Begin typing your search above and press return to search.

చరణ్ ను అలా చూపించలేనన్న దర్శకేంద్రుడు

By:  Tupaki Desk   |   7 Oct 2018 10:30 AM GMT
చరణ్ ను అలా చూపించలేనన్న దర్శకేంద్రుడు
X
ఒకప్పుడు స్టార్ హీరోలకు ఒక వైకల్యం ఉన్నట్లు చూపించాలన్న ఆలోచనే వచ్చేది కాదు దర్శకులకు. హీరోలు సకల గుణ సంపన్నులుగా ఉండేవాళ్లు. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితి చాలా మారింది. హీరోలకు వైకల్యం ఉన్నట్లు చూపించడం ద్వారా వైవిధ్యం తేగలుగుతున్నారు దర్శకులు. ‘జై లవకుశ’లో ఎన్టీఆర్ కు నత్తి ఉన్నట్లు చూపించడమే హైలైట్ అయింది. ‘రంగస్థలం’లో రామ్ చరణ్ ను చెవిటివాడిగా చూపించి మార్కులు కొట్టేశాడు సుకుమార్.

ఐతే తమ రోజుల్లో ఇలా ఉండేది కాదంటున్నాడు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. అప్పట్లో హీరోల ఇమేజ్ అన్నింటికీ అడ్డం వచ్చేదని ఆయన అన్నారు. ‘రంగస్థలం’లో చరణ్ పాత్రను సుకుమార్ అద్భుతంగా తీర్చిదిద్దాడని.. తాను మాత్రం అలాంటి సాహసం చేయలేకపోయేవాడినని.. చరణ్ ను అలా చూపించాలన్న ఆలోచనే తనకు వచ్చేది కాదని రాఘవేంద్రరావు చెప్పారు. తాను తెలుగు తెరకు ఎంతోమంది హీరోల్ని పరిచయం చేశానని.. ఆ సమయానికి వాళ్లను అత్యుత్తమంగా చూపించడానికి ప్రయత్నించానని రాఘవేంద్రరావు అన్నారు.

విక్టరీ వెంకటేష్ హీరో కావడానికి ముందు అప్పుడే అమెరికా నుంచి వచ్చాడని.. సినిమా అనగానే కంగారు పడ్డాడని.. ఐతే కష్టపడి భాష నేర్చుకున్నాడని.. అతణ్ని ది బెస్ట్‌ గా చూపించడానికి ప్రయత్నించానని చెప్పారు. కొత్త హీరోల్ని పరిచయం చేసేటపుడు వాళ్లు ఏదైనా చేయగలరు అన్నట్లు చూపించడానికి ప్రయత్నిస్తానన్నారు. మహేష్ బాబు.. అల్లు అర్జున్ ల విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకున్నానని.. వారి వయసు.. రూపం అన్నీ చూసుకుని పాత్రలు తీర్చిదిద్దానని.. తెరమీద కూడా సరిగ్గా ప్రెజెంట్ చేశానని అనుకుంటున్నానని రాఘవేంద్రరావు అన్నారు.