Begin typing your search above and press return to search.

ట్యాక్సీవాలా.. దర్శకుడి సినిమా

By:  Tupaki Desk   |   19 Nov 2018 5:30 PM GMT
ట్యాక్సీవాలా.. దర్శకుడి సినిమా
X
షార్ట్ ఫిలిమ్స్ తో సత్తా చాటి.. ఆ తర్వాత ‘ది ఎండ్’ అనే విభిన్నమైన ఫీచర్ ఫిలింతో టాలీవుడ్ కు పరిచయం అయిన దర్శకుడు రాహుల్ సంకృత్యన్. ‘ది ఎండ్’ చాలా మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. ప్రేక్షకులకు విభిన్న అనుభూతిని పంచింది. కానీ ఆ చిత్రాన్ని సరిగా ప్రమోట్ చేయకపోవడంతో జనాల్లోకి వెళ్లలేదు. అయినా నిరాశ చెందకుండా ‘పెళ్ళిచూపులు’తో సత్తా చాటిన విజయ్ దేవరకొండ హీరోగా ‘ట్యాక్సీవాలా’ మొదలుపెట్టాడు రాహుల్. గీతా ఆర్ట్స్.. యువి క్రియేషన్స్ లాంటి పెద్ద బేనర్లు కలిసి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు రావడంతో రాహుల్ ఆనందానికి అవధుల్లేవు. కానీ ఈ సినిమా మేకింగ్ మాత్రం రాహుల్ అనుకున్నంత సులువుగా సాగలేదని చిత్ర వర్గాల సమాచారం.

‘ట్యాక్సీవాలా’ మొదలయ్యాక ‘అర్జున్ రెడ్డి’ రిలీజైంది. విజయ్ స్టార్ అయిపోయాడు. అతడి ఇమేజ్ మారిపోయింది. ఈ నేపథ్యంలో ‘ట్యాక్సీవాలా’ ముందు అనుకున్నట్లుగా తీస్తే విజయ్ ఇమేజ్ కు సూటవ్వదని.. హీరోయిజం పెంచాలని.. పాత్ర నిడివి పెంచాలని.. కథ కూడా కొంచెం మార్చాలని చిత్ర నిర్మాతల నుంచి ఒత్తిడి వచ్చినట్లు సమాచారం. యువి క్రియేషన్స్ సైతం కథ మార్చాలని రాహుల్ కు సూచించినట్లు తెలిసింది. కానీ అలా చేస్తే కథ చెడిపోతుందని భావించి రాహుల్ ఒప్పుకోలేదట. ఎవరెంత ఒత్తిడి తెచ్చినా అతను మాత్రం తాను అనుకున్న ప్రకారమే సినిమా తీయాలని పట్టుబట్టాడు. దీంతో యువి.. గీతా వర్గాలకు రాహుల్ తీరు నచ్చలేదట. ఈ నేపథ్యంలో ఎస్కేఎన్ పేరు తెరమీదికి వచ్చిందట. నిర్మాతగా అతడిని ముందు పెట్టి గీతా.. యువి వర్గాలు వెనక్కి తగ్గినట్లు సమాచారం. ‘ట్యాక్సీవాలా’ను పక్కన పెట్టి ‘గీత గోవిందం’ను గీతా ఆర్ట్స్ ముందు రిలీజ్ చేయడానికి కూడా ఇదే కారణం అనుకుంట!

ఇదిలా ఉంటే వీఎఫెక్స్ పనుల్లో జాప్యం.. పైరసీ లాంటి సమస్యలు ‘ట్యాక్సీవాలా’ను చుట్టు ముట్టాయి. దీంతో ఈ సినిమా ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లోనూ దర్శకుడు రాహుల్ ధైర్యంగా నిలబడ్డాడు. తన సినిమాపై నమ్మకం పెట్టాడు. తాను కోరుకున్న ఔట్ పుట్ కు తీసుకొచ్చాడు. సినిమాను విడుదలకు సిద్ధం చేశాడు. మధ్యలో బన్నీ వాసు లైన్లోకి వచ్చి సినిమా చూసి ఇది ఆడుతుందని గీతా.. యువి వర్గాలకు భరోసా ఇచ్చినట్లు సమాచారం. దర్శకుడికి కూడా అతను మద్దతుగా నిలిచాడు. ఐతే ‘ట్యాక్సీవాలా’ రిలీజవుతున్న టైంలో దర్శకుడికి ప్రమోషన్లలో పెద్దగా ప్రాధాన్యం దక్కకపోవడం.. ప్రి రిలీజ్ ఈవెంట్లో కూడా రాహుల్ అందరిలో ఒకడిలా ఒక మూలన ఉండిపోవడం చర్చనీయాంశమైంది. ఐతే ఏం జరిగినప్పటికీ రాహుల్ మాత్రం సైలెంటుగానే ఉన్నాడు. ఇప్పుడు అతడి సినిమా మాట్లాడుతోంది. ‘ట్యాక్సీవాలా’ సక్సెస్ లో మేజర్ క్రెడిట్ అతడిదే అని సినిమా చూసిన వాళ్లందరూ అంగీకరిస్తున్నారు. ఇందులో విజయ్ బాగా చేశాడు కానీ.. అతను సినిమాలో ఒక పాత్రలా కనిపిస్తాడు కానీ.. ‘గీత గోవిందం’లో మాదిరి సక్సెస్ లో మేజర్ క్రెడిట్ అతడిదే అనలేం. ‘ట్యాక్సీవాలా’ దర్శకుడి సినిమా. ఎన్ని అడ్డంకులైనా ధైర్యంగా నిలబడి.. తాను నమ్మిన ప్రకారం సినిమా తీసి.. దాన్ని ప్రేక్షకులు మెచ్చేలా చేసిన రాహుల్ రియల్ హీరోగా నిలిచాడు. మరి ఇప్పటికైనా నిర్మాతలు ‘ట్యాక్సీవాలా’ విజయంలో మేజర్ క్రెడిట్ దర్శకుడికిచ్చి అతడిని గౌరవిస్తారేమో చూడాలి.