Begin typing your search above and press return to search.

హీరోగా రాఘవేంద్రరావు అల్లరి .. నలుగురు హీరోయిన్ల సందడి!

By:  Tupaki Desk   |   8 Oct 2021 12:30 AM GMT
హీరోగా రాఘవేంద్రరావు అల్లరి .. నలుగురు హీరోయిన్ల సందడి!
X
తెలుగు సినిమా కథకు .. పాటకు రొమాంటిక్ పాఠాలు నేర్పిన దర్శకుడు రాఘవేంద్రరావు. ఆయన కెమెరా కన్ను నుంచి హీరోయిన్ల అందాలు తప్పించుకోలేవు. కథలో పడి కొట్టుకుపోతున్న ప్రేక్షకుడికి ఆయన అరగంటకోసారి ఓ రొమాంటిక్ సాంగ్ ను అందిస్తూ ఆదుకుంటారు. ఆ పాట వాళ్లపై ఒక ఎనర్జీ డ్రింక్ లా పనిచేస్తూ ఉంటుంది. సాధారణంగా థియేటర్లకు వచ్చే వాళ్లలో మాస్ ఆడియన్స్ ఎక్కువగా ఉంటారు. అందువలన ఆయన తన కథలో .. పాటల్లో రొమాన్స్ ఉండేలా చూసుకుంటారు.

హీరోయిన్లతో సౌందర్య శిల్పాలను తలపించే భంగిమలు పెట్టించడం .. పాలరాతి సొగసులపై పాలతో అభిషేకాలు చేయించడం .. హీరోయిన్ ను తలపులతో తడిపేస్తూ పూల వాన .. తేనె వాన .. పండ్ల వాన కురిపించడం .. పాల పాత్రల్లో పండ్లు వచ్చిపడటం .. నేరుగా చెప్పలేని భావాలను సింబాలిక్ గా చూపించి, ఆ అనుభూతిని ప్రేక్షకుడి ఊహకు వదిలేయడం ఆయన ప్రత్యేకత. హీరోయిన్లను ఆయన అంతటి అందంగా ఎవరూ చూపించలేరనే అభిమానుల అభిప్రాయం ఇప్పటికీ చెక్కుచెదరలేదు. అందువల్లనే ఆయన సినిమాల్లో తప్పకుండా నటించాలని హీరోయిన్లు కలలు కనేవారు.

రాఘవేంద్రరావు సినిమాల్లో శృంగారం పాళ్లు కాస్త ఎక్కువగానే కనిపిస్తాయి .. వినిపిస్తాయి. డైలాగుల్లోను .. సన్నివేశాల్లోను .. పాటల్లోను ఎక్కడ అవకాశం చిక్కితే అక్కడ రొమాన్స్ చొరబడిపోతూనే ఉంటుంది. వాటిని మాస్ ఆడియన్స్ ఒక రేంజ్ లో ఎంజాయ్ చేసేవారు. ఇక ఆయన సినిమాల్లో ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు ఉండేవారు. ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా ఉండటం కోసం .. గ్లామర్ కోటా పెంచడం కోసం ఆయన అలా చేసేవారు. అలా ఒక హీరో చుట్టూ ముగ్గురు నలుగురు హీరోయిన్లను ప్రదక్షిణలు చేయించిన రాఘవేంద్రరావు, ఇప్పుడు తాను హీరోగా మారిపోయారు .. నలుగురు హీరోయిన్లతో సందడికి సిద్ధమైపోతున్నారు.

అవును .. 'పెళ్లి సందD' సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించిన రాఘవేంద్రరావు, ఇప్పుడు హీరోగా మారిపోయారు. కథ అంతా కూడా ఆయన చుట్టూనే తిరుగుతుందట. ఈ సినిమాకి దర్శకుడు తనికెళ్ల భరణి. అలాగని చెప్పేసి ఇది 'మిథునం' టైపు సినిమా కాదు .. నలుగురు హీరోయిన్లు ఉంటారట. ఒక్కసారే చెబితే కోలుకోవడం కష్టమని వాళ్లెవరన్నది నిదానంగా చెబుతారట. తనికెళ్ల భరణి మనసుకి తగినట్టు .. రాఘవేంద్రరావు వయసుకి తగినట్టుగానే ఈ సినిమా ఉంటుందని అనుకోవాలంతే.

ఇప్పటికైతే స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. త్వరలోనే సెట్స్ పైకి తీసుకుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా ముహూర్తం సెట్ చేసుకుంటూ ఉండగానే రాఘవేంద్రరావు తను హీరోగా మరో ప్రాజెక్టును సెట్ చేసుకున్నారు. ఈ సినిమాకి వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహించనున్నారు. రాఘవేంద్రరావు కోసం ఆయన సిద్ధం చేసిన కథ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందని అంటున్నారు. తనికెళ్ల భరణి దర్శకత్వం వహిస్తున్న సినిమా పూర్తయిన తరువాత ఈ సినిమా మొదలుకానుంది. మొత్తానికి రాఘవేంద్రరావు ఈ విషయంలోను తన రూటే వేరు అన్నట్టుగా దూసుకుపోతుండటం విశేషం.