Begin typing your search above and press return to search.

మీ గొడవ సరే.. డబ్బులు పెట్టినోళ్ల సంగతేంటి?

By:  Tupaki Desk   |   24 Feb 2019 1:30 AM GMT
మీ గొడవ సరే.. డబ్బులు పెట్టినోళ్ల సంగతేంటి?
X
ఈ శుక్రవారం ‘మిఠాయి’ అనే సినిమా వస్తున్నట్లు జనాలకు పెద్దగా తెలియదు. ఆ సినిమాకు ప్రచారమే లేదసలు. ఐతే రిలీజ్ తర్వాతి రోజు ‘మిఠాయి’ చర్చనీయాంశంగా మారింది. రిలీజైన రెండో రోజే ఇందులో హీరోగా నటించిన రాహుల్ రామకృష్ణ, దర్శకుడు ప్రశాంత్ కుమార్ ఒకరితో ఒకరు పోటీ పడి లెంగ్తీ స్టేట్మెంట్లు ఇచ్చారు. ముందుగా రాహుల్ ఈ సినిమాలో నటించడంపై విచారం వ్యక్తం చేస్తూ ప్రేక్షకులకు సారీ చెప్పడం చర్చనీయాంశమైంది. సినిమా బాలేదు కాబట్టే ప్రమోట్ చేయలేదని అతనన్నాడు. ఈ స్టేట్మెంట్ వచ్చిన కాసేపటికే దర్శకుడు ప్రశాంత్ కూడా రెస్పాండయ్యాడు. సినిమా పరాజయానికి బాధ్యత తీసుకున్నాడు. తనపై వ్యంగ్యాస్త్రాలు విసిరిన రాహుల్‌కు పరోక్షంగా సెటైర్లు వేశాడు.

ఐతే సినిమా ఫలితం గురించి నిజాయితీగా ఇద్దరూ అంగీకరించడం బాగానే ఉంది కానీ.. వీళ్లు ఈ పని చేసిన టైమింగే చాలా తప్పుగా అనిపిస్తోందరికీ. సినిమా రిలీజైన రెండో రోజే ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం ఎంత వరకు సమంజసం? సినిమా బాలేకపోయి ఉండొచ్చు. అంతమాత్రాన అది థియేటర్లలో ఉండగానే స్వయంగా హీరో, దర్శకుడు నెగెటివ్ స్టేట్మెంట్లు ఇవ్వడం భావ్యమా? ఈ సినిమాపై పెట్టుబడి పెట్టిన నిర్మాత - బయ్యర్ల పరిస్థితేంటి? పెట్టుబడి తక్కువ మొత్తమే కావచ్చు. అది రికవర్ అవుతుందా లేదా అన్నది తర్వాత సంగతి. కానీ రిలీజైన రెండో రోజే తమ సినిమా గురించి దర్శకుడు, హీరో ఇలాంటి స్టేట్మెంట్లివ్వడం నిర్మాతను, బయ్యర్లను దెబ్బ తీయడం, అగౌరవపరచడమే కదా? వీళ్ల నిజాయితీ, తెగువ చూపించే క్రమంలో నిర్మాతలు, బయ్యర్లను దెబ్బ తీయడం ఎంత వరకు సమంజసం?