Begin typing your search above and press return to search.

వర్మపై రాజ్ తరుణ్ సెన్సేషనల్ కామెంట్స్

By:  Tupaki Desk   |   6 Nov 2015 4:27 AM GMT
వర్మపై రాజ్ తరుణ్ సెన్సేషనల్ కామెంట్స్
X
తన చేతికి చిక్కిన వాళ్లందరినీ ట్విట్టర్ లో ఆడేసుకుంటుంటాడు రామ్ గోపాల్ వర్మ. కానీ అతణ్నే ఆడేసుకున్నాడు ఓ కుర్రాడు. ఆ చిచ్చరపిడుగు మరెవరో కాదు.. యువ కథానాయకుడు రాజ్ తరుణ్. ఐతే వర్మతో ఏదైనా ఒప్పందం చేసుకుని ఈ మాటలన్నాడో.. లేక ఇంకేదైనా ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశాడో తెలియదు కానీ.. మొత్తానికి వర్మ గురించి జనాలకు దిమ్మదిరిగిపోయే కామెంట్స్ చేశాడు రాజ్ తరుణ్. త్వరలోనే వర్మతో ఓ సినిమా చేయబోతున్న రాజ్.. ఆ సంగతి వెల్లడిస్తూ వర్మపై సెన్సేషనల్ కామెంట్లు చేశాడు.

‘‘ఆర్జీవీతో ఓ సినిమా చేయబోతున్నా. అతను జస్ట్ ఓకే ఓకే డైరెక్టర్. అతడికి నేను పెట్టిన పెట్ నేమ్ అప్పారావు’’.. ఇదీ రాజ్ తరుణ్ తొలి ట్వీట్. కుర్రాడు అంతటితో ఆగలేదు. ఆ తర్వాత ‘‘నేను నిజాయితీగా ఫీలవుతున్నా.. నేను డైరెక్టర్ అయి ఉంటే రంగీలా - శివ కంటే చాలా బెటర్ సినిమాలు చేసి ఉండేవాణ్ని. అయినప్పటికీ ఆర్జీవీ ఓకే ఓకే’’ అని ఇంకో ట్వీట్ చేశాడు. చివరగా.. ‘‘ఆర్జీవీ జస్ట్ ఒక ‘ఓకే’ డైరెక్టర్ అయినప్పటికీ అతడితో సినిమా ఎందుకు చేస్తున్నానంటే.. నేనతడి తప్పుల్ని సరిదిద్దగలనన్న నమ్మకంతోనే’’ అని ట్వీట్ చేశాడు రాజ్ తరుణ్.

కొసమెరుపు ఏంటంటే.. ఈ ట్వీట్లపై వర్మ కూడా స్పందించాడు. ‘‘రాజ్ తరుణ్ నటుడిగా కంటే దర్శకుడిగా నాకన్నా, పూరి జగన్నాథ్ - వి.వి.వినాయక్- రాజమౌళి తదితరులకన్నా సామర్థ్యం ఉన్నవాడని నిజంగా నమ్ముతున్నా’’ అన్నాడు వర్మ.