Begin typing your search above and press return to search.

‘కావ్యం’ చేద్దామంటే.. ‘మెంటల్ మదిలో’ సెట్టయిందట

By:  Tupaki Desk   |   21 Nov 2017 9:22 AM GMT
‘కావ్యం’ చేద్దామంటే.. ‘మెంటల్ మదిలో’ సెట్టయిందట
X
పెళ్లిచూపులు’ సినిమాతో వెలుగులోకి వచ్చిన నిర్మాత రాజ్ కందుకూరి. ఆయన అంతకుముందు కూడా సినిమాలు నిర్మించాడు. స్వీయ దర్శకత్వంలోనూ సినిమా తీశాడు. కానీ అవేవీ ఆయనకు పేరు తేలేదు. కానీ ‘పెళ్లిచూపులు’ సినిమాతో ఎనలేని పేరు సంపాదించాడు. ‘పెళ్లిచూపులు’ తర్వాత సినిమా నిర్మించే విషయంలో తొందరపడకుండా వెయిట్ చేసి ఇప్పుడు ‘మెంటల్ మదిలో’ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాకు ప్రి రిలీజ్ బజ్ బాగానే ఉంది. ‘పెళ్లిచూపులు’ తరహాలోనే దీనికి కూడా సెలబ్రెటీల కోసం ముందే ప్రివ్యూలు వేస్తున్నారు. ఫీడ్ బ్యాక్ కూడా బాగుంది. ఐతే ఈ చిత్ర దర్శకుడు వివేక్ ఆత్రేయ తనకు ముందు చెప్పిన కథ ‘మెంటల్ మదిలో’ కాదని రాజ్ తెలిపాడు.

నిత్యామీనన్ కథానాయికగా ‘కావ్యం’ అనే సినిమా తీద్దామంటూ వివేక్ ముందు తన దగ్గరికి వచ్చినట్లు వెల్లడించాడు రాజ్. ఆ స్క్రిప్టు మీద చాలా హోం వర్క్ చేసి.. రెఫరెన్సుల కోసం చాలా ఫొటోలు తీసుకుని.. తన దగ్గరికి వచ్చాడని.. ఆ కథ నిత్యా మీనన్‌కు కూడా నచ్చిందని.. ఆమె సినిమా చేయడానికి ఓకే చెప్పందని అతను తెలిపాడని.. ఐతే ఆ కథ చాలా పొయెటిగ్గా ఉండటంతో ఇలాంటిది వర్కవుట్ కాదని తాను అతడిని వెనక్కి పంపించేసినట్లు రాజ్ చెప్పాడు. వారం రోజుల తర్వాత వివేక్ మళ్లీ తనకు ఫోన్ చేసి ఇంకో కథ ఉందని చెప్పాడని.. కానీ అతడి శైలి ఏంటో తెలుసు కాబట్టి తాను మళ్లీ కథ వినడానికి అంగీకరించలేదని.. రెండు మూడు సార్లు అడగడంతో ఒప్పుకుని కథ విన్నానని.. ఫస్టాఫ్ ఒక రోజు.. సెకండాఫ్ ఇంకో రోజు చాలా టైం పెట్టి కథ విన్నానని చెప్పాడు. తాను ఈ సినిమా చేయడానికి ఒప్పుకుంటానా లేదా అన్న మీమాంసలో వివేక్ ఆత్రేయ ఉండగా.. అతడితో సెల్ఫీ దిగి.. ఇతనే నా తర్వాతి సినిమా డైరెక్టర్ అంటూ ఫేస్ బుక్‌ లో పోస్ట్ చేసినట్లు రాజ్ వెల్లడించాడు.