Begin typing your search above and press return to search.

ధాతృత్వాన్ని మ‌రోసారి చాటిన లారెన్స్‌

By:  Tupaki Desk   |   7 Sep 2016 6:13 AM GMT
ధాతృత్వాన్ని మ‌రోసారి చాటిన లారెన్స్‌
X
కష్టాల్లో ఉన్న‌వారిని ఆదుకోవాల‌న్న మంచి మ‌న‌సు కొద్దిమందికే ఉంటుంది. సంపాద‌న‌లో కొంత భాగాన్ని సాయం కోసం కేటాయించ‌గ‌ల‌ ధాతృత్వం అది కొద్దిమందికే ఉంటుంది. అలాంటి వారిలో రాఘ‌వ లారెన్స్ ఒక‌రు అని చెప్పుకోవాలి. ఆయ‌న ఎన్నో క‌ష్టాలు ప‌డి ఒక నృత్య ద‌ర్శ‌కుడిగా - ఒక సినీ ద‌ర్శ‌కుడిగా - న‌టుడిగా ఎదిగారు. కెరీర్‌ లో త‌న‌కంటూ ఒక స్థాయి వ‌చ్చాక క‌ష్టాల్లో ఉన్న‌వారిని ఆదుకోవ‌డం మొదలుపెట్టారు. ఎంతోమందికి గుండె శ‌స్త్ర చికిత్స‌లు చేయించారు లారెన్స్‌. ఇప్ప‌టి వ‌ర‌కూ 130 మందికి ఆర్థికసాయం ఆదించి శ‌స్త్ర చికిత్స‌లు చేయించారు. తాజాగా అభినేష్ అనే కుర్రాడికి సాయ‌ప‌డ్డారు. అభినేష్ చాలా రోజులుగా గుండెకు సంబంధించిన స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నాడు. విష‌యం తెలుసుకున్న లారెన్స్ ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చారు. దీంతో సోమ‌వారం నాడు అభినేష్ కి సాయం ప్ర‌క‌టించారు. ప్రస్తుతం అభినేష్ ఆరోగ్యంగా ఉన్నాడ‌ని చెబుతున్నారు.

నిజానికి, ఇంకా ఎన్నో సామాజిక సేవ‌కార్య‌క్ర‌మాలు చేస్తుంటారు లారెన్స్‌. అనాథ‌లు - విక‌లాంగుల‌ను ఆదుకునేందుకు ఆశ్ర‌మాల‌ను క‌ట్టించిన సంగ‌తి తెలిసిందే. అలాగే, చాలామంది అభాగ్యుల‌ను ద‌త్త‌త తీసుకుని వారికి విద్యాబుద్ధులు చెప్పిస్తూ వారి పోష‌ణ బాధ్య‌త‌ల్ని త‌న క‌ర్త‌వ్యంగా స్వీక‌రించారు లారెన్స్‌. త‌న త‌ల్లిమీద ఉన్న అపార‌మైన ప్రేమ‌కు చిహ్నంగా ఒక దేవాల‌యాన్ని కూడా నిర్మిస్తున్నారు. త్వ‌ర‌లో ఆ ఆల‌యంలో త‌న అమ్మ విగ్ర‌హాన్ని ప్ర‌తిష్టించ‌బోతున్నారు. ఈ ఆల‌యం కేంద్రంగా మ‌రికొన్ని సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని లారెన్స్ భావిస్తున్నారట‌. సంపాదించింది ప‌దింత‌లు చేయ‌డం ఎలా అని ఆలోచించేవారు ఎక్కువ‌గా ఉన్న ఈ రోజుల్లో... ఉన్న‌దానిలో కొంత తోటివారికి ఉప‌యోగ‌ప‌డితే చాలు అని ఆలోచించే గొప్ప మ‌న‌సు ఉన్న లారెన్స్ లాంటి వాళ్లు చాలా అరుదుగా ఉంటారు అన‌డంలో అతిశ‌యోక్తి ఉండ‌దు.