Begin typing your search above and press return to search.

ప్రకృతి ప్లాస్టిక్ కానుకను తిరిగేచ్చిసిందా?

By:  Tupaki Desk   |   18 Aug 2018 5:47 PM GMT
ప్రకృతి ప్లాస్టిక్ కానుకను తిరిగేచ్చిసిందా?
X
ఎడతెరిపిలేని భారీ వర్షాలు కేరళను అతలాకులం చేసేశాయి. వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లి జలాశయాలు నిండిపోయాయి గేట్లు ఎత్తకపోతే ఆనకట్టలు బద్దలై జలప్రళయం తప్పదేమో అన్న పరిస్థితుల్లో గేట్లు ఎత్తినా జలప్రళయం తప్పలేదు. ఇప్పటికే అధికారికంగా 350కి పైగా మృత్యువాతపడగా లెక్కలకు అందని మరణాలు ఇంకా చాలా ఉంటాయని అంచనావేస్తున్నారు. అయితే.. వరదల వల్ల కలిగిన నష్టం ఇంత తీవ్రంగా ఉండడానికి ప్లాస్టిక్ భూతం కూడా కారణమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తాజాగా ఓ ఫొటో సోషల్ మీడియాను కుదిపేస్తుంది. కేరళలో ఓ బ్రిడ్జిపై నుంచి మూణ్ణాలుగు రోజులు పాటు ప్రవహించిన వరద నీరు తగ్గిన తరువాత అక్కడ భారీగా పేరుకుపోయిన ప్లాస్టిక్ సీసాల చిత్రం ట్విటర్ వేదికగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ చిత్రాన్ని మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఎస్‌వై ఖురేషీ ట్విటర్‌లో పోస్ట్ చేయగా దాన్ని వందలాది మంది షేర్ చేశారు. తెలుగు సినీ రంగానికి చెందిన రాహుల్ రవీంద్రన్ కూడా కొద్దిసేపటి ఇదే చిత్రాన్ని పోస్ట్ చేశారు. ఇదిప్పుడు ‘ప్రకృతికి మనం ఇచ్చిన బహుమతిని అది మనకు కృతజ్ఞతతో తిరిగిచ్చేసింది’ అన్న కామెంట్‌తో షేర్ అవుతోంది.

గత నెలలో కూడా ఇలాంటి పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ముంబయిలోని సముద్ర తీరంలోని ఒక వంతెనపై పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాల చిత్రం అది. అలలు ఒక్క సారిగా తీవ్రమై ఆ వంతెన పైనుంచి సముద్రపు నీరు ఉప్పొంగి.. ఆ తరువాత నీరు తగ్గినప్పుడు వంతెన మొత్తం ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయింది. ముంబయి నగర అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ కిరణ్ దిగావ్కర్ ఆ చిత్రాన్ని షేర్ చేశారు.

ఇక కేరళ విషయానికొస్తే గత కొద్దికాలంగా అక్కడి నగరాలు, పట్టణాల్లో ప్లాస్టిక్‌ను నిషేధిస్తున్నారు. అయితే, ఇందులో ఎక్కువగా నిషేదం ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వరకే పరిమితం అవుతోంది. అది కూడా అమలు అంతంతమాత్రమే. కేరళ సుచిత్వ మిషన్ అనే సంస్థ చేసిన అధ్యయనం ప్రకారం కేరళలో ప్రతి కుటుంబం సగటున రోజుకు 60 గ్రాముల ప్లాస్లిక్ వ్యర్థాలకు కారణమవుతోంది. అందుకే ఆ రాష్ట్రంలో రోజుకు 480 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తవుతున్నాయి.

ప్లాస్టిక్ వ్యర్థాల సమస్య నుంచి గట్టెక్కడానికి ఆ రాష్ట్రంలో కొత్తగా వేసే రోడ్లలో 20 శాతం ఇలాంటి వ్యర్థాలతో వేయాలని కూడా నిర్ణయించారు. భారీ వర్షాలకు నిండిపోయిన ఇడుక్కి డ్యామ్ గేట్లు ఎత్తడంతో వరద నీటితో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలు కూడా దిగువకు ముంచెత్తుతున్నాయి. ఇడుక్కి డ్యామ్ గేట్లు 26 సంవత్సరాల తరువాత ఎత్తడం.. ఏటా ఆ డ్యాంలోకి చేరి పెద్ద ఎత్తున పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను ఇప్పుడు ఊళ్లను - పట్టణాలను ముంచెత్తుతున్నాయి. మిగతా డ్యాంల గేట్లు ఎత్తడంతో అక్కడా అదే పరిస్తితి. అలాగే మున్సిపాలిటీలు - కార్పొరేషన్లు పట్టణాల్లో సేకరించిన చెత్తను ఒకచోట వేయడం - అలా పేరుకుపోయిన గుట్టలు కూడా వరద నీటికి కరగడంతో పెద్దఎత్తున ప్లాస్టిక్ కేరళను ముంచెత్తుతోంది.