్సీస్ ట్రేడ్‌ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈమద్య కాలంలో ఏ ఇండియన్ సినిమా సాధించని వసూళ్లను ఈ సినిమా సాధించే అవకాశం ఉందనే నమ్మకంను వారు వ్యక్తం చేస్తున్నారు. రాధేశ్యామ్‌ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగానే వసూళ్లను నమోదు చేస్తూ వస్తుంది.

పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమా లో ప్రభాస్‌ జ్యోతిష్యుడిగా కనిపించాడు. విధి రాతను ఎదిరించి బలంగా తల్చుకుంటే ఖచ్చితంగా జీవితంలో సఫలం అవుతారు అనేది ఈ సినిమా లైన్. రాధాకృష్ణ ఈ సినిమాను చాలా భారీగా చూపించారు. రికార్డు స్థాయిలో ఈ సినిమా కోసం బడ్జెట్‌ ఖర్చు చేశారు.

యూవీ క్రియేషన్స్ వారు పెట్టిన బడ్జెట్ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ తోనే వచ్చేసిందట. అంతటి భారీ బిజినెస్‌ దక్కించుకున్న ఈ సినిమా ఆ స్థాయిలో వసూళ్లు రాబట్టగలదా అనేది ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.