Begin typing your search above and press return to search.

హీరోని పైరసీ లింక్ అడిగిన ఫ్యాన్

By:  Tupaki Desk   |   18 Sep 2017 4:46 AM GMT
హీరోని పైరసీ లింక్ అడిగిన ఫ్యాన్
X
సినిమా నటులతో మాట్లాడటమంటే ఓ రకంగా అరుదైన అవకాశమే. ఈమధ్య సోషల్ మీడియా పుణ్యమా అని వాళ్లతో నేరుగా ఇంటరాక్ట్ అయ్యే అవకాశం లభిస్తోంది. ట్విట్టర్ లోనో... ఫేస్ బుక్ లోనే తమ ఫేవరెట్ యాక్టర్లను ఫాలో అయ్యే అభిమానులు తక్కువేమీ కాదు. ఒకవేళ అభిమానులు ఏమన్నా ప్రశ్నలు వేసినా.. పలకరించినా హాయ్ అనో.. మీ తర్వాత సినిమా ఏమిటనో.. మీ ఫేవరెట్లు ఏంటనో ప్రశ్నలు వేస్తారు. కానీ రీసెంట్ గా టాలీవుడ్ యంగ్ హీరోకు అభిమాని నుంచి బుర్ర తిరిగిపోయే ప్రశ్న వచ్చింది.

రాజ్ తరుణ్ హీరోగా ఈమధ్య అంధగాడు అనే సినిమా వచ్చింది. కుమారి 21ఎఫ్ లో అతడితో కలిసి నటించిన హెబ్బా పటేల్ మరోసారి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఈ సినిమా పైరసీ కాపీ చూడటానికి సాయం చేయమంటూ ఓ అభిమాని ట్విట్టర్ లో ఈ యంగ్ హీరోని అడిగాడు. ‘‘భయ్యా.. దయచేసి అంధగాడు పైరసీ లింక్ ఇవ్వవా’ అంటూ డైరెక్ట్ గా రాజ్ తరుణ్ నే కోరాడు. దీనికి రాజ్ తరుణ్ డీసెంట్ గానే స్పందించాడు. ‘నా సినిమా పైరసీ లింక్ నన్నే అడుగుతున్నావా సోదరా.. ఇది అన్యాయం కదా’ అంటూ రిప్లయ్ ఇచ్చాడు.

అసలే ఓ పక్క చిత్ర పరిశ్రమ పైరసీ దెబ్బకు విలవిలాడిపోతోంది. సినిమా రిలీజై రెండు మూడు రోజులు కాకముందే సెల్ ఫోన్ల వరకు వచ్చేస్తోంది. తమిళ చిత్ర పరిశ్రమ అయితే పైరసీతో ఓ రకంగా యుద్ధం చేస్తోంది. పైరసీని ఎంకరేజ్ చేయొద్దు బాబో అంటూ హీరోలంతా మైకులు ముందేసుకుని మరీ చెబుతుంటే రాజ్ తరుణ్ అభిమాని మాత్రం వాళ్లూవీళ్లూ వేస్టని ఏకంగా హీరోనే లింక్ అడిగేశాడు. ఏమయినా ఇలాంటి అభిమానులు అరుదే.