Begin typing your search above and press return to search.

జ‌ల్లిక‌ట్టు అలా ఎందుకు మారిందో చెప్తున్న లారెన్స్‌

By:  Tupaki Desk   |   28 Jan 2017 1:31 PM GMT
జ‌ల్లిక‌ట్టు అలా ఎందుకు మారిందో చెప్తున్న లారెన్స్‌
X
దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌న సృష్టించిన జ‌ల్లిక‌ట్టు ఉద్య‌మంలో కీల‌క పాత్ర పోషించిన న‌టుడు రాఘ‌వ లారెన్స్ ఆ ఆందోళ‌న స‌మ‌యంలో జ‌రిగిన ఆస‌క్తిక‌ర‌ విష‌యాల‌ను పంచుకున్నారు. జల్లికట్టుకు మద్దతుగా మెరీనా బీచ్ లో వారం పాటు సాగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన లారెన్స్ తాజాగా ఓ మీడియా సంస్థ‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. జ‌ల్లిక‌ట్టు మంచి స్పూర్తితో ప్రారంభం అయిన‌ప్ప‌టికీ అది కొన‌సాగ‌డంలో దారి త‌ప్పింద‌ని తెలిపారు. స‌రైన నాయ‌కుడు లేక‌పోవ‌డ‌మే ఇందుకు కార‌ణ‌మ‌ని లారెన్స్ అభిప్రాయ‌ప‌డ్డారు. అంతేకాకుండా యువ‌తతో సంబంధం లేని కొందరు రంగ ప్ర‌వేశం చేయ‌డంతో ప‌రిస్థితిలో మార్పు వ‌చ్చింద‌ని తెలిపారు.

జ‌ల్లిక‌ట్టు ఉద్య‌మాన్ని అణిచివేయాల‌ని భావించిన ప్ర‌భుత్వం పలు ఉత్త‌ర్వుల‌ను జారీచేసింద‌ని అయితే అవి నిబంద‌న‌ల‌కు పూర్తి విరుద్ధ‌మ‌ని లారెన్స్ వివ‌రించారు. వివరణ ఇవ్వకుండా ఉద్యమంలో ఉన్న యువకులను ఎలాగైనా తరిమికొట్టాలని పోలీసులు భావించి అందరూ వెళ్లిపోవాలని మైక్‌లో చెప్పారని లారెన్స్ గుర్తు చేశారు. త‌మ‌కు చూపించిన‌ రాష్ట్ర ప్ర‌భుత్వ ఆదేశ‌మ‌ని చెప్పార‌ని అయితే అందులో క‌నీసం గ‌వ‌ర్న‌ర్ సంత‌కం కూడా లేద‌ని వివ‌రించారు. అయితే అదే స‌మ‌యంలో తాను మెరీనా బీచ్‌కు వెళ్లినట్లు తెలిపారు. త‌న రిక్వెస్ట్ మేర‌కు రెండు గంట‌ల అద‌న‌పు స‌మ‌యం ఇచ్చార‌ని లారెన్స్‌ తెలిపారు. విద్యార్థులు, యువత కాని వారు కొంద‌రు రంగ ప్ర‌వేశం చేయ‌డంతో పోలీసులు అనుకూలంగా మలుచుకుని వెంటనే లాఠీఛార్జీ చేశారని వివ‌రించారు. జల్లికట్టుకు ప్రత్యేక చట్టం విషయంలో మనం విజయం సాధించామని, ఇక ఆందోళన విరమించుకుందామని చెప్పడంతో చాలా వరకు యువకులు వెళ్లిపోయారని అయితే కొందరు మాత్రం అక్కడే కూర్చొని 'ప్రత్యేక తమిళనాడు' అంటూ నినాదాలు చేశారని త‌ద్వారా ప‌రిస్థితి చేయి దాటిపోయింద‌ని లారెన్స్ వ్యాఖ్యానించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/