Begin typing your search above and press return to search.

టాలీవుడ్ పెద్ద దిక్కుపై ద‌ర్శ‌కేంద్రుడి సంచ‌ల‌న వ్యాఖ్య‌

By:  Tupaki Desk   |   19 Oct 2021 12:30 AM GMT
టాలీవుడ్ పెద్ద దిక్కుపై ద‌ర్శ‌కేంద్రుడి సంచ‌ల‌న వ్యాఖ్య‌
X
ద‌ర్శ‌క‌ర‌త్న డా.దాస‌రి నారాయ‌ణ‌రావు స్వ‌ర్గ‌స్తులైన త‌ర్వాత ప‌రిశ్ర‌మ పెద్ద దిక్కుని కోల్పోయిన మాట వాస్త‌వం. ఇప్పుడు ఆ స్థానం ఎవ‌రిది? అన్న దానిపై కొన్నేళ్లుగా వాడివేడిగా చ‌ర్చ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. చాలామంది అభ్య‌ర్థ‌న‌ల‌ను ప‌రిశీలించిన అనంత‌రం ప‌రిశ్ర‌మ పెద్ద‌గా మెగాస్టార్ చిరంజీవి వ్య‌వ‌హరించేందుకు ముందుకొచ్చార‌ని ఇంత‌కుముందు దాస‌రి శిష్యుడు త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజా వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. పెద్ద‌రికంపై ఇప్ప‌టికే తెలుగు మీడియాలో ర‌క‌ర‌కాల‌ క‌థ‌నాలు వేడెక్కించాయి. వాటిపై మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు కూడా ఇటీవ‌ల త‌న‌దైన శైలిలో వివ‌ర‌ణ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ప‌రిశ్ర‌మ‌కు పెద‌రాయుడు పాత్ర‌ని..పెద్ద‌న్న పాత్ర‌ని అన్న‌య్య పోషించ‌డం లేద‌ని.. అన్న‌య్య ఇంటికి ఏదైనా స‌మ‌స్య ఉంటే వెళ్లిన వారి స‌మ‌స్య‌కు ప‌రిష్కారం మాత్ర‌మే చూపిస్తున్నారు. అలాగ‌ని ఆయ‌న్ని పెద్ద దిక్కు అని అనుకోవ‌డం ఏంట‌ని? గ‌ట్టిగానే క్లాస్ పీకారు.

మా ప‌నులు మాకున్నాయి..మా జీవితాలు మావి..అంత ఖాళీ మాకెక్క‌డిది అన్న‌ట్లు మాట్లాడారు. తాజాగా ద‌ర్శ‌కేంద్రుడు దాస‌రి నారాయ‌ణ రావుకు ఓఇంట‌ర్వ్యూలో ఇలాంటి ప్ర‌శ్నే ఎదురైంది. దీంతో ద‌ర్శ‌కేంద్రుడు తెలివైన స‌మాధానంతో త‌ప్పించుకున్నారు. ప‌రిశ్ర‌మ‌లో ఈమాట ఇటీవ‌లి కాలంలో ఎక్కువ‌గా వినిపిస్తున్న మాట వాస్త‌వం. కానీ అస‌లు ఇండ‌స్ట్రీకి పెద్ద దిక్కుగా ఉండాల్సిన అవ‌స‌రం ఎవ‌రికీ లేదు. ఎవ‌రి ప‌నులు వాళ్లు చేసుకుంటూ వెళ్లిపోవ‌డ‌మే మేలు. మ‌న ఇంట్లో పిల్ల‌లే మ‌న మాట విన‌రు. అలాంటప్పుడు ఎవ‌రో చెప్పింది ప‌రిశ్ర‌మ‌లో ఉన్న వాళ్లు ఎందుకు వింటారు. అన‌వ‌స‌రంగా మాట్లాడి న‌లుగురిలో చెడ‌టం త‌ప్ప‌..అంత‌కు మించి ఏమీ ఒర‌గ‌దు. నేను ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చిన త‌ర్వాత నేర్చుకున్న‌ది ఏంటంటే? ఉచితంగా ఎవ‌రికీ స‌ల‌హాలు ఇవ్వ‌కూడ‌ద‌ని. అందుకే నేను చాలా త‌క్కువ‌గా మాట్లాడుతాను. అదీ అవ‌స‌రం అనుకుంటేనే..అవ‌తలి వాళ్లు మ‌రీ ప‌ట్టుబ‌డితేనే మాట్లాడుతాను... అని తెలిపారు.

ఎవ‌రైనా మంచి కోసం చెప్పినా దాన్ని చెడుగాను భావిస్తారు. అందుకే మ‌న‌కెందుకు వ‌చ్చిన గొడ‌వ‌ని ఇలాంటి విష‌యాల్లో వేలు పెట్ట‌ను అని త‌న‌దైన శైలిలో స్పందించారు. మ‌న‌కున్న గౌర‌వాన్ని కాపాడుకుంటూ వెళ్లిపోవ‌డ‌మే ముఖ్యం... కానీ ఇండ‌స్ట్రీలో అతిగా చేస్తే ఉన్న సినిమా కూడా కాలిపోతుంది అనేసారు. ప్ర‌స్తుతం `మా` ఎన్నిక‌ల్లో మంచు విష్ణు గెలిచాక‌.. మోహ‌న్ బాబు సినీపెద్ద‌గా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశం ద‌క్కిందంటూ ప్ర‌చారం సాగుతోంది. మ‌రి చిరు- మోహన్ బాబు ఇద్ద‌రూ కొన‌సాగుతారా? లేక మోహ‌న్ బాబుకే ఇండ‌స్ట్రీ వారంతా పెద్ద‌రికాన్ని బ‌ద‌లాయిస్తారా? అన్న గుస‌గుస కూడా వేడెక్కించేస్తోంది.

వెట‌ర‌న్ నిర్మాత‌ త‌మ్మారెడ్డి ఏమ‌న్నారు..?

ద‌ర్శ‌క‌ర‌త్న డా.దాస‌రి నారాయ‌ణ‌రావు శిష్యుడిగా త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ సుప‌రిచితులు. గురువుగారి ప్ర‌తి కార్య‌క్ర‌మంలో ఆయ‌న కీల‌క స‌భ్యుడు. బుల్లితెర వెండితెర ప‌రిశ్ర‌మ‌లో ఆయ‌న నిర్మాత‌గా కొన‌సాగుతున్నారు. ఇక ప్ర‌జానాట్య‌మండ‌లి బాణీలో ఉన్న మాట‌ను బ‌లంగా మాట్లాడే త‌త్వం త‌మ్మారెడ్డి సొంతం. ప‌రిశ్ర‌మ పెద్ద‌ల తప్పొప్పుల‌ను ఆయ‌న విశ్లేషిస్తారు. అయితే దాస‌రి మ‌ర‌ణానంత‌రం భ‌ర‌ద్వాజ త‌దిత‌రులు ఆ స్థానాన్ని భ‌ర్తీ చేయాల‌ని మెగాస్టార్ ని కోరారు. కానీ అందుకు చిరు తొలుత స‌మ్మ‌తించ‌లేదు. కానీ కాల‌క్ర‌మంలో ఆయ‌న యాక్టివిటీస్ అంద‌రివాడు అనిపించేంత‌గా మారాయి. ఓవైపు సినిమాలు చేస్తున్నా కానీ త‌న‌ని క‌లిసి స‌మ‌స్య‌ను వివ‌రిస్తే పరిష్క‌రించేందుకు ముందుకొస్తున్నారు. ఆర్టిస్టులు స‌హా ప‌రిశ్ర‌మ పేద‌ల క‌ష్టాల‌ను తెలుసుకుని మ‌రీ ఆర్థిక విరాళాలు అందిస్తున్నారు. గ‌త కొంత‌కాలంగా చిన్న సినిమాల‌ను కొత్త హీరోల‌ను మెగాస్టార్ ప్రోత్స‌హిస్తున్నంత‌గా ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు. ఆయ‌న పెద్ద‌రికానికి విలువిచ్చి ప‌రిశ్ర‌మ‌లో ఏ స‌మ‌స్య ఉన్నా ఆయ‌న‌ను క‌లుస్తున్నారు.

మెగాస్టార్ సీసీసీ సేవాకార్య‌క్ర‌మాలు స‌హా పేద‌ల‌కు ఆర్థిక విరాళాల అంశాన్ని కూడా పెద్ద ఎత్తున ప్ర‌శంసించారు. చిరు కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి ఏ కష్టం వచ్చినా తానున్నానంటూ ముందుకు వచ్చి.. గొప్ప సేవ‌లు చేసార‌ని కూడా తమ్మారెడ్డి అన్నారు. దశాబ్దాలుగా బ్లడ్ బ్యాంక్-ఐ బ్యాంక్ నెల‌కొల్పి సేవ‌లు చేస్తున్నార‌ని గుర్తు చేశారు. క‌రోనా క్రైసిస్ లో చిరు సేవ‌లు అసామాన్య‌మ‌ని కీర్తించారు. ఆక్సిజన్ సిలిండర్ల కోసం భారీ మొత్తాన్ని ఖర్చు చేశారని..ఎవ‌రికీ అంద‌నంత ఎత్తులో చిరు సాయం చేసారని తమ్మారెడ్డి ఇంత‌కుముందు ప్ర‌శంసించారు. ల‌క్ష‌ల్లో దానాలిస్తున్నార‌ని ల‌క్ష‌- 2ల‌క్ష‌లు చెక్కులు రాసి ఇస్తున్నార‌ని కూడా చిరుని ప్ర‌శంసించారు. ఇలాంటి సాయాల్ని ఆయ‌న ప్ర‌చారం చేసుకునేందుకు ఇష్ట‌ప‌డ‌లేద‌ని కూడా అన్నారు. అయితే మంచి ప‌దిమందికి తెలిసేందుకు ఈమాత్రం బ‌య‌ట‌కు తెలుస్తుంద‌ని తాను చెబుతున్న‌ట్టు కూడా అన్నారు. సినీప‌రిశ్ర‌మకు చిరంజీవి పెద్ద‌గా ప‌నికొస్తారా లేదా? అన్న‌ది త‌మ్మారెడ్డి నోట ఇలా బ‌య‌ట‌ప‌డింది. ఇక మంచు కుటుంబం కూడా నిరంత‌రం సేవాకార్య‌క్ర‌మాలు చేస్తోంది. కానీ వాటికి స‌రైన ప్ర‌చారం క‌ల్పించ‌లేదు ఎందుక‌నో. ఇండ‌స్ట్రీ లో ఒక‌ పెద్ద‌గా ఉన్న మంచు మోహ‌న్ బాబు సేవా కార్య‌క్ర‌మాల‌పైనా భ‌రద్వాజా కానీ ఆయ‌న లాంటి ఇత‌రులు కానీ స్పందిస్తారేమో చూడాలి. టాలీవుడ్ పెద్ద‌గా ఎవ‌రు బెస్ట్ చిరంజీవినా.. మోహ‌న్ బాబా? అంటూ ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాల్లో బోలెడ‌న్ని డిబేట్లు న‌డుస్తున్న వేళ ఎవరికి వారు ఆ ఇద్ద‌రూ చేసిన సేవ‌ల గురించి ప్ర‌స్థావిస్తున్నారు. ఎవ‌రేం చేసారో బేరీజు వేస్తున్నారు.