Begin typing your search above and press return to search.

ఇక దర్శకేంద్రుడంటే రాజమౌళియే

By:  Tupaki Desk   |   18 Jan 2016 4:06 PM GMT
ఇక దర్శకేంద్రుడంటే రాజమౌళియే
X
రాఘవేంద్రరావు బి.ఎ.... తెలుగు సినీరంగంలో ఈ పేరు తెలియనివారు ఉండరు. దర్శకేంద్రుడని ఆయనకు పెద్ద పేరు. ఆయన సినిమాల శైలే వేరు... ఆ సినిమాల్లో పాటల సౌందర్యం ఇంకా అద్భుతం. ఆయన సినిమాలను ఆయన సృష్టించిన తీరుకు ముగ్ధులై సినీజనం, అభిమానులు ఆయనకు దర్శకేంద్రుడనే బిరుదిచ్చేశారు. ప్రేక్షకులు తనకు ఎంతో అభిమానంతో ఇచ్చిన బిరుదు ఆయనకు ఇంటిపేరుగా కూడా స్థిరపడిపోయింది. కానీ, మారిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆబిరుదు తనకంటే రాజమౌళికే కరెక్టుగా నప్పుతుందని ఆయన చెబుతున్నారు. అంతేకాదు ఇకపై దర్శకేంద్రుడు రాజమౌళే అంటూ శిష్యుడికిఆ గౌరవాన్ని బదిలీ చేసేశారు.

రీసెంటుగా ఆయన మాట్లాడుతూ అసలు దర్శకేంద్రుడన్న పేరు తనకు ఎలా వచ్చింది... దానికి తాను తగినవాడినా కాదా... దానికి తగినవారెవరన్న విషయంపై మాట్లాడారు.''సి.నారాయణరెడ్డిగారు ఒకసారి ఓ ఫంక్షన్లో నన్ను దర్శకేంద్రుడు అన్నారు. ప్రేక్షకులు దాన్నే పట్టుకుని ఖరారు చేశారు. కానీ, నేను దానికి తగినవాడిని కానని అనుకుంటున్నాను. నా మీద నేను పుస్తకం రాసుకుంటే.. 'నేను దర్శకేంద్రుణ్ని కాను. నేనూ ఓ దర్శకుణ్నే' అని దానికి పేరు పెట్టాలనుకున్నా. కారణమేంటంటే.. ఇంద్రుడు అనేవాడు ఒకడే ఉంటాడు. ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమను కె.వి.రెడ్డిగారు రూల్‌ చేశారు. ఆయన ఇంద్రుడి కింద లెక్క. మా జనరేషన్లో దాసరిగారిని దర్శకరత్న అన్నారు. నన్ను దర్శకేంద్రుడిని చేశారు. ఐతే ఈ జనరేషన్లో మాత్రం దర్శకేంద్రుడు రాజమౌళియే'' అని చెప్పారు రాఘవేంద్రరావు.

ఆ రకంగా ఆయన ఎంతోకాలంగా తనను అంటిపెట్టుకుని ఉన్న దర్శకేంద్రుడన్న బిరుదును రాజమౌళికి బదిలీ చేసేశారు. జక్కన్న అని ఇప్పటికే పిలిపించుకుంటున్న రాజమౌళిని అభిమానులు ఇకపై కొత్త దర్శకేంద్రుడిని చేస్తారో... లేదంటే వద్దన్నా కూడా రాఘవేంద్రరావుకే ఆగౌరవాన్ని కొనసాగిస్తారో చూడాలి.