Begin typing your search above and press return to search.

అది పోర్న్ కాదు.. వెబ్ సిరీస్.. రాజ్ కుంద్రా లాయర్ వింత వాదన

By:  Tupaki Desk   |   22 July 2021 1:30 PM GMT
అది పోర్న్ కాదు.. వెబ్ సిరీస్.. రాజ్ కుంద్రా లాయర్ వింత వాదన
X
అశ్లీల చిత్రాలు తెరకెక్కించిన కేసులో అరెస్ట్ అయిన రాజ్ కుంద్రా వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న రాజ్ కుంద్రా కేసుపై విచారణ జరుగుతోంది. ఈ క్రమంలోనే రాజ్ కుంద్రా తరుఫున లాయర్ తాజాగా కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చారు. అసలు రాజ్ కుంద్రా తీసినవి అశ్లీల వీడియోలు కావని వాదించారు.

ఈ నేపథ్యంలో తాజాగా రాజ్ కుంద్రా తరుఫు న్యాయవాది కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్ కుంద్రాను అరెస్ట్ చేయడానికి కారణమైన వీడియో షూట్ కేవలం వెబ్ సిరీస్ కు సంబంధించినది అని ఆయన స్పష్టం చేశారు. అశ్లీల చిత్రం అది కానే కాదు అని స్పష్టం చేశారు.

ఈ మధ్య వెబ్ సిరీస్ లు అసభ్యకరంగా తీస్తున్నారని.. ఇది కూడా అలాంటి సిరీసే తప్ప అశ్లీల వీడియో కాదని రాజ్ కుంద్రా లాయర్ కోర్టులో వాదించారు. చట్టంలో ఉన్న సెక్షన్ల ప్రకారం ఇద్దరు వ్యక్తులు కెమెరా ముందు శృంగారం చేస్తున్నట్లు కనిపిస్తే దాన్ని అశ్లీలం గా పరిగణించాలి. అలా కాకుండా ఇతర ఏ సన్నివేశాలను అశ్లీలం కింద పరిగణించాల్సిన అవసరం లేదు అని రాజ్ కుంద్రా తరుఫున న్యాయవాది అబద్ పొండ తాజాగా కోర్టులో వాదించారు.

ప్రస్తుతం అరెస్ట్ అయిన రాజ్ కుంద్రా బెయిల్ పిటీషన్ ను ఆయన తరుఫు న్యాయవాది కోర్టులో దాఖలు చేశారు. ఈ విచారణలో భాగంగా అసలు అశ్లీల వీడియోలు రాజ్ కుంద్రా తీయలేదని.. అది కేవలం వెబ్ సిరీస్ అంటూ ఆయన తరుఫు లాయర్లు కోర్టులో వాదించారు. ఈ క్రమంలోనే కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది.

ముంబై పోలీసులు ప్రముఖ వ్యాపారవేత్త, శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రాజ్ కుంద్రాను కోర్టులో హాజరుపరచగా అతడి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని జూలై 23 వరకు కోర్టు పోలీసు కస్టడీకి పంపింది. 45 ఏళ్ల కుంద్రాపై నమోదైన కేసు అశ్లీల వీడియోలు తీయడం.. కొన్ని యాప్‌ల ద్వారా పోస్ట్ చేసినందుకు అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

రాజ్ కుంద్రాతోపాటు ముంబై పోలీసులు అతడి భాగస్వామి ర్యాన్ థార్ప్ ను కూడా అరెస్ట్ చేశారు. అయితే తనను మెంటల్ టార్చర్ కు గురిచేశారని ఒక నటి ఫిర్యాదుతోనే రాజ్ కుంద్రా డొంకంతా కదిలిందని ముంబై సర్కిల్స్ మీడియాలో చర్చ సాగుతోంది. ఈ కేసులో రాజ్ కుంద్రా కంటే ముందు నలుగురిని అరెస్ట్ చేశారు. ఈ నిందితుల వాంగ్మూలం, సాంకేతిక కారణాల ఆధారంగా రాజ్ కుంద్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో రాజ్ కుంద్రా ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.